Sex Facts | రోజూ హస్తప్రయోగం చేస్తే ఏమవుతుంది..? పిరియడ్స్‌లో కలవొచ్చా?
28 February 2022, 14:54 IST
Sexual Health Awareness | సెక్స్. ఇది అందరికీ తెలిసిన కంటెంటే అయినా ఎవరూ దీని గురించి పబ్లిక్ గా మాట్లాడరు. మాట్లాడేందుకు ఇష్టపడరు కూడా. వారికున్న సందేహాలను, సమస్యలను కూడా బహిరంగంగా వ్యక్తం చేయడానికి ఇష్టపడరు. కానీ ఓ యువతి మాత్రం సెక్స్, దానికి సంబంధించిన విషయాలపై బహిరంగంగా చర్చిస్తుంది. సందేహమైనా, సమస్యకైనా సరే.. దానికి పరిష్కారాన్ని వివరిస్తూ.. నివృతి చేస్తూ.. ఎంతో మందికి సహాయం చేస్తున్నారు సెక్స్ ఎడ్యుకేటర్ లీసా మంగళ్ దాస్.
సెక్స్ అపోహలు
Sexual Health | అసలు రోజూ హస్తప్రయోగం చేస్తే ఏమవుతుంది? అసలు హస్తప్రయోగం చేయకపోతే ఏమవుతుంది. ఇది చాలామందికి ఉండే ప్రశ్నే. అయితే రోజూ హస్తప్రయోగం చేసినా చేయకపోయినా పర్లేదు అంటున్నారు సెక్స్ ఎడ్యుకేటర్ లీసా మంగళ్ దాస్. ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలపై ఆమె చర్చించి సలహాలు ఇచ్చారు. సోషల్ మీడియాలో తనకు తరచుగా వచ్చే ప్రశ్నలపై లీసా చర్చించారు.
హస్తప్రయోగం (masturbation) పై క్లారిటీ..
‘రోజూ హస్తప్రయోగం చేసినా.. అసలు దాని జోలికే వెళ్లకపోయినా పర్లేదు. హస్తప్రయోగమనేది చెడు అలవాటు ఏమి కాదు.. దాని గురించి చెడుగా, లేదా నామోషీగా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. రోజూ చేసే పనుల్లో ఒక పని మాత్రమే అది. స్విమ్మింగ్, డ్యాన్సింగ్ లాంటి యాక్టివిటీలు ఎలాగో హస్త ప్రయోగం కూడా అలాంటిదే. మీరు దానిని చేసినా.. చేయకపోయినా పర్లేదు. అంతే కాకుండా హస్త ప్రయోగం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మంచి నిద్ర వస్తుంది. దీనివల్ల ఎవరికీ ఎటువంటి సమస్య కూడా రాదు. అన్ వాంటెడ్ ప్రెగ్నెన్సీ, ఇన్ఫెక్షన్, రిజెక్షన్ వంటి సమస్యలు కూడా ఉండవు. కాబట్టి హస్తప్రయోగం చేయడం తప్పేమి కాదు..’
సంభోగ సమయంలో భావప్రాప్తి లేకుంటే?
ఓ ట్రాన్స్ జెండర్ అడిగిన ప్రశ్నకు లీసా ఈ విధంగా జవాబు ఇచ్చారు. ‘ముందుగా మీకు మాత్రమే ఈ సమస్య ఉందని భావించకండి. చాలా మంది అమ్మాయిలు కూడా దీనిని ఎదుర్కొంటున్నారు. ఇదేదో సమస్యలాగా చూడకండి. మీ భాగస్వామితో మాట్లాడండి. మీకు కావాల్సింది ఏమిటో తనకు చెప్పండి. లేదంటే హస్త ప్రయోగం చేసుకోండి. మీ శరీరాన్ని ఏఏ ప్రదేశాల్లో మీరు తాకుతున్నప్పుడు ఏ అనుభూతి చెందుతున్నారో.. అదే మీ భాగస్వామికి చెప్పండి. మీ సెక్స్ జీవితాన్ని మార్చుకుంటే ఇద్దరూ హ్యాపీగా ఉంటారు..’
