Itching Home Remedies | చర్మం దురద పెడుతోందా? చర్మ వ్యాధులను నివారించే చిట్కాలు చూడండి!
26 July 2023, 7:07 IST
- Itching Home Remedies: వర్షాకాలంలో తడిసిన బట్టలను అలాగే ధరించి ఉంచుకుంటే అవి చర్మ సమస్యలను కలిగిస్తాయి. దురద నివారణకు ఇక్కడ కొన్ని చిట్కాలు చూడండి.
Itching Home Remedies:
Itching Home Remedies: వర్షాకాలంలో అనేక రకాల అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు ఈ సీజన్‌లో ఎక్కువవుతాయి. అలర్జీలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు సర్వసాధారణం. మెడ, మోచేతులు, చేతులు, రొమ్ము కింద, గజ్జలలో గజ్జి, తామర వంటి మొదలైన చర్మ వ్యాధులు కలగవచ్చు. దురద, దద్దుర్లు ఇబ్బంది పెట్టవచ్చు. వీటికి ప్రధానంగా బ్యాక్టీరియా, ఫంగస్‌లు కారణమవుతాయి. అందువల్ల సరైన వ్యక్తిగత పరిశుభ్రత అవసరం. వర్షాకాలంలో చర్మ సమస్యల నివారణకు ఇక్కడ కొన్ని చిట్కాలు చూడండి.
చందనం పేస్ట్
వర్షాకాలంలో చర్మంపై దురద ఎక్కువగా ఉంటే, గంధపు పేస్ట్‌ను చర్మంపై రాయండి. చందనం చర్మంపై శీతలికరణ ప్రభావాలను కలిగిస్తుంది, దురదల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మానికి ఇతర ప్రయోజనాలను చేకూరుస్తుంది. గంధపు పొడిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి తయారు చేయండి. ఈ పేస్ట్ దురద ఉన్న చోట అప్లై చేయాలి. క్రమం తప్పకుండా వాడటం వలన దురద సమస్యలు ఉండవు, చర్మం టోన్ కూడా మెరుగుపరుస్తుంది.
వేప ఆకుల పేస్ట్
ఆయుర్వేదంలో వేప అనేక ఇన్ఫెక్షన్లను నయం చేసే ఒక ఔషధం. చర్మ సంబంధిత సమస్యలలో వేపను ఉపయోగించడం చాలా మేలు చేస్తుంది. దురద సమస్య తొలగిపోవాలంటే వేప ఆకులను మెత్తగా చేసి చర్మానికి రాసుకోవాలి. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దురద నుండి ఉపశమనం కలిగిస్తాయి.
నిమ్మకాయ -బేకింగ్ సోడా
నిమ్మకాయ చర్మానికి మేలు చేస్తుంది. వర్షాకాలంలో ఉండే తేమ వాతావరణం వల్ల మీ సున్నిత చర్మంపై దురద కలిగితే నిమ్మకాయ -బేకింగ్ సోడా అప్లై చేయవచ్చు. రెండు చెంచాల బేకింగ్ సోడా, ఒక చెంచా నిమ్మరసం కలిపి చర్మంపై ప్రభావిత ప్రాంతంలో రాసుకోవాలి. 5-10 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. ఈ ప్రక్రియను రోజుకు ఒకసారి చేయడం వల్ల దురద నుండి బయటపడవచ్చు.
కొబ్బరినూనె
కొబ్బరినూనె చర్మానికి తేమను అందించడంతో పాటు ఇన్ఫెక్షన్‌ను తొలగిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. వర్షాకాలంలో చర్మం దురద కలుగుతున్నప్పుడు కొబ్బరి నూనెను ప్రభావిత ప్రాంతంలో రాస్తే దురదలు, దద్దుర్లు రావు.
వర్షాకాలంలో దురద, ఇతర చర్మ సమస్యలను నివారించడానికి మీరు పరిశుభ్రంగా ఉండండి, పొడిగా ఉండండి, పొడి బట్టలు వేసుకోండి. తడిసిన బట్టలను అలాగే ధరించి ఉంచుకుంటే అవి చర్మ సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి వీలైనంత వరకు తడిదనాన్ని నివారించండి.