తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Simple Sweet: బెల్లం సున్నుండలను ఇలా చేస్తే ఎంతో ఆరోగ్యం

Simple Sweet: బెల్లం సున్నుండలను ఇలా చేస్తే ఎంతో ఆరోగ్యం

Haritha Chappa HT Telugu

04 January 2024, 16:15 IST

google News
    • Simple Sweet: పిల్లలకు స్నాక్స్‌‌గా ప్రతిరోజూ ఒక బెల్లం సున్నుండను తినిపిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
సున్నుండల రెసిపీ
సున్నుండల రెసిపీ (Pixabay)

సున్నుండల రెసిపీ

Simple Sweet: పూర్వం జంక్ ఫుడ్ ఏది ఉండేది కాదు, ఇంట్లోనే తయారు చేసిన సున్నుండలు, అరిసెలు, జంతికలు వంటి వాటిని పిల్లలకు స్నాక్స్ గా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సాయంత్రమైతే స్నాక్స్ గా ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, బర్గర్లు, పిజ్జాలు ఇచ్చే వారి సంఖ్య పెరిగిపోయింది. వాటిని తినిపించడం వల్ల పిల్లలకు అనారోగ్యాన్ని తెచ్చి పెట్టిన వారవుతారు. కాబట్టి ప్రాచీన కాలంలో పెద్దలు ఇచ్చినట్టే ఇంట్లో చేసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్నాక్స్ గా ఇచ్చేందుకు ప్రయత్నించండి. మేము ఇక్కడ బెల్లం సున్నుండలు తయారీ చెప్పాము. వీటిని తినిపించడం వల్ల పిల్లలకు శక్తి అందడంతో పాటు ఇనుము కూడా అందుతుంది. రక్తహీనత సమస్య నుండి వారు బయటపడతారు. బెల్లం సున్నుండల రెసిపీ ఎలాగో చూద్దాం.

బెల్లం సున్నుండలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మినప్పప్పు - అరకిలో

బెల్లం తురుము - అరకిలో

నెయ్యి - ఒక కప్పు

బెల్లం సున్నుండల రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి వేడెక్కాక మినప్పప్పును వేసి వేయించాలి. సగం పొట్టు తీసిన మినప్పప్పును, సగం పొట్టు ఉన్న మినప్పప్పును తీసుకుంటే మంచిది.

2. మినప్పప్పు మీద ఉన్న పొట్టులో ఎంతో పోషకాలు ఉంటాయి. ఈ పప్పును బాగా వేయించాక తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి.

3. వాటిని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి.

4. ఈ పొడి, బెల్లం తురుము ఒకేసారి మిక్సీ జార్లో పట్టవు. కాబట్టి నాలుగైదు సార్లు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి.

5. ఈ మొత్తాన్ని పెద్ద గిన్నెలోకి తీసి వేసుకోవాలి.

6. ఆ మిశ్రమంలో నెయ్యిని కూడా వేసి బాగా కలిపి లడ్డూల్లా వచ్చేలా చేసుకోవాలి.

7. నెయ్యిని తక్కువగా వేస్తే లడ్డూల్లా రాకపోవచ్చు.

8. కాబట్టి ఒక కప్పు నెయ్యిని పూర్తిగా వేసి కలిపితే లడ్డూల్లా కట్టే అవకాశం ఉంటుంది.

9. తర్వాత వాటిని లడ్డూల్లా చుట్టుకుని తడి లేని గాలి చొరబడని డబ్బాల్లో నిలువ చేసుకుంటే తాజాగా ఉంటాయి.

10. పిల్లలకు రోజుకు ఒకటి తినిపించినా చాలు, వారు ఆరోగ్యంగా శక్తివంతంగా పెరుగుతారు.

11. దీన్ని కేవలం పిల్లలే కాదు పెద్దలు కూడా తినాల్సిన అవసరం ఉంది.

12. మినప్పప్పులో ఉండే పోషకాలు, మినప్పప్పు పొట్టులో ఉన్న పోషకాలు, బెల్లంలోని పోషకాలు... ఇలా అన్ని శరీరంలో చేరుతాయి.

13. ఇందులో వాడే నెయ్యి మన ఆరోగ్యానికి అత్యవసరమైనది. కాబట్టి ఇందులో మనం వాడినవన్నీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించేవే.

తదుపరి వ్యాసం