Lemon Dal Recipe । నిమ్మకాయ పప్పు.. కమ్మని రుచితో పాటు ఆరోగ్యం కూడా!
14 June 2023, 13:13 IST
- Lemon Dal Recipe: వేసవిలో నిమ్మరసం తీసుకోవడం వల్ల వేడిని అధిగమించవచ్చు, అలాగే పెసరిపప్పు శీతలికరణ లక్షణాలను కలిగి ఉంటుంది, ఈ రెండింటితో చేసే నిమ్మకాయ పప్పు రెసిపీని ఇక్కడ చూడండి
lemon dal recipe
Healthy Summer Recipes: తెలుగు భోజనంలో పప్పును ప్రధానంగా వడ్డిస్తారు. అయితే ఈ పప్పును మనం చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇక్కడ నిమ్మకాయ పప్పు రెసిపీ గురించి తెలియజేస్తున్నాం. బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మిమ్మల్ని చల్లబరిచే ఆహారం కోసం చూస్తున్నట్లయితే మీకు నిమ్మకాయ పప్పు సరైన ఆహారం. వేసవిలో నిమ్మరసం తీసుకోవడం వల్ల వేడిని అధిగమించవచ్చు, అలాగే పెసరిపప్పు శీతలికరణ లక్షణాలను కలిగి ఉంటుంది, ఈ రెండింటి కలయికతో చేసే నిమ్మకాయ పప్పు వేసవిలో అద్భుతమైన ఆహారంగా మారుతుంది.
నిమ్మకాయ పప్పు రెసిపీలో ఎక్కువగా ఎలాంటి మసాలా దినుసులు వేయము. కాబట్టి ఇది తేలికైన, రిఫ్రెష్ భోజనం అవుతుంది. అంతేకాకుండా ఇందులో ప్రోటీన్లు, విటమిన్ సి వంటి పోషకాలతో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యానికి ఈ వంటకం చాలా మంచిది. నిమ్మకాయ పప్పును ఎలా చేయాలో ఈ కింద ఇచ్చిన సూచనలు చదవండి.
Lemon Dal Recipe కోసం కావలసినవి
- 1/2 కప్పు పెసర పప్పు
- 1 టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం
- 1/2 స్పూన్ పసుపు పొడి
- 1 అంగుళం అల్లం ముక్క
- 1/2 టీస్పూన్ ఆవాలు
- 1/2 స్పూన్ జీలకర్ర
- 1 ఎండు మిర్చి
- 2 పచ్చిమిర్చి
- 1 స్పూన్ నూనె
- 1 కరివేపాకు రెమ్మ
- గార్నిషింగ్ కోసం కొత్తిమీర
- రుచికి తగినంత ఉప్పు
నిమ్మకాయ పప్పు తయారీ విధానం
- ముందుగా పప్పును నీటిలో కడిగండి, అనంతరం కుక్కర్ లో వేసి 1 1/2 కప్పుల మంచి నీరు పోసి, కొద్దిగా పసుపు కూడా వేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి. లేదా మీరు కుక్కర్ వద్దనుకుంటే ఏ పాత్రలోనైనా పప్పును మెత్తగా ఉడికించుకోండి.
- ఈలోగా పచ్చిమిర్చిని, అల్లంను ముక్కలుగా కట్ చేసుకోండి. ఇతర పదార్థాలను సిద్ధం చేసుకోండి.
- ఇప్పుడు మెత్తగా ఉడికిన పప్పును ఒక బాణలిలో తీసుకోండి, అందులో మరొక కప్పు నీరు, రుచికి సరిపాడా ఉప్పు కలపండి. గ్రేవీలా మారేవరకు మరో 5-6 నిమిషాలు మామూలుగా ఉడికించండి.
- ఆపైన స్టవ్ ఆఫ్ చేసి, తాజాగా పిండిన నిమ్మరసంను పప్పులో వేసి బాగా కలిపి, పక్కన ఉంచుకోండి.
- ఇప్పుడు ఒక చిన్న పాన్ లో నూనె వేడి చేసి, ముందుగా ఆవాలు వేయించండి. ఆపై జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి. అలాగే అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి, పోపు పెట్టుకోవాలి.
- ఈ పోపును పప్పులో వేసి బాగా కలపండి, చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి.
అంతే, నిమ్మకాయ పప్పు రెడీ. దీనిని అన్నం లేదా రోటీలతో తింటూ ఆస్వాదించండి.