తెలుగు న్యూస్  /  Lifestyle  /  Savings For Your Children Higher Education

Higher education cost | మీ పిల్లల ఉన్నత విద్య ఖర్చు కోసం పొదుపు చేస్తున్నారా?

16 February 2022, 9:45 IST

    • Higher education cost | పిల్లల ఉన్నత విద్య కోసం కూడా పొదుపు చేయాలా? అని ప్రశ్నించబోయే ముందు మీ కాలంలో చదువులకు అయిన ఖర్చెంత? ఇప్పుడు నర్సరీ ఫీజెంత? ఒకసారి పరిశీలించండి. ఇక పదిహేడేళ్ల తరువాత ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు గురించి ఒకసారి ఊహించండి. మరి ఆ రీతిలో సేవింగ్స్ చేస్తున్నారా?
ఏటా పెరిగిపోతున్న ఉన్నత విద్య ఖర్చు
ఏటా పెరిగిపోతున్న ఉన్నత విద్య ఖర్చు (unsplash)

ఏటా పెరిగిపోతున్న ఉన్నత విద్య ఖర్చు

నర్సరీ ఫీజే రూ. లక్షల్లో ఉంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువులకు ఏ స్థాయిలో ఉంటుందో మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. పైగా ఈతరం పిల్లలపై స్నేహితుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. పదేళ్ల క్రితం ఇతర రాష్ట్రాల్లో విద్య అభ్యసించడం ఒక ట్రెండైతే.. ఇప్పుడు విదేశాల్లో చదువులు కొత్త ట్రెండ్. ఇటీవలికాలం వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుల కోసం మాత్రమే విదేశాలను ఆశ్రయించేవాళ్లు. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ కోసం కూడా విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. కేవలం ఇంజినీరింగ్, వైద్య విద్య మాత్రమే కాకుండా న్యాయ విద్య, జర్నలిజం, హోటల్ మేనేజ్‌మెంట్, వంటి విభిన్న అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరుతున్నారు.

భారీగా పెరుగుతున్న ఫీజులు

ద్రవ్యోల్భణాన్ని బట్టి చూస్తే విద్యారంగంలో ఫీజుల పెరుగుదల వార్షికంగా కనీసం 10 శాతం ఉంది. నర్సరీలో ఉన్న మీ పాప లేదా బాబు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరాలంటే మరో 15 ఏళ్లు పడుతుంది. పదిహేనేళ్ల తరువాత కదా అని నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటి నుంచే ఇందుకోసం సేవింగ్స్ చేయడం మేలు.

ఎందుకంటే 10 శాతం ద్రవ్యోల్భణంతో లెక్కిస్తే ఇప్పుడు ఏడాదికి రూ. 15 లక్షల ఫీజు ఉంటే.. అది 15 ఏళ్ల తరువాత సుమారు రూ. 62,65,872 అవుతుంది. ఒకవేళ పదేళ్ల తరువాత అండర్ గ్రాడ్యుయేషన్ చదివే పిల్లలకైతే రూ. 38,90,614 అవుతుంది. ఇదంతా ఏడాదికి అయ్యే ఖర్చు. హాస్టల్ ఫీజుతో కలిపి లెక్కించిన ఖర్చు ఇది. ఒకవేళ హాస్టల్ ఫీజు అదనమైతే ఇంకా తడిసి మోపెడవుతుంది.

మరి సేవింగ్స్ ఎలా?

భవిష్యత్తులో ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు చాలా ఎక్కవ అని తెలుసుకున్నాం కదా.. పొదుపు కూడా ఇదే రేంజ్‌లో ఉండాలంటే మనం చిన్న మొత్తాల పొదుపు సంస్థల్లో, లేదా ఇతర రిస్క్ లేని పొదుపు పథకాల్లో ఇంత కూడబెట్టడం కష్టమైన పని. అందుకే ఉన్నత విద్య కోసం ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను ఎంచుకోవాలని మీరనుకుంటే తప్పనిసరిగా అధిక రాబడి ఇచ్చే పొదుపు సాధనాల్లో పెట్టుబడి పెట్టాలని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు చెబుతున్నారు.

ఇందుకు రియల్ ఎస్టేట్.. అంటే స్థలాలపై పెట్టుబడి పెట్టడం గానీ, క్రమపద్ధతిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం గానీ చేయాలని సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి రాబడులే ఉంటాయి. అయితే స్టాక్ మార్కెట్స్‌పై అవగాహన లేనప్పుడు ప్రొఫెషనల్ సేవలకు రుసుము చెల్లించి వారి సేవలను పొందవచ్చు. మీ పెట్టుబడులు ఒకే రంగంలో కాకుండా విభిన్న రంగాల్లో ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొంత రియల్ ఎస్టేట్‌లో, కొంత షేర్లలో, కొంత మ్యూచువల్ ఫండ్స్‌లో, కొంత గోల్డ్‌పై.. ఇలా విభిన్న రకాల పెట్టుబడులు మీ రిస్క్‌ను తగ్గిస్తాయి.

ఒక వేళ మీ ఆస్తులు స్థిరాస్తుల రూపంలో ఉన్నా, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ రూపంలో ఉన్నా వాటిని తనఖా పెట్టి రుణం కూడా తీసుకోవచ్చు. లేదా అవసరమైన మేరకు విద్యా రుణం కూడా పొందవచ్చు.

టాపిక్