Sunday Motivation : ఓ మనిషికి సాయం చేయడానికి కారణాలు వెతుక్కుంటున్నారా?
23 October 2022, 5:30 IST
- Sunday Motivation : మీ దగ్గర అవసరానికి మించి ఏది ఉన్నా.. దానిని ఎవరికైనా ఇవ్వడం నేర్చుకోండి. ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఏదో కారణం ఉండాల్సిన అవసరం లేదు. మీకు వద్దు అనుకునేది ఏదైనా.. మరొకరికి ఉపయోగపడొచ్చు. ఎవరికో ఎందుకు ఇవ్వాలి.. ఇది వేస్ట్ అయినా పర్లేదు అనుకోకండి. ఎవరికైనా దాని అవసరం ఉంటే.. వారికి ఇవ్వడం కోసం కారణాలు వెతుక్కోకండి.
కోట్ ఆఫ్ ద డే
Sunday Motivation : మనిషికి మనిషి సాయం చేయడం అనేది ఎప్పుడూ తప్పుకాదు. కాబట్టి ఎవరికి సాయం చేయడానికైనా ఏ రీజన్ అవసరం లేదు. వాళ్లకి అవసరముందని మీరు గ్రహిస్తే.. లేదా మీ దగ్గర ఎక్కువుంటే ఎదుటి వారికి సాయం చేయండి. అతి అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఒక్కోసారి మనకి అవసరం లేనిది మన దగ్గర ఎక్కువున్నా కూడా అది వేస్టే అవుతుంది. డబ్బులు ఉంటే వేస్ట్ ఎందుకవుతుంది అనుకోవచ్చు. డబ్బు కూడా మీకు కావాల్సినంత ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. దానికి మించి ఎక్కువ సంపాదించినా.. అది మీరు ఎంజాయ్ చేయలేరు.
మాకోసం కాదు ఫ్యూచర్ కోసం పిల్లల కోసం దాచుకుందాం అని ఇప్పటినుంచే గొడ్డులా కష్టపడి.. పిసినారిలా దాచుకుని.. పిల్లలకు ఇచ్చినా.. వాళ్లు దానిని చూసుకుని ఎంజాయ్ చేయడం ప్రారంభిస్తారు. లేదా.. చివరి నిముషంలో మిమ్మల్ని తీసుకెళ్లి ఏ అనాథాశ్రమంలోనో జాయిన్ చేస్తారు. లేదంటే.. మీ డబ్బును ఇంకా రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఏ లోటు లేకుండా పెరగడం వల్ల.. వాళ్లకి కష్టం ఏమిటో కూడా తెలియదు. కాబట్టి మీరు పిల్లల్ని అలా పెంచకండి. వాళ్లకి అవసరమైనది.. అవసరమైన టైంలో ఇస్తే చాలు. మీకు, పిల్లలకు, కుటుంబానికి ఎంత అవసరమో అంతే ఉంచుకోండి. మిగిలినది.. అవసరంలో ఉన్నవారికి ఇవ్వండి.
సాయం ఎప్పుడూ డబ్బు రూపంలోనే కాదు.. వస్తు రూపంలో, తిండి రూపంలో, మాట రూపంలో కూడా చేయొచ్చు. మీరు ఎక్కువ వంట చేసుకుని.. అనుకున్నంత మంది అతిథిలు రాకపోతే.. ఆ ఫుడ్ వేస్ట్ అవుతుంది. లేదు మేము ఉదయానికి దాచుకుని తింటాము అంటారా? అది కూడా చేయొచ్చు. కానీ ఎంతని తింటారు. కాబట్టి.. మీకు సరిపడినంత ఉంచుకుని.. మిగిలినది మీ చుట్టు పక్కల అవసరమైన వారికి ఇవ్వండి. అది మీకు తృప్తినే కాకుండా.. వారి వైపు నుంచి బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి.
మన దగ్గర డబ్బులు, వస్తువులు, తిండి లేకపోవచ్చు. కానీ ఒక్కోసారి మాట సాయం చేయమని ఎవరో ఒకరు మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు. అలాంటివారికి సాయం చేయడానికి వెనకాడకండి. మీరు సాయం చేస్తే.. మీకు అది ఏదొక రూపంలో తిరిగి వస్తుంది. మీకు మంచి జరుగుతుంది. అవతలివాళ్లకి కూడా మంచే జరుగుతుంది. అలా వాళ్లకి సాయం చేయడానికి ఏదొక రీజన్ అవసరం లేదు. మిమ్మల్ని మీరు మనిషిగా గుర్తిస్తే.. ఎదుటివాడి అవసరం మీకు కళ్లకు కట్టినట్లు తెలుస్తుంది. వాడి అవసరం కళ్లల్లో కచ్చితంగా కనిపిస్తుంది. అలాంటి వాళ్లకి సాయం చేయడంలో ఎప్పుడూ వెనకడుగు వేయకండి. మీరు లక్షలు పెట్టి ఎంజాయ్ చేసినా రాని సంతోషం.. ఓ వ్యక్తికి ఆపదలో ఆదుకున్నప్పుడు.. అవసరానికి సాయం చేసినప్పుడో వచ్చే సంతోషానికి అవధులు కూడా ఉండవు. కాబట్టి సాయం చేయండి.. సంతోషంగా ఉండండి.