పిరియడ్స్ సమయంలో సెక్స్‌లో పాల్గొనవచ్చా?
‘పిరియడ్స్ సమయంలో మీకు ఇష్టం ఉంటే కచ్చితంగా మీరు సెక్స్‌లో పాల్గొనవచ్చు. మీరు ఆ సమయంలో చేసే దానిని చెడుగా లేదా చిరాకుగా భావించనంతవరకు తప్పేమి కాదు. నెలసరిలో వచ్చేది చెడు రక్తమో, లేదా అసహ్యకరమైనదో, వ్యర్థమైనదో కాదు. అది నెలసరిలో విడుదలయ్యే రక్తం మాత్రమే. దానిని ఇబ్బందిగా అనుకోకుండా.. సేఫ్ సెక్స్ కావాలి అనుకుంటే మాత్రం.. నెలసరిలో ఉన్నా, లేకున్నా ప్రొటెక్షన్ వాడండి..’
రిలేషన్లో ఉన్నప్పుడు సెక్స్ టాయ్స్ వాడొచ్చా?
‘ఇది నాకు నచ్చిన చాలా మంచి ప్రశ్న. పైగా నేను సెక్స్ టాయ్స్‌కి పెద్ద అభిమానిని. సెక్స్ టాయ్స్ అనేవి ఒక మంచి ఇన్నోవేటివ్ సృష్టి అనొచ్చు. ఇవి సులువుగా, ఎఫెక్టివ్‌గా పని చేసేందుకు తయారు చేశారు. కాబట్టి వీటిని ఎవరైనా వాడొచ్చు. రిలేషన్లో ఉన్నా.. లేకున్నా దీనిని వాడేందుకు వెనుకడుగు వేయడం ఎందుకు? కానీ.. మీ భాగస్వామితో ఉన్నప్పుడు మాత్రం ఈ విషయంపై మరోసారి ఆలోచించండి. ఎందుకంటే ఇది మీ భాగస్వామి పనితీరుపై ప్రభావం చూపిస్తుంది..’
బాయ్ ఫ్రెండ్ ఎక్కువగా పోర్న్ చూస్తే..?
‘బాయ్ ఫ్రెండ్ ఎక్కువగా పోర్న్ చూడటమనేది పెద్ద సమస్యేమి కాదు. ఒక రిలేషన్లో ఉంటూ.. పోర్న్ చూసినా, హస్తప్రయోగం చేసినా తప్పేమి కాదు. వాటి ప్రభావం మీ మీద చూపించనంతవరకు అది ఒకే. నా బాయ్ ఫ్రెండ్ పోర్న్ చూస్తున్నాడు అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ వీడియోలు ప్రభావం మీపై చూపిస్తే కనుక దానినొక సమస్యగా భావించాలి. చాలా మంది దంపతులు పోర్న్ వీడియోలు కలిపి చూస్తారు. అది వారు ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది..’
అంగం సైజు ఎంత ఉండాలి?
‘సైజ్ కానీ, షేప్ కానీ ఒక మనిషికి ఎలాంటి సమస్యను తీసుకురాదు. వారిలోని ఆత్మన్యూనత భావనే అసలు సమస్య తీసుకొస్తుంది. వాళ్లు తమ భాగస్వామితో ఎంత ప్రేమగా ఉంటున్నారనే దానిపైనే సంబంధాలు ఆధారపడి ఉంటాయి. కేవలం సెక్స్ ఒక్కటే కాకుండా భాగస్వామిని ఆనందపరిచేవి చాలానే ఉంటాయి. అంగం సైజుతో మాత్రమే అన్ని జరిగిపోవు. ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా మీ సమస్యను అధిగమించి ఆనందాన్ని పొందుతారు. మీ మనసు పెద్దదిగా ఉంటే చాలు.. వేరే శరీర భాగాల గురించి ఆలోచించాల్సిన పనిలేదు..’