Sunday Quote : బాధను దూరం చేయండి.. కుదిరితే సంతోషాన్ని ఇవ్వండి..
24 July 2022, 5:25 IST
- జనాలు ఎలా ఉంటారంటే.. ఒక్కోసారి మనం చెప్పినవి మరచిపోతుంటారు. అవి మంచివైనా, చెడువైనా. మనం చేసినవి కూడా మరచిపోతుంటారు. అది కూడా మంచైనా, చెడు అయినా. చెడు చేస్తే క్షమించి వదిలేసే అవకాశం కూడా ఉంది. కానీ వాళ్లు మరచిపోనిది ఒకటుంది. అది ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదేనండి మీరు వాళ్లను ట్రీట్ చేసిన విధానాన్ని ఎప్పటికీ మరచిపోలేరు.
కోట్ ఆఫ్ ద డే
Sunday Motivation : కాలక్రమేణా సొసైటీలో, మనుషుల్లో, వివిధ రంగాల్లో మార్పులనేవి సహజం. వాటిలో కొన్ని గుర్తుంటాయి. కొన్ని గుర్తుండవు. అలాగే మనం ఒకరికి చేసే మంచి అయినా.. చెడు అయినా కాలక్రమేణా మరచిపోయే అవకాశముంది. ఎప్పుడో ఓసారి గుర్తు చేసుకోవడం తప్పా.. వారి లైఫ్లో వారు బిజీగా అయిపోతారు. అస్తమాను మిమ్మల్నే గుర్తుచేసుకోవడానికి మీరేమైనా దేవుడా? కాదు కదా. (ఒక్కోసారి దేవుడిని కూడా మరిచిపోయేంత బిజీగా ఉండేవారు కూడా ఉన్నారు.) పోని ఏదైనా సందర్భంలో మీరు చెప్పిన మాటలు గుర్తుంటాయా అంటే.. ఉంటాయని చెప్పలేము. ఎందుకంటే కొన్ని మాటలు ఆ సమయంలోనే ఎక్కువగా ప్రేరేపణ కలిగిస్తాయి. కొన్నికొంతకాలం తోడుంటాయి. తర్వాత అవి కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. అలాగే మీరు చెడుగా మాట్లాడినా వారు మరచిపోయే అవకాశముంది. ఇంతకీ ప్రజలు దేనిని గుర్తుపెట్టుకుంటారు అంటే? మీరు వారిని ట్రీట్ చేసిన విధానాన్ని మరచిపోరు.
ఒకడు మీ శత్రువే అనుకుందాం. అతను మీ మంచికోరే వాడు కాదు అని మీకు తెలిసినా.. మీ ఇంటికి వచ్చాడని అతనికి అతిథి మర్యాదలు చేసి.. మంచిగా ఉన్నారంటే.. అతను ఎలాంటి వాడైనా సరే.. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాడు. బాధతో ఎవరైనా మీ దగ్గరకొస్తే.. వారికి ఓదార్పునిచ్చి.. కాస్త సంతోషాన్ని ఇవ్వగలిగితే చాలు.. తనకి బాధ వచ్చిన ప్రతిసారి మీరు పక్కనుంటే బాగుంటాదని అతను భావిస్తాడు. మీ గురించి నలుగురికి చెప్తాడు.
అదే ఓ వ్యక్తి మీ వద్దకు ఓదార్పు కోసమో.. అవసరానికి ఆదుకోమనో వస్తో.. మీరు అతనికి హెల్ప్ చేయకపోగా.. నానా మాటలు అని.. ఛీదరించుకుంటే అతను చాలా బాధపడతాడు. కోపం వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని తిట్టుకుంటూనే ఉంటాడు. వాడిని ఆరోజు హెల్ప్ చేయమని అడిగితే చేయలేదు. పైగా నన్ను తిట్టాడు. ఈరోజు నేను వాడి కన్నా మంచి స్థానంలో ఉన్నా అని.. ఏదొక సందర్భంలో మిమ్మల్ని తలచుకుని తిట్టుకుంటూనే ఉంటాడు.
ఏ మనిషికైనా కావాల్సిందేమిటి సంతోషం. మరి మీరు వారికి బాధను ఇస్తే ఎలా? అందుకే మీ దగ్గరుండే ఎవరినైనా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. అన్నిసార్లు మీకు అది సాధ్యం కాకపోవచ్చు. కానీ వారిని అర్థం చేసుకుని ఓదార్పుగా నాలుగు మాటలు చెప్తే చాలు. వారిలోని బాధను కొంచెం తీసినా చాలు. లైఫ్లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఆ రోజు వాడే లేకపోతే నేను ఏమైపోయేవాడినో.. ఆరోజు తను చెప్పిన మాటల వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అని మీ గురించి ఏదొకటి గొప్పగా చెప్పుకుంటారు. మీకు గొప్పలు వస్తాయి ఇలా చేస్తే అని చెప్పడం కాదు. మిమ్మల్ని తలచుకుంటే వారు సంతోషంగా ఉంటారు అనేదే మేటర్.
కాబట్టి ఎల్లప్పుడూ కాకపోయినా.. కుదిరిన ప్రతిసారి వారికి కావాల్సింది వారికి ఇచ్చేయండి. మీరు వారిని సంతోషంగా, ప్రేమించేలా చేయగలిగితే.. వారు దానిని ఎప్పటికీ మరచిపోలేరు. దానికి బదులుగా మీకు ప్రేమను తిరిగి ఇస్తారు. ఒక వ్యక్తి మీ వల్ల సంతోషంగా ఉంటే మీరు కూడా గొప్పగా ఫీలవుతారు. సంతృప్తి చెందుతారు. మీరు ప్రతిచోటు నుంచి ప్రేమను పొందుతారు.
టాపిక్