Colour wheel: ఈ కలర్ వీల్ చేసి పెట్టుకోండి, మీ ఫ్యాషన్ సెన్సే మారిపోతుంది
30 October 2024, 10:30 IST
Colour wheel: కలర్ కాంబినేషన్లు సరిగ్గా తెలియకపోతే ఎలాంటి బట్టలు వేసుకున్నా స్టైలిష్ లుక్ రాదు. అందుకే రంగుల్ని ఎలా ఎంచుకోవాలి. ఏ రంగుకు ఏ రంగు నప్పుతుందో పక్కాగా తెలిపే ఈ కలర్ వీల్ గురించి తెల్సుకోండి.
కలర్ వీల్
డ్రెస్సుకయినా, చీరకయినా కలర్ కాంబినేషన్ చాలా ముఖ్యం. సరైన కాంబినేషన్ ఉన్న బట్టలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. నలుగురైదుగురు ఒకే రంగు చీర లేదా డ్రెస్సు కొనుక్కున్నా.. దాన్ని ఒక్కోక్కరు ఒక్కోలా స్టైల్ చేస్తారు. ఎరుపు రంగు చీరమీదకి ఎరుపు రంగు నగలు వేసుకుంటే బాగుంటుంది. కానీ ఒకసారి ఆకుపచ్చ రంగు నగలు వేసుకొని చూడండి. మెరిసిపోతారు. అలాగే నీలం రంగు ఆరెంజ్ రంగు కాంబినేషన్ బాగుంటుంది. దీన్నే కలర్ థియరీ అంటారు. ఏ రంగుకు ఏ రంగు నప్పుతుందో తెల్సుకుంటే ట్రెండీగా కనిపిస్తాం. అయితే ఈ రంగులను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అదొక సైన్స్. కానీ సాధారణ అవసరాల కోసం ఒక కలర్ వీల్ థియరీ ద్వారా మనం మంచి కాంబినేషన్లు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెల్సుకుందాం.
కలర్ వీల్:
పైన చిత్రంలో కనిపిస్తుందే కలర్ వీల్. దీంట్లో ఎరుపు, ఆకుపచ్చ, నీలం లాంటి ప్రైమరీ రంగులుంటాయి. వాటిని ఒకదాంతో ఒకటి కలిపితే వచ్చే సెకండరీ రంగులుంటాయి. ప్రైమరీ, సెకండరీ రంగుల్ని కలిపితే వచ్చే టెర్షియరీ రంగులుంటాయి. వీటన్నింటినీ సులువుగా అర్థం చేసుకోడానికి సరైన స్థానాల్లో ఈ కలర్ వీల్‌లో పొందుపర్చారు.
ఈ కలర్ వీల్ బట్టి కాంబినేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?
కాంప్లిమెంటరీ రంగుల కాంబినేషన్:
అంటే ఉదాహరణకు పైన కలర్ వీల్‌లో ఎరుపు రంగుకు ఎదురుగా ఆకుపచ్చ రంగు ఉంది. అలాగే పర్పుల్ ఎదురుగా పసుపు రంగు, వయోలెట్ ఎదురుగా లేత ఆకుపచ్చ రంగున్నాయి. అలా ఎదురుగా ఉన్న రంగులు ఒకదానితో