2022 MG Hector | సరికొత్త రూపంతో, మరిన్ని అప్‌డేట్‌లతో రాబోతున్న ఎంజీ హెక్టర్!
27 July 2022, 15:00 IST
- MG మోటార్ ఇండియా నెక్ట్స్-జెన్ హెక్టర్ వాహనానికి సంబంధించిన టీజర్‌ను ఆవిష్కరించింది. ఈ సరికొత్త వాహనంలో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉండబోతున్నాయి, లాంచ్ ఎప్పుడో తెలుసుకోండి.
2022 MG hector
MG మోటార్ ఇండియా నెక్ట్స్-జెన్ హెక్టర్ వాహనానికి సంబంధించిన టీజర్‌ను ఆవిష్కరించింది. ఈ వాహనం ద్వారా భారత ఆటోమొబైల్ మార్కెట్లో మళ్లీ తన వైభవం చాటాలని భావిస్తోంది. MG హెక్టర్ భారతదేశంలో మొట్టమొదటి ఇంటర్నెట్ కార్‌గా పరిచయం అయింది. అనతి కాలంలోనే స్థిరపడగలిగిన బ్రాండ్‌లలో MG ఒకటి. హెక్టర్, గ్లోస్టర్, ఆస్టర్, ZS EV వంటి వాహనాలతో ఈ బ్రిటీష్ కంపెనీ ఆకట్టుకుంది. అయితే మహీంద్రా XUV700 రాకతో MG హెక్టర్ నంబర్ 1 టైటిల్‌ను కోల్పోయింది. టాటా సఫారీ, హారియర్ వంటి వాహనాలు కూడా కూడా MG హెక్టర్ మార్కెట్ ను దెబ్బతీశాయి. కొత్త తరం హెక్టర్ సహాయంతో కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందాలని MG భావిస్తోంది.
సరికొత్త 2022 MG హెక్టర్ SUVలో 14 అంగుళాల టచ్‌స్క్రీన్ హైలైట్ అవుతోంది. ఈ సెగ్మెంట్లో ఇదే అతిపెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఈ సిస్టమ్‌తో సినిమాటిక్, లీనమయ్యే అనుభవాన్ని అందించనుంది. హెక్టర్ క్యాబిన్ భాగం చాలా విలాసవంతమైనదిగా కనిపిస్తుంది. . గేర్ లివర్ కూడా కొత్తది. డ్యాష్‌బోర్డ్ మొత్తం నల్లగా ఉంది, కొత్త డిజైన్‌తో కనిపిస్తుంది. ఇన్‌సైడ్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు రివీల్ అయింది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
2022 MG హెక్టర్ వాహనంలో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్స్, రాడార్ ఆధారిత అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్‌తో పార్కింగ్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి డ్రైవర్ అసిస్ట్ ఫీచర్లు ఉంటాయి.
యాంత్రికంగా, 2022 MG హెక్టర్ కొత్త జెన్ ప్రస్తుత మోడల్‌కు సమానంగా ఉంటుంది. ఇది రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. మొదటిది 1.5L 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్, ఇది 140bhp శక్తి 250 Nm టార్కును విడుదల చేయగలదు. ఈ ఇంజన్ ను 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా CVTతో జతచేయవచ్చు.
మరొక ఇంజన్ 2.0L టర్బో-డీజిల్ ఇంజన్ స్టెల్లాంటిస్ (పేరెంట్ టు ఫియట్-క్రిస్లర్) నుంచి తీసుకున్నది. ఇది హారియర్, సఫారి, కంపాస్, మెరిడియన్ వంటి వాహనాలకు సమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ డీజిల్ ఇంజన్ 168 bhp శక్తి 350 Nm టార్క్ విడుదల చేయగలదు. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే జత చేసి ఉంటుంది. ఈ పండగ సీజన్ లో 2022 MG Hector లాంచ్ కాబోతుంది.