Sea Food: చెరువు చేపల కన్నా సముద్రపు చేపలే బెటర్, వారానికోసారి తినాల్సిందే
27 December 2023, 10:27 IST
- Sea Food: ఎక్కువమంది చెరువు చేపలు తినేందుకే ఆసక్తి చూపిస్తారు. నిజానికి సముద్రపు చేపల్లోనే పోషకాలు అధికంగా ఉంటాయి.
సముద్రపు చేపలు ఎందుకు తినాలి?
Sea Food: సముద్ర తీర ప్రాంతంలో ఉన్నవారికి సముద్రపు చేపలు ఎక్కువగా లభిస్తాయి. కానీ సముద్రానికి దూరంగా ఉంటున్న వారికి సముద్రపు చేపలు అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి. అలాంటప్పుడు కచ్చితంగా వాటిని కొనుక్కొని తినాల్సిందే. సముద్రపు చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఎంతో మేలు జరుగుతుంది. చెరువు చేపలు లేదా సముద్రపు చేపలు... ఈ రెండిటిలో ఏది బెటర్ అని అడిగితే పోషకాహారా నిపుణులు సముద్రపు చేపలే మంచివని చెబుతున్నారు. రుచిలో కూడా సముద్రపు చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా సముద్రపు చేపలను తినేందుకు ప్రయత్నించాలి.
సముద్రపు చేపలు ఎందుకు తినాలి?
సముద్రపు చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. చెరువు చేపల్లో ఈ ఆమ్లాలు ఉన్నా అవి తక్కువ శాతమే ఉంటాయి. ఈ సముద్రపు చేపలను తినడం వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. సముద్రపు చేపల్లో విటమిన్ డి కూడా లభిస్తుంది. కాబట్టి విటమిన్ డి లోపంతో బాధపడేవారు సముద్రపు చేపలను తినడం అలవాటు చేసుకోవాలి. విటమిన్ డి శరీరంలోకి అందడం వల్ల కాలుష్యాన్ని శోషించుకునే శాతం కూడా పెరుగుతుంది. దీనివల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు సముద్రపు చేపలు తినిపించడం మంచిది.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. రోగనిరోధక శక్తిని బలంగా మార్చే శక్తి సముద్రపు చేపలకు ఉంది. సముద్రంలో పెరిగే చేపలు, రొయ్యలు, పీతలు వంటి వాటిలో జింక్ అధికంగా ఉంటుంది. జింక్ అధికంగా ఉండే వీటిని తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఈ సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు వంటి వాటిలో విటమిన్ ఏ, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, సెలీనియం అధికంగా లభిస్తుంది. ఇవి మన శరీరాన్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి. మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి.
సముద్రపు జీవుల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయని చెప్పుకున్నాం. సముద్రంలో పెరిగిన రొయ్యలు, పీతలు, చేపలు వేటిని తిన్నా కూడా ఈ ఆమ్లాలు అధికంగా శరీరానికి లభిస్తాయి. వారానికి ఒక్కసారి వాటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండెపోటు ఇతర గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.
కంటిచూపు మెరుగుపడడానికి సముద్రపు చేపలు సహకరిస్తాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కంటి చూపును కాపాడతాయి. రేచీకటి వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.
మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు సముద్రపు చేపలను త్వరగా తరుచూ తినాలి. ఈ చేపల్లో ఉండే పోషకాలు ఒత్తిడిని తట్టుకునే శక్తిని అందిస్తాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు వంటి వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది.
సముద్రపు చేపలు తినే వారి చర్మం కాంతివంతంగా ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే హానికారక అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని ఎలాంటి డ్యామేజ్ చేయకుండా కాపాడే శక్తి ఈ సముద్రపు చేపలకు ఉంది. అలాగే సముద్రపు చేపలు తినే వారిలో మొటిమలు వచ్చే అవకాశం తక్కువే. కాబట్టి ఎక్కడైనా సముద్రపు చేపలు కనిపిస్తే ఖచ్చితంగా కొని తినండి.