తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mothers Day 2024: ఎలాంటి మహిమలూ, మ్యాజిక్కులూ తెలియని సూపర్ హీరో అమ్మ, ఆమె ప్రేమే బిడ్డకు రక్ష

Mothers day 2024: ఎలాంటి మహిమలూ, మ్యాజిక్కులూ తెలియని సూపర్ హీరో అమ్మ, ఆమె ప్రేమే బిడ్డకు రక్ష

Haritha Chappa HT Telugu

12 May 2024, 5:00 IST

google News
    • Mothers day 2024: తల్లి తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా బిడ్డను కాపాడేందుకు ఏమైనా చేస్తుంది. ఆమె ఒక సూపర్ హీరో. ఎలాంటి మహిమలు, మ్యాజిక్కులు ఆమెకు తెలియదు. అయినా ఆమె నిజ జీవితంలో హీరోనే.
హ్యాపీ మదర్స్ డే
హ్యాపీ మదర్స్ డే

హ్యాపీ మదర్స్ డే

Mothers day 2024: అడవులకు దగ్గరగా ఉండే గ్రామం జరియా. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఆ గ్రామంలోనే ముగ్గురు పిల్లలతో నివసిస్తోంది కిరణ్ బేగా. ఆ ముగ్గురు పిల్లల్లో ఒకరు పసిబిడ్డ, మిగతా ఇద్దరకు నడకవచ్చు. ఇంటి ముందే మంట వేసుకొని ఒడిలో పసిబిడ్డతో కూర్చుని ఉంది. మిగతా బిడ్డలు ఇద్దరూ అక్కడే ఆడుకుంటున్నారు. ఎక్కడ నుంచి వచ్చిందో ఓ చిరుత పులి చడీ చప్పుడు లేకుండా వచ్చి ఒక పిల్లవాణ్ణి పట్టుకొని లాక్కెళ్ళసాగింది.

ఆ పిల్లవాడి అరుపులకు కిరణ్ వెనక్కి తిరిగి చూసింది. చిరుతపులి పిల్లాడిని పట్టుకొని పరుగులు తీయడం కనిపించింది. వెంటనే మిగతా ఇద్దరు పిల్లల్ని ఇంట్లో పెట్టి తన బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు చిరుత పులి వెంటపడింది. దాదాపు కిలోమీటర్ దూరం వరకు చిరుత పులి వెంట పరుగులు తీసింది. ఒక చోట చిరుతపులి పొదల్లో దాక్కుని చిన్నారిని పట్టుకొని కనిపించింది. వెంటనే పెద్ద కర్రను తీసుకొని పులి పైకి దూకింది తల్లి. తన ప్రాణం లెక్కచేయకుండా ఆ కర్రతో చిరుత పులిని చితక్కొడుతూనే ఉంది. దీంతో చిరుతపల్లి దెబ్బలకు తాళలేక చిన్నారిని వదిలేసింది. వెంటనే కొడుకుని ఒక చేత్తో పట్టుుని రెండో చేత్తో కర్రతో చిరుత పులిపై మళ్ళీ దాడి చేసింది. దీనితో చిరుత అడవిలోకి పరుగులు పెట్టింది. ఆ పోరాటంలో తల్లికి కూడా గాయాలయ్యాయి.

మరో శివంగి కథ...

ఢిల్లీలో ఆరు బయట ఆడుకుంటోంది నాలుగేళ్ల పాప. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చారు. ఆ నాలుగేళ్ల పాపను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. పాపను బండి పైకి ఎక్కించి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. పాప ఏడుపుకి తల్లి వేగంగా వచ్చి బైకుకు అడ్డం పడింది. బైకును ముందుకు పోనివ్వలేదు. ఒక చేత్తో బైకును మరో చేత్తో బిడ్డను పట్టుకొని... పట్టు విడవకుండా పోరాటం చేసింది. బైక్ ను వదలకపోవడంతో దుండగులు ఆ బండిని అక్కడ వదిలేసి

తమ వెంట తెచ్చుకున్న సంచిని కూడా కింద పడేసి పరుగులు పెట్టారు. ఆ సంచిలో తుపాకీలు కూడా ఉన్నాయి. తన నాలుగేళ్ల పాపను తల్లి కాపాడుకుంది.

ఈ రెండు ఘటనల్లో తల్లులు సాధారణ వ్యక్తులే. వారికి ఎలాంటి సూపర్ పవర్‌లు లేవు. మహిమలు, మ్యాజిక్‌లు తెలియదు. అయినా తమ ప్రాణాల్ని అడ్డేసి మరీ బిడ్డలను కాపాడుకున్నారు. అందుకే తల్లులను రియల్ సూపర్ హీరోలు అని పిలుస్తారు. బిడ్డ కోసం తల్లి ఎంతవరకైనా వెళుతుంది. తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెడుతుంది.

దేవుడు అన్ని చోట్లా ఉండలేడు కాబట్టే, మానసిక శక్తిని నింపిన అమ్మను బిడ్డకు తోడుగా పంపించాడు. అమ్మలో ఉన్న మానసిక శక్తి బిడ్డకు రక్షణ వలయంలా మారుతుంది. ఆమె ఉండగా బిడ్డకు హాని చేయడం ఎవరి తరం కాదు.

అమ్మ గురించి చెప్పమంటే వెంటనే ఎవరికి మాటలు రావు. ఎందుకంటే అనంతమైన అమ్మ ప్రేమను కొద్ది మాటల్లో కుదించి చెప్పడం చాలా కష్టం. ‘అమ్మా’ అని పిలిస్తే చాలు... ఆమె ఏ పనిలో ఉన్నా కూడా ప్రేమగా పలకడం తల్లికే చెల్లింది. భూదేవికి ఉన్నంత ఓర్పు అమ్మకు ఉంది. ముఖ్యంగా బిడ్డల విషయంలోనే ఆ ఓర్పు కనిపిస్తుంది. ప్రసవానికి వెళ్లే ముందు తన ప్రాణానికి ప్రమాదమని తెలిసినా కూడా బిడ్డ కోసం భరించడానికి సిద్ధమవుతుంది.

పిల్లల కోసం తన ఆకలిని చంపుకునే అమ్మలు ఎందరో. వారి ఎదుగుదల కోసం ఆమె ఆరాటానికి అంతే ఉండదు. భవనాలలో ఉన్నా, గుడిసెలో ఉన్నా ప్రతి ఒక్కరూ అమ్మ పాలతోనే పెరగాలి. పేదవారైనా, గొప్పవారైనా అమ్మ ప్రేమలో తేడా ఉండదు.

పిల్లల పుట్టుకకు చిరునామానే అమ్మ. ఆమె త్యాగం, ఆమె సహనం ఆమె శక్తి... ఇవే పిల్లలు ఎదగడానికి బాటలు వేస్తాయి. అమ్మ గుండె లోతు తెలుసుకోవాలంటే ముందుగా సముద్రం లోతును తెలుసుకోవాలి. కొవ్వొత్తులా కరిగిపోతూ పిల్లలకు వెలుగునిచ్చేందుకు అమ్మ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.

ప్రపంచంలోని ప్రతి తల్లి గొప్పతనాన్ని చాటి చెప్పేందుకే ఏటా మాతృ దినోత్సవం వస్తుంది. నిజానికి సంవత్సరంలో ఒక్కరోజే అమ్మ కోసం కేటాయించకూడదు. కుటుంబం కోసం తన జీవితాన్నే ధారపోసే అమ్మకు ప్రతిరోజూ కేటాయించినా రుణం తీరదేమో.

టాపిక్

తదుపరి వ్యాసం