తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Periods: కొంతమంది మహిళల్లో పీరియడ్స్ లో ఒకరోజే రక్తస్రావం జరిగి ఆగిపోతుంది, ఎందుకు? ఇలా అయితే ప్రమాదమా?

Periods: కొంతమంది మహిళల్లో పీరియడ్స్ లో ఒకరోజే రక్తస్రావం జరిగి ఆగిపోతుంది, ఎందుకు? ఇలా అయితే ప్రమాదమా?

Haritha Chappa HT Telugu

28 November 2024, 10:38 IST

google News
    • Periods: మహిళలకు పీరియడ్స్ ఒక్కో స్త్రీకి ఒక్కోలా వస్తాయి. కొంతమందికి వారం రోజులు పాటు అయితే మరికొందరికి ఒక్క రోజుకి ఆగిపోతాయి. ఎందుకిలా?
పీరియడ్స్ సమస్యలు
పీరియడ్స్ సమస్యలు (Pixabay)

పీరియడ్స్ సమస్యలు

మహిళల ఆరోగ్యంలో పీరియడ్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే ఒక్కో మహిళకు పీరియడ్స్ ప్రక్రియ ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి వారం రోజులు పాటు రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది. మరికొందరికి ఒక్కరోజే జరిగి ఆగిపోతుంది. ఇంకొందరులో రెండు నుంచి మూడు రోజులు జరుగుతూ ఉంటుంది. ఇలా ఒక్క రోజే పీరియడ్స్ వచ్చి ఆగిపోవడం అనేది ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంలో వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం

నెలసరి అనేది మొదటి నుంచి ఒకేలా జరుగుతూ ఉంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మాకు కొంతమందికి వారం రోజులు పాటు ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా వారం రోజులు పాటు జరిగే పీరియడ్స్ హఠాత్తుగా ఒకట్రెండు రోజులకు పరిమితమైతే ఏదైనా ఆరోగ్య సమస్య ఉందేమోనని ఆలోచించాలి. అలాగే ఒకటి రెండు రోజులు రక్తస్రావం అయ్యే మహిళల్లో ఒకేసారి వారం రోజులపాటు పీరియడ్స్ కొనసాగితే వైద్యులను కలవాల్సిన అవసరం ఉంది. అయితే కొంతమంది మహిళల్లో ఒకటి లేదా రెండు రోజుల్లోనే పీరియడ్స్ ఎందుకు వస్తాయి? ఇది అనారోగ్యానికి సంకేతమా?

పీరియడ్స్ అయ్యే కాలం స్త్రీ నుండి స్త్రీకి మారుతూ ఉంటుంది. సాధారణంగా నెలసరి మూడు నుండి ఏడు రోజుల వరకు ఉంటుంది. మూడు నుండి ఏడు రోజుల వరకు రక్తస్రావ ప్రవాహం కూడా సాధారణంగా ఉంటుంది. అలాగే పీరియడ్స్ సమయంలో వచ్చే వాసన కూడా ఏమాత్రం మార్పు చెందినా జాగ్రత్తగా ఉండాలి.

ఒకటి రెండు రోజులే పీరియడ్స్ అవ్వడానికి కారణాలు

ఒకటి లేదా రెండు రోజులే పీరియడ్స్ కొంతమంది మహిళల్లో కావడానికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఒత్తిడి. ఒకరోజు మాత్రమే మీ పీరియడ్స్ ఉండి తర్వాత ఆగిపోయినట్లయితే మీరు ఒత్తిడికి గురవుతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఒత్తిడి స్థాయిలు పెరగడం వల్ల మీ పీరియడ్స్ తక్కువ సమయం మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఒత్తిడి హార్మోన్ అయినా కార్టిసాల్... ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్ల పై ప్రతికూలంగా ప్రభావాన్ని చూపిస్తుంది. మీ ఒత్తిడి స్థాయిలు తగ్గిన తర్వాత మీ పీరియడ్స్ కాలం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఒత్తిడితో కూడిన ఉద్యోగాలలో ఉన్న స్త్రీలలో కూడా నెలసరి రోజులు తక్కువగా ఉంటాయి.

కఠినమైన వ్యాయామం చేసే మహిళల్లో కూడా నెలసరి తక్కువ రోజులే ఉంటుంది. వీరికి ఒకటి రెండు రోజుల్లోనే ఆగిపోయే అవకాశం ఉంది. అండోత్సర్గాన్ని నియంత్రించే హార్మోన్ల విడుదలకు కఠిన వ్యాయామం అనేది ఆటంకం కలిగిస్తుంది. అందుకే అలా జరుగుతుంది.

రక్తాన్ని పలుచన చేసే మందులు వేసుకుంటున్నా, స్టెరాయిడ్స్ వాడుతున్నా కూడా మహిళల్లో పీరియడ్స్ కాలం తగ్గిపోయే అవకాశం ఉంది. స్టెరాయిడ్లు రుతుస్రావం పై ప్రభావం చూపుతాయని కొన్ని రకాల అధ్యయనాలు తేల్చాయి.

థైరాయిడ్, పిసిఓఎస్, గర్భాశయ సమస్యలు, కొన్ని లైంగిక వ్యాధులు ఉన్నవారిలో కూడా పీరియడ్స్ అనేవి సరిగా జరగవు. వీరిలో ఒకటి రెండు రోజుల్లోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది.

అండోత్సర్గము సరిగా జరగకపోయినా కూడా పీరియడ్స్ క్రమరహితంగా మారిపోతాయి. అలాగే ఒకరోజే రక్తస్రావం జరిగి ఆగిపోయే అవకాశం ఉంది.

పీరియడ్స్ తక్కువ కాలం పాటు ఉంటే వచ్చే సమస్యలు

పీరియడ్స్ ఒకటి. లేదా రెండు రోజులు మాత్రమే ఉంటే మీ శరీరం ఈస్ట్రోజన్ ఉత్పత్తి చేయలేదు. ఈస్ట్రోజన్ అనేది గర్భాశయంలోని ఎండోమెట్రియం పొర నిర్మించడానికి అత్యవసరం. ఎండోమెట్రియం పొర తగినంత మందంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లోపిస్తుందో ఆ పోరా పలచగా మారిపోతుంది. అందుకే నెలసరి సమయంలో తగినంత రక్తస్రావం జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈస్ట్రోజన్ ఉత్పత్తి అయి హార్మోన్ల మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి ఒకరోజు లేదా రెండు రోజులే పీరియడ్స్ జరుగుతూ ఉంటే ఒకసారి వైద్యులను కలవాల్సిన అవసరం ఉంది. నలభై అయిదేళ్లు దాటిన వారిలో ఒకటి లేదా రెండు రోజుల వ్యవధిలోనే పీరియడ్స్ ముగిసిపోతూ ఉంటే అది మెనోపాజ్‌కు సంకేతంగా కూడా భావించవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం