కరోనాతో స్త్రీల మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయా? శిశు సంరక్షణపై వైద్యుల సలహాలు!
28 February 2022, 18:55 IST
- నవజాత శిశువులను ఎంతో సున్నితంగా చూసుకోవాల్సి ఉంటుంది. శిశువు సంరక్షణ కోసం కోవిడ్ పాజిటివ్ గల తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కోవిడ్ సోకిన బాలింతలకు మానసిక సమస్యలు పెరుగుతాయా అనే అంశాలపై వైద్యులు అందించిన సలహాలు, సూచనలు ఇప్పుడు చూద్దాం.
postpartum depression
అప్పుడే పుట్టిన శిషువులను ఎంతో సున్నితంగా చూసుకోవాలి, నవజాత శిశువు సంరక్షణ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బిడ్డతో తల్లి పెనవేసుకునే అనుబంధం శిశు సంరక్షణలో అత్యంత ఆహ్లాదకరమైన అంశం. అయితే ఇలాంటి సందర్భంలో తల్లికి కోవిడ్ సోకితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుపూరి పలు సూచనలు, సలహాలు అందించారు.
కోవిడ్ సోకినప్పటికీ కూడా నవజాత శిశువుకు పాలివ్వడాన్ని తల్లి కొనసాగించాలి. అయితే శిశువుకు పాలిచ్చే ముందు తల్లి చేతులు కడుక్కోవాలి. మాస్క్ , ఫేస్ షీల్డ్ వంటి రక్షణ పరికరాలను ధరించాలి. పరిసరాలను కూడా తరచుగా శుభ్రపరచాలి. పాలివ్వని సమయంలో శిశువును తల్లి నుండి కనీసం 6 అడుగుల దూరంలో ఉంచాలి. కోవిడ్ నెగటివ్ గా తేలిన సంరక్షకుడు నవజాత శిశువును జాగ్రత్తగా చూసుకోవడంలో సహాయపడవచ్చు.
శిషువు సంరక్షణ కోసం సహాయకులు ఎవరు లేకపోతే తల్లి అన్ని సమయాల్లో మాస్క్ ధరించాలి. శిషువు నుండి శారీరక దూరాన్ని వీలైనంత వరకు కొనసాగించాలి. తల్లి, బిడ్డ ఎక్కువ గాలి వెలుతురు ఉన్న గదిలో ఉండాలి. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి, పరిసరాలను శుభ్రపరచాలి.
మహమ్మారి సమయంలో గర్భిణీల మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయా?
సాధారణంగానే గర్భాధారణ సమయంలో, ప్రసవానంతర కాలంలో మహిళల్లో ఒకరకమైన ఆందోళన, నిరాశ, మానసిక స్థితి లాంటి సమస్యలు కొంత ఎక్కువవుతాయి. ఇందుకు శరీరంలో జరిగే మార్పులు, హార్మోన్ల మార్పు కారణం. వీటిని తట్టుకునే సామర్ధ్యం బాలింతలకు ఉండదు. కాబట్టి ఇలాంటి సమయాల్లో ఆమెకు కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. వారి మద్దతు లేనప్పుడు ఆమె ఒంటరిగా, నిస్సహాయతగా, నిరాశ-నిస్పృహలకు లోనవుతుంది.
ఇదే సమయంలో కోవిడ్ సోకితే 15 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండటం అంటే, ముఖ్యంగా గర్భిణీలు, ప్రసవానంతర తల్లులకు మరింత కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లల ఆరోగ్యంపై ఆలోచిస్తూ వారు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇందుకోసం కుటుంబ సభ్యులు వీడియో కాల్స్ ద్వారా మరింత సన్నిహితంగా ఉంటూ ఆమెకు తామున్నాం అనే భరోసానివ్వాలి. ఆమె మానసిక స్థితిలో ఏదైనా మార్పు వచ్చినా లేదా ఆమె నిరాశకు గురైనట్లు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలి.
గర్భిణీలను, తల్లులను వైద్యులు సాధారణంగా రెండు ప్రశ్నలు అడుగుతారు. ఒకటి, ఆమె తన సొంత పనులను చేయటానికి ఆసక్తి కనబరుస్తుందా? అస్సలు ఆసక్తి లేదా ? రెండవది, గత 2 వారాలలో ఎప్పుడైనా ఆమె నిర్దిష్ట కారణం అనేదే లేకుండా విచారంగా ఉండటం లేదా ఏడవటం లాంటిది చేసిందా? ఈ ప్రశ్నలలో దేనినైనా సమాధానం అవును అయితే ఆమెకు మనస్తత్వవేత్త పర్యవేక్షణ అవసరం ఉంటుంది. ఈ సమయంలో వైద్యులు, అలాగే కుటుంబ సభ్యులు ఆమె ప్రవర్తనను నిశితంగా గమనిస్తూ ఉండాలి.
చివరగా మహిళలకు ఇచ్చే సలహా..
సురక్షితంగా ఉండండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పుడు తీసుకోండి. ఎక్కువ మందిని కలవడం మానుకోండి. జ్వరం, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం లాంటి కోవిడ్ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. రోగ నిర్ధారణ ఆలస్యం చేయకూడదు, సొంతంగా చికిత్స చేసుకోకూడదు.
అలాగే గర్భిణీ స్త్రీలకు గర్భాధారణ సమయంలో వివిధ గర్భనిరోధక పద్ధతుల గురించి వైద్యులు తెలియజెప్పాలి. ప్రసవానంతర అంతర్గత గర్భాశయ పరికరం (Cu T) ను వినియోగించాలి. దీనిని సాధారణ ప్రసవం లేదా సిజేరియన్ డెలివరీ అయిన వెంటనే చేర్చవచ్చు. ఇది ప్రసవం తర్వాత అనవసరంగా ఆసుపత్రికి రాకుండా చేయడమే కాకుండా, ప్రణాళిక లేకుండా గర్భం దాల్చే ప్రమాదాన్ని నివారిస్తుంది.