తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Goat Head Gravy Recipe : మేక తలకాయ కూరను ఇలా వండండి.. కుమ్మిపడేస్తారు

Goat Head Gravy Recipe : మేక తలకాయ కూరను ఇలా వండండి.. కుమ్మిపడేస్తారు

Anand Sai HT Telugu

18 February 2024, 11:00 IST

    • Talakaya Kura Recipe In Telugu : మేక తలను సరిగ్గా వాడితే చాలా టేస్టీగా ఉంటుంది. మెుత్తం లాగించేస్తారు. చాలా మందికి ఈ రెసిపీ అంటే ఇష్టం. మేక తలను కూరగా ఎలా వండాలో చూద్దాం..
తలకాయ కూర గ్రేవీ
తలకాయ కూర గ్రేవీ (Unsplash)

తలకాయ కూర గ్రేవీ

ఆదివారం వచ్చిందంటే చాలా మంది నాన్ వెజ్ తినేందుకు ఇష్టపడతారు. కొందరికి మటన్ ఇష్టమైతే.. మరికొందరికి చికెన్ ఇష్టం. కానీ నాన్ వెజ్ మాత్రం వండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చాలా మంది ఆదివారం రోజున ఇంట్లో రకరకాల మాంసాహార వంటకాలు వండుకుంటూ సెలవులను బాగా గడుపుతారు.

అయితే ఎప్పుడూ చికెన్, మటన్ తినడం అనేది సహజం. కానీ ఒక్కసారి మేక తలకాయ కూర వండి చూడండి. చాలా సూపర్‌గా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ రెసిపీని సులభంగా తయారు చేసుకోవచ్చు. మేక తల గ్రేవీని చేసేందుకు టైమ్ కూడా ఎక్కువగా పట్టదు. సులభంగా, రుచికరంగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

మేక తలకాయ కూరకు కావాల్సిన పదార్థాలు :

మేక తల కూర - 1/2 కిలోలు, ఉప్పు - కావలసినంత, పసుపు పొడి - 1/4 tsp, నూనె - 2 టేబుల్ స్పూన్లు, సోంపు - 1/2 tsp, లవంగాలు - 4, జీలకర్ర - 1/4 tsp, మిరియాలు - 1/4 tsp, బెరడు - 2 అంగుళాలు, కరివేపాకు - కొద్దిగా, అల్లం - చిన్న ముక్క, వెల్లుల్లి - 7, ఉల్లిపాయలు - 1 పిడికెడు, కొత్తిమీర - కొద్దిగా, కొబ్బరి తురుము - 1/4 కప్పు, నూనె - 2 చెంచాలు, సోంపు - 1/4 tsp, కరివేపాకు - కొద్దిగా, పచ్చిమిర్చి - 1, ఉల్లిపాయ - 1 పిడికెడు, టొమాటో - 2, కారం పొడి - 2 1/2 టేబుల్ స్పూన్.

మేక తలకాయ కూర తయారీ విధానం

మేక తలకాయను కట్ చేసినది తెచ్చుకోవాలి. నీళ్లతో బాగా కడగాలి. అవసరమైతే వేడి నీటితోనూ శుభ్రం చేసుకోవాలి.

ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసి కలిపి తలకాయ కూరను 3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టి అందులో నూనె పోసి వేడి అయ్యాక ఇంగువ, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి.

తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసి బాగా వేగించి స్టవ్‌ ఆఫ్‌ చేసి గిన్నెలో వేసి చల్లారనివ్వాలి.

మిక్సీ జార్‌లో వేయించిన ఉల్లిపాయ, కొబ్బరి తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా రుబ్బుకోవాలి.

ఇప్పుడు కుక్కర్‌ను పొయ్యి మీద పెట్టి.. అందులో 2 టేబుల్‌ స్పూన్ల నూనె పోసి వేడి అయ్యాక సోంపు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేగించాలి.

తర్వాత అందులో టొమాటోలు వేసి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా వేగించాలి.

తర్వాత కడిగిన తలకాయ కూర వేసి బాగా కలపాలి. కారం వేసి మిక్స్ చేయాలి.

తర్వాత రుబ్బిన మసాలా వేసి గ్రేవీకి కావల్సినంత నీళ్లు పోసి కలపాలి. కుక్కర్ మూతపెట్టి 8 విజిల్స్ వచ్చే వరకు వేచి చూడాలి. అంతే రుచికరమైన గోట్ హెడ్ కర్రీ గ్రేవీ రెడీ.

తదుపరి వ్యాసం