High cholesterol: ఎంతోమందికి తెలియని అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు, ఇవి మీలో కనిపిస్తే వెంటనే చెక్ చేయించుకోండి
18 November 2024, 13:07 IST
- High cholesterol: అధిక కొలెస్ట్రాల్ అనేది రహస్యంగా, నిశ్శబ్దంగా శరీరంలో జరిగే ఒక ప్రక్రియ. ఈ అధిక కొలెస్ట్రాల్ అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. కొన్ని రకాల లక్షణాల ద్వారా అధిక కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు.
కొలెస్ట్రాల్ లక్షణాలు
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని రకాల పరీక్షలను చేయించుకోవాలి. అయితే మన శరీరం కొన్ని సంకేతాల ద్వారా కూడా అధిక కొలెస్ట్రాల్ ఉందని హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ ఆ హెచ్చరిక సంకేతాలు చాలా తక్కువ మందికే తెలుసు. అందరూ ఊబకాయం బారిన పడితేనే అధిక కొలెస్ట్రాల్ ఉందని అనుకుంటారు. సన్నంగా ఉన్న వారిలో కూడా కొలెస్ట్రాల్ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు కూడా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను సూచిస్తాయి అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు.
ఊపిరి ఆడక పోవడం
తరచూ కొంతమంది ఊపిరి ఆడని పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. రెండు మూడు మెట్లు ఎక్కినా కూడా ఊపిరి ఆడదు. దీనివల్ల అలసిపోయాం అనుకుంటారు గానీ అధిక కొలెస్ట్రాల్ ఉందని అనుకోరు. అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాల్లో ఫలకాలు ఏర్పడతాయి. ఇవి ధమనులు సంకోచించడానికి కారణమవుతాయి. గుండెకు ఆక్సిజన్ అందడం తగ్గిపోతూ ఉంటుంది. దీని వల్లే ఊపిరి ఆడక పోవడం అనే లక్షణం కలుగుతుంది. మీకు తరచూ ఊపిరి ఆడక పోవడం అనే లక్షణం కలుగుతూ ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తీవ్రమైన హృదయ సమస్యలకు దారి తీయవచ్చు.
కాలు తిమ్మిర్లు
కొంతమందికి పాదాలు చల్లబడి పోతాయి. కాలు తరచూ తిమ్మిరి పెడుతూ ఉంటుంది. దీనికి కారణం అధిక కొలెస్ట్రాల్ కావచ్చు. రక్తంలో అధిక కొలెస్ట్రాల్ కారణంగా అడ్డంకులు ఏర్పడి పాదాలకు కాళ్లకు రక్త ప్రసరణ సరిగా జరగదు. అలాంటి సమయంలోనే ఇలా కాలు తిమ్మిర్లు పట్టడం, పాదాలు చల్లగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీకు తరచుగా చల్లని పాదాలు, కాలు తిమ్మిర్లు పట్టడం అంటే లక్షణాలు అనుభవిస్తే వెంటనే వైద్యుని సహాయం తీసుకోండి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలను పరీక్షల ద్వారా తెలుసుకోండి.
వికారం
ఏదైనా ఆహారం పడకపోయినా, వాసన పడకపోయినా వికారంగా అనిపిస్తుంది. నిజానికి అధిక కొలెస్ట్రాల్ వల్ల కూడా వికారం అనే లక్షణం ఉంది. ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు గుండెకు రక్తప్రసరణ సరిగా జరగదు. అలాంటి సమయంలో కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది. వికారం తరచూ వచ్చే వారిలో గుండెపోటు లేదా ఆంజినా వంటి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఛాతీ నొప్పి, శ్వాస ఆడక పోవడం, వికారం ముడిపడి ఉంటాయి.
పాదాలకు పుండ్లు తగ్గపోవడం
పాదాల్లో పూతలు లేదా పుండ్లు పడినప్పుడు అవి నయం కాకపోతే డయాబెటిస్ ఉందేమో అనుకుంటారు. నిజానికి అధిక కొలెస్ట్రాల్ వల్ల కూడా పాదాలకు పుండ్లు పడడం, ఆ పుండ్లు ఎంతకీ తగ్గకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇది అంతర్లీన ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. ఎప్పుడైతే రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందో రక్తప్రసరణ అన్ని అవయవాలకు సరిగా జరగదు. ముఖ్యంగా శరీరం అడుగున ఉన్న పాదాలకు చాలా తగ్గిపోతుంది. దీనివల్ల పాదాలపై పుండ్లు ఏర్పడతాయి.
అదిగో కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాల్లో కొవ్వు నిల్వలు పేరుకు పోతాయి. ఇవి రక్త ప్రవాహాన్ని సరిగా జరగనివ్వవు. అలాంటి సమయంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి జరుగుతాయి. కాబట్టి అధిక కొలెస్ట్రాల్ అనే అంశాన్ని మీరు తక్కువగా తీసుకోకూడదు. వీలైనంతవరకు కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
టాపిక్