Smoking- COVID| స్మోకింగ్, వేపింగ్ అలవాటు ఉంటే కోవిడ్19తో చనిపోయే ఛాన్స్ ఎక్కువ!
28 July 2022, 21:00 IST
- స్మోకింగ్ వలన క్యాన్సర్ రావటమే కాదు, కోవిడ్19 ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. అమెరికా పరిశోధకులు వెల్లడించిన షాకింగ్ నిజాలు ఇక్కడ తెలుసుకోండి.
Smoking & Vaping increase risk of COVID19 death
ధూమపానం చేసేవారికి, అలాగే వేపింగ్ చేసేవారికి COVID-19 వలన తీవ్రమైన ముప్పు ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనాతో ఎవరైనా ఆసుపత్రిలో చేరితే, అదే సమయంలో వారు స్మోకర్స్ లేదా వేపర్స్ అయితే వారికి వెంటిలేషన్ అవసరం ఎక్కువ ఉంటుంది. మిగతా వారితో పోలిస్తే వీరు కోవిడ్ కారణంగా చనిపోయే శాతం ఎక్కువ అని తాజా పరిశోధనలో రుజువైంది.
ఎలాక్ట్రానిక్ సిగరెట్లు లేదా ఎలక్ట్రిక్ డివైజులతో నికోటిన్ సంబంధిత పదార్థాలను పీల్చేవారిని వేపర్లు అంటారు. వారు విడుదల చేసే పొగను వేపింగ్ అంటారు. కాబట్టి అది సాధారణ సిగరెట్ స్మోకింగ్ అయినా, మరేరకమైనా వేపింగ్ అయినా అది కోవిడ్19 ముప్పును పెంచుతుంది.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కు చెందిన COVID-19 CVD రిజిస్ట్రీ నుంచి తీసుకున్న డేటా ఆధారంగా పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. జనవరి 2020 నుంచి మార్చి 2021 మధ్య అమెరికా ఆసుపత్రులలో COVID-19తో చేరిన 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల డేటాను పరిశోధకులు పరిశీలించారు. మరణాల రేటు ఎవరిలో ఎక్కువ ఉందో వారి హెల్త్ డేటాపై పరిశోధనలు చేశారు. అందులో స్మోకింగ్ చేసే వారిని, చేయని వారిని విభజించారు. సాంప్రదాయ మండే సిగరెట్‌లు లేదా ఇ-సిగరెట్ ఉత్పత్తులు తాగేవారు అలాగే రెండు కలిపి చేసే వారు ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో ధూమపానం చేయని వారి కంటే ధూమపానం చేసేవారికి వెంటిలేషన్‌లో ఉంచాల్సిన అవసరం 39% ఎక్కువ అయినట్లు గుర్తించారు. అదే సమయంలో మరణించిన శాతం కూడా ధూమపానం చేసిన వారిలో 49 శాతం ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. వయసు, ఆడ, మగ, జాతిబేధం ఇలా ఏది చూసుకున్న ధూమపానం చేసిన వారే ఎక్కువ సంఖ్యలో చనిపోయినట్లు బట్టబయలైంది.
ధూమపానం, వేపింగ్ అలవాటు ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది అలాగే రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఈ సందర్భంలో వారు COVID-19, ఇతర ఇన్ఫెక్షన్లకు గురికావడానికి ఎక్కువ అవకాశం కలిగి ఉంటారు. వీరికి ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తి కూడా తక్కువగా ఉంటుంది. శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. COVID-19 సోకినపుడు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఈ కారణంగా ఊపిరి వదిలేస్తారు. ఊబకాయం కూడా కోవిడ్ తీవ్రతను పెంచుతుందని అధ్యయనంలో వెల్లడించారు.
తాజా పరిశోధనలకు చెందిన ఫలితాలు PLOS ONE అనే ఓపెన్ యాక్సెస్ సైంటిఫిక్ జర్నల్ లో పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ విభాగం ప్రచురించింది.
టాపిక్