SBI WhatsApp । ఇప్పుడు వాట్సాప్‌లోనే మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా!
21 July 2022, 22:53 IST
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. కేవలం తాజాగా వాట్సాప్ మెసేజ్ చేసి అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు, మినీ స్టేట్‌మెంట్ పొందవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.
SBI WhatsApp Banking Service
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు మరింత చేరువయ్యే దిశగా మరో అడుగు వేసింది. కస్టమర్లకు బ్యాంకింగ్‌ను సులభతరం చేయడానికి వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు SBI కస్టమర్‌లు వాట్సాప్‌ని ఉపయోగించి నిర్ధిష్ట బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ తెలుసుకోవడం కోసం లేదా మినీ స్టేట్‌మెంట్ కోసం ఇప్పుడు యాప్‌ని డౌన్‌లోడ్ చేయనవసరం లేదు, ATMకి వెళ్లనవసరం లేదు. సులభంగా తమ వాట్సాప్ నుంచే ఈ తరహా సేవలను పొందవచ్చు.
కస్టమర్లు తమ తమ అకౌంటుకు అనుసంధానం చేసిన మొబైల్ నెంబర్ నుంచి తమ వాట్సాప్ ద్వారా +919022690226 నంబర్‌కు ‘హాయ్’ అని సందేశం పంపాలి. ఇలా చేసిన వెంటనే SBI వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని SBI తన ప్రకటనలో పేర్కొంది.
ఒకవేళ మీరు మీ బ్యాంక్ ఖాతాకు మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకోకపోతే మీరు బ్యాంకులో ఇచ్చిన మొబైల్ నంబర్ నుంచి 917208933148కు WAREG A/c నంబర్‌ని SMS చేయండి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం కోసం bank.sbiని సందర్శించవచ్చు.
వాట్సాప్ ద్వారా అకౌంట్ బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్‌మెంట్ ఇలా పొందండి
స్టెప్ 1: మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి వాట్సాప్ ద్వారా +919022690226 నంబర్‌కు ‘Hi' అని టైప్ చేసి సెండ్ చేయండి. మీకు “ప్రియమైన కస్టమర్, మీరు SBI వాట్సాప్ బ్యాంకింగ్ సేవల కోసం విజయవంతంగా నమోదు చేసుకున్నారు” అని ప్రత్యుత్తరం వస్తుంది.
స్టెప్ 2: "SBI వాట్సాప్ బ్యాంకింగ్ సేవలకు స్వాగతం! దయచేసి దిగువన ఉన్న ఏవైనా ఎంపికల నుండి ఎంచుకోండి" అని మరొక మెసేజ్ వస్తుంది.
1. ఖాతా బ్యాలెన్స్
2. మినీ స్టేట్‌మెంట్
3. WhatsApp బ్యాంకింగ్ నుంచి డి-రిజిస్టర్ చేసుకోండి
పైన పేర్కొన్న ఆప్షన్లలో మీరు మీ SBI ఖాతాలో ఏం తనిఖీ చేయాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ ఎంచుకోండి. మీ ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి 1 ఎంటర్ చేయండి. లేదా మీ చివరి ఐదు లావాదేవీల మినీ స్టేట్‌మెంట్‌ను పొందడానికి 2 ఎంటర్ చేయండి. మీరు SBI వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు వద్దనుకుంటే 3 ఎంటర్ చేయవచ్చు.
మీ ఎంపిక ప్రకారం మీ ఖాతా బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్‌మెంట్ మీకు అక్కడ వచ్చేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 'SBI కార్డ్ WhatsApp కనెక్ట్' పేరుతో WhatsApp ఆధారిత సేవలను కూడా అందిస్తుంది.