Mental health | మానసిక సమస్యలతో పాటు పొగాకు వినియోగిస్తున్నారా?
28 February 2022, 15:47 IST
- మానసిక సమస్యలు ఉండి పొగాకు వినియోగం కూడా ఉన్న వారు 15-20 ఏళ్లు ముందుగానే మరణిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం.. ప్రతి పది మందిలో ఒకరు మానసిక సమస్యతో బాధపడుతున్నారు. అలాగే తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతున్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు స్మోకర్సే.
పొగ తాగడం, పొగాకు వినియోగం మానేస్తే మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రతి పది మంది సాధారణ జనాభాలో ఒకరు మానసిక సమస్యతో బాధపడుతున్నారు. అలాగే తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతున్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు స్మోకర్స్ అని డబ్ల్యూహెచ్‌వో గణాంకాలు చెబుతున్నాయి. ఇలా మానసిక అనారోగ్యానికి గురైన వారు ఇతర సాధారణ వ్యక్తుల కంటే రెండింతలు స్మోక్ చేస్తున్నారని కూడా గణాంకాలు చెబుతున్నాయి.
ముందే మరణిస్తారా?
మానసిక అనారోగ్యానికి గురైన వారు సాధారణ మరణించే వయస్సు కంటే ముందే మరణిస్తారని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఏదైనా మానసిక అనారోగ్యం ఉన్న వయోజనులు 5 నుంచి 10 ఏళ్లు ముందుగానే మరణిస్తారని తెలిపింది. అయితే ఏదైనా తీవ్ర మానసిక అనారోగ్యం ఉన్న వారు 15 నుంచి 20 ఏళ్లు ముందుగానే మరణిస్తారని వెల్లడించింది. ఇందుకు పొగాకు వినియోగం ప్రధాన కారణాల్లో ఒకటని వివరించింది.
పొగాకు.. మానసిక అనారోగ్యాన్ని పెంచుతుందా?
పొగాకు వినియోగం మానసిక అనారోగ్యాన్ని పెంచుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. డిప్రెషన్, యాంగ్జైటీ, ఒత్తిడి, అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ), సైకియాట్రిక్ లక్షణాలను పెంచుతుందని ఈ సంస్థ హెచ్చరించింది.
వ్యాధి లక్షణాలను పెంచడమే కాకుండా పొగాకు వినియోగం.. ఆయా వ్యాధులను నయం చేసేందుకు తీసుకుంటున్న ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
అపోహలు.. వాస్తవాలు
పొగాకు వినియోగం, మానసిక అనారోగ్యంపై ప్రజల్లో ఉన్న కొన్ని అపోహలు, అనుమానాలను డబ్ల్యూహెచ్‌వో నివృతి చేసింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు పొగాకు వినియోగాన్ని మానేస్తే మరింత తీవ్ర అనారోగ్యానికి గురవుతారన్నది అపోహ మాత్రమేనని కొట్టి పారేసింది. పైగా పొగాకు మానేయడం వల్ల మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని తెలిపింది. డిప్రెషన్, యాంగ్జైటీ, ఒత్తడి, ఏడీహెచ్‌డీ లక్షణాల స్థాయిని తగ్గిస్తుందని తెలిపింది.
పొగాకు వినియోగం వల్ల మానసిక అనారోగ్యాన్ని సమర్థవంతంగా మేనేజ్ చేయవచ్చన్నది అపోహ మాత్రమేనని, మానసిక అనారోగ్యం ఉండి పొగ తాగేవారిలో సైకియాట్రిక్ సింప్టమ్స్ మరింత పెరిగినట్టు అధ్యయనాల్లో తేలిందని వివరించింది.
సెల్ఫ్ మెడికేషన్‌లో భాగంగా మానసిక అనారోగ్యం ఉన్న వారు పొగాకు వినియోగించడం అపోహ మాత్రమేనని, వాస్తవానికి మానసిక అనారోగ్యానికి తీసుకుంటున్న మందుల సమర్థతను పొగాకు తగ్గిస్తుందని తెలిపింది. అలాగే మానసిక అనారోగ్యం ఉండి పొగ తాగుతున్న వారు పొగ మానేయాలనుకున్నప్పుడు నికోటిన్ ఉపసంహరణ లక్షణాలను సులువుగా హాండిల్ చేయలేరన్నది కూడా అపోహ మాత్రమేనని, నిజానికి తగిన సపోర్ట్ ఇవ్వడం, నికోటిన్ విత్‌డ్రాయల్ సింప్టమ్స్‌కు తగిన ఔషధాలు ఇస్తే ఈ సమస్య ఎదురవదని తెలిపింది.
అపోహలు సృష్టించడం వెనక పొగాకు కంపెనీలు..
స్మోకింగ్, మానసిక అనారోగ్యం విషయంలో పొగాకు ఉత్పత్తుల తయారీ సంస్థలు కొన్ని అపోహలను సృష్టిస్తున్నాయని, అపోహలకు తావిచ్చే అధ్యయనాలకు ఫండింగ్ చేస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అలాగే పొగ రహిత ప్రదేశాలను ప్రమోట్ చేయకుండా బలహీనం చేస్తున్నాయని కూడా తెలిపింది. పైగా మానసిక అనారోగ్యం బారిన పడి ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని పొగాకు ఉత్పత్తుల తయారీ సంస్థలు మార్కెటింగ్ చేస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
స్మోకింగ్, పొగాకు వినియోగం మానేస్తే ప్రయోజనం ఏంటి?
స్మోకింగ్, పొగాకు వినియోగం మానేస్తే మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. యాంటీ సైకోటిక్ ఔషధాల డోసేజ్ క్రమంగా తగ్గుతుంది. ఆల్కహాల్, మత్తుపదార్థాల జోలికి వెళ్లాలన్న ఆసక్తి తగ్గుతుంది. తక్షణం శారీరక ఆరోగ్యం మెరుగుపడడం ప్రారంభమవుతుంది. గుండె జబ్బుల రిస్క్, గుండె పోటు రిస్క్, కాన్సర్ రిస్క్ తగ్గుతుంది. పొగాకు మానేసిన ఏడాదిలోపు పొగాకు వల్ల కలిగే గుండె పోటు ప్రమాదం పూర్తిగా తగ్గుతుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
ఎదురవుతున్న సవాళ్లేంటి?
పొగాకు మానేస్తే, పొగ మానేస్తే సాధారణంగా నికోటిన్ విత్‌డ్రాయల్ సింప్టమ్స్ కనిపిస్తాయి. అయితే మానసిక అనారోగ్యం ఉన్న వారిలో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. మెంటల్ డిజార్డర్స్‌కు నికోటిన్ తాత్కాలికంగా ముసుగేయగలదు. అందువల్లే వారు మానేసే ప్రయత్నంలో విఫలమవుతుంటారు.
ముఖ్యంగా ఒత్తిడితో కూడిన జీవనశైలి ఉన్నవారు, తక్కువ కుటుంబ వార్షికాదాయం కలిగిన వారు, హెల్త్ ఇన్సూరెన్స్ లేనివారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాగే స్మోకింగ్, పొగాకు వినియోగం మానేసేటప్పుడు అవసరమైన హెల్త్ కేర్ సపోర్ట్ లేకపోవడం కూడా వారు సక్సెస్ కాలేకపోతున్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఆయా సవాళ్లకు ఆరోగ్య విభాగాలు తగిన విధానాలతో పరిష్కారం చూాపాలని అభిప్రాయపడింది.
టాపిక్