Sunday motivation: ధనవంతుడిలా నటిస్తే పేదవారిలా మిగిలిపోతారు.. ఉన్నంతలో బతికితే ఉన్నతులవుతారు
28 July 2024, 5:00 IST
Sunday motivation: ధనం లేకున్నా ధనవంతులమని ప్రపంచాన్ని మోసం చేయాలనే ఆలోచన ఎంత వరకూ సమంజసం? అలాంటి ఆలోచన వల్ల నిజంగానే పేదవారిగా మారిపోతారు.
ధనవంతులుగా నటించడం
ధనవంతులెప్పుడూ వాళ్లని పది మంది డబ్బున్న వాళ్లుగా గుర్తించాలి అనుకోరు. చెప్పాలంటే అందరితో కలిసిపోయేలా సాదాసీదాగా ఉంటారు. కానీ వాళ్ల విలువ తెలియడం వల్ల మనలో వాళ్లు డబ్బున్న వాళ్లనే భావన దానికదే వచ్చేస్తుంది. డబ్బు ఉన్నట్లు వాళ్ల ఆహార్యం ఉండకపోయినా సరే మనకు వాళ్లు అలాగే కనిపిస్తారు. కొంత మంది మాత్రం డబ్బు లేకపోయినా పది మంది తమని బాగా ఉన్నవాళ్లు అనుకోవాలనే తాపత్రయంతో ఉంటారు. ఈ తప్పుడు ఆలోచన వల్ల వాళ్ల స్తోమతకు మించిన బట్టలు, వస్తువులు, కార్లు .. ఇలా ఇంకేవో కొంటుంటారు. అందరి నోటా డబ్బున్నవాళ్లమనే తప్పుడు భావనను సృష్టించాలనుకుంటారు. ప్రపంచాన్ని మోసం చేయాలనే ఈ ఆలోచన ఎంతవరకూ సమంజసం?
ఉన్నవాడిగా నటిస్తే ఉన్న డబ్బు పోతుంది..
స్తోమతకు తగ్గట్లు నడుచుకుని దానికి తగ్గ ఖర్చులే పెట్టుకుంటే ఉన్నంతలో సంతోషంగా ఉంటారు. అలా కాకుండా ధనవంతులుగా కనిపించాలని విచ్చలవిడి ఖర్చులు పెడితే పేదరికం లూబిలో తప్పకుండా ఏదో ఒక రోజు కూరుకుపోతారు. ధనం సంపాదించడం మీద దృష్టి పెట్టొచ్చు కానీ, ధనం ఉన్నట్లు కల్పిత ప్రపంచం సృష్టించడం మీద కాదు. భారీ పట్టు చీరలు, ఖరీదైన నగలు, జల్సాలు, తిరుగుళ్లు.. ఇవన్నీ మీ ధనాన్ని నశింపజేస్తాయి. మీరు సృష్టించాలనుకుంటున్న ఊహా ప్రపంచం కోసం అవసరం లేని ఖర్చులు పెడతారు. క్రమంగా పేదవారిగా మారి, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టిముట్టేస్తాయి.
నిజంగా ప్రపంచం మోసపోతుందా?
మీరెంత ప్రయత్నించినా, ఎన్ని డాబులు ప్రదర్శించినా మీ చుట్టూ జనాలకు మీ తాహతు గురించి ఒక అవగాహన ఉంటుంది. మీరు ధనవంతులమనే మాయచేసి వాళ్లని మోసం చేయలేరు. మీ మనసులో మీకు వాళ్లు మీరు ధనవంతులని అనుకుంటున్నారు అనే భావన ఉంటుంది అంతే. కానీ జనాలకు మీమీద అభిప్రాయం ఎన్ని బడాయిలకు పోయినా మారదు. ఉదాహరణకు మీరు మధ్య స్థాయి మనుషులు అయ్యుండి నిజంగానే బాగా ఖర్చు పెట్టి వజ్రాల నగలు వేసుకున్నారు అనుకోండి.. జనాలు దాన్ని గిల్టు నగ అనుకుంటారు తప్ప.. మీరు చెప్పినా నమ్మరు. మీముందు నటిస్తారంతే. కాబట్టి మీ విలువ మీరెంత మోసం చేయాలనుకున్నా పెరగదు.
ఇలా ఎందుకు ఆలోచిస్తారు?
అలా ధనవంతులుగా నటించడంతో కొందరికి ఆనందం దొరుకుతుందట. ఖరీదైన వస్తువు కొన్నప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. కానీ వాళ్లకన్నా ఖరీదు వస్తువులు కొనగలిగే వాళ్లున్నారనే విషయం అర్థం చేసుకోరు. అలాంటి వాళ్లని చూసిన ప్రతిసారీ నిరాశకు లోనవుతారు కూడా. దాంతో డబ్బులు వృథా చేయడం మొదలుపెడతారు. చూసేవాళ్లు మన గురించి గొప్పగా అనుకోవాలని అవసరం లేని ఖర్చులు చేయడం మొదలుపెడతారు.
ధనవంతులు ఎలా ఖర్చుపెడతారు?
డబ్బున్న వాళ్లు ఎవ్వరూ వాళ్ల సంపాదనను మించి ఖర్చు పెట్టరు. అలా ఖర్చు చేసేవాళ్లెవరు ధనవంతులుగా మిగలరు. సంపాదన ధనవంతుడిగా, ఖర్చులు పేదవాడిగా ఉండాలి. అప్పుడే సంపదకు విలువ. ఉదాహరణకు మీకు అవసరం లేకున్నా డాబు కోసం క్రెడిట్ కార్డు వాడటం మొదలుపెడితే, అనవసరమైన ఖర్చులు మీకు తెలీకుండానే పెరిగిపోతాయి. వాటి నుంచి బయటపడటానికి లోన్లు, అప్పులు చేయడం మొదలుపెడతారు. క్రమంగా ఆర్థికంగా నష్టపోతారు.
కాబట్టి ధనవంతులుగా నటించడం కన్నా, ధనవంతులుగా మారడానికి మీరు ప్రయత్నం చేయండి.