కోవిడ్ సోకిన డయాబెటిస్ పేషెంట్లలో అలసట పెరిగిందంటున్న కొత్త అధ్యయనం
28 February 2022, 20:14 IST
- కోవిడ్ సోకిన డయాబెటిస్ పేషెంట్లలో అలసట పెరిగిపోయిందని ఇటీవల ఒక కొత్త అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్ సోకని డయాబెటిస్ పేషెంట్లతో పోల్చితే కోవిడ్ సోకిన వారిలో అలసటతో పాటు కండరాల నొప్పి, తలనొప్పి తదితర ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ అధ్యయనం తేల్చింది.
డయాబెటిస్ పేషెంట్లలో పెరిగిన అలసట (ప్రతీకాత్మక చిత్రం)
కోవిడ్ సోకిన డయాబెటిస్ పేషెంట్లలో అలసట పెరిగిపోయిందని ఇటీవల ఒక కొత్త అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్ సోకని డయాబెటిస్ పేషెంట్లతో పోల్చితే కోవిడ్ సోకిన వారిలో అలసటతో పాటు కండరాల నొప్పి, తలనొప్పి తదితర ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ అధ్యయనం తేల్చింది.
ఫోర్టిస్ సి-డాక్ ఆసుపత్రిలోని డయాబెటిస్ అండ్ ఎండొక్రైనాలజీ విభాగం ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అండ్ డైరెక్టర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ అనూప్ మిశ్రా చేపట్టిన ఈ అధ్యయనంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎయిమ్స్, సీ-నెట్, ఎన్-డాక్, డయాబెటిస్ ఫౌండేషన్ తదితర సంస్థలతో కలిసి ఈ అధ్యయనాన్ని చేపట్టారు.
108 మందితో అధ్యయనం
ఈ అధ్యయన ఫలితాలను డయాబెటిస్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ జర్నల్‌లో ప్రచురించారు. కోవిడ్ సోకిన వారిలో డయాబెటిస్ సమస్యను మరింత క్లిష్టతరం చేసిందని తేల్చారు.
వ్యాధి తీవ్రతను పెంచడమే కాకుండా ప్రాణాంతకంగా మార్చిందని విశ్లేషించారు. పేషెంట్లు రికవరీ కావడంలో డయాబెటిస్ సవాలుగా నిలిచిందని పేర్కొంది.
కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్న తరువాత డయాబెటిస్ పేషెంట్లలో అలసట స్థాయి తెలుసుకునేందుకు ఈ అధ్యయనం నిర్వహించారు. డయాబెటిస్ లేని వారితో పోల్చితే ఉన్న వారిలో అలసట ఎక్కువగా ఉందని తేల్చారు.
మొత్తం టైప్-2 డయాబెటిస్ ఉన్న 108 మందితో ఈ అధ్యయనం చేశారు. ఇందులో 52 మందికి కోవిడ్ సోకి నయమవగా, 56 మందికి కోవిడ్ సోకలేదు.
ఈ అధ్యయనం తరువాత డాక్టర్ అనూప్ మిశ్రా సంబంధిత విషయాలను విశ్లేషిస్తూ అలసట, సంబంధిత లక్షణాలు జీవన నాణ్యతను దెబ్బతీస్తాయని, సాధారణ పని సామర్థ్యంపై ప్రభావం చూపిస్తాయని వివరించారు.
డయాబెటిక్ పేషెంట్లు ఆరోగ్యకరమైన జీవన శైలిని అందిపుచ్చుకోవాలని, ట్రీట్మెంట్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు.
డయాబెటిస్ మేనేజ్మెంట్ స్థిరంగా ఉండాలి
డయాబెటిస్ మేనేజ్మెంట్ స్థిరంగా ఉండాలని, మహమ్మారి పొంచి ఉన్న వేళ మరింత శ్రద్ధ వహించాలని అనూప్ మిశ్రా సూచించారు.
న్యూట్రిషన్ అందే విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలని, ప్రొటీన్, విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని వివరించారు.
వ్యాయామం, అవరమైతే ఫిజియోథెరఫీ తీసుకుంటే అలసట నుంచి ఉపశమనం పొందడంతోపాటు గుండె సంబంధిత, ఊపిరితిత్తుల సంబంధిత ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుందని వివరించారు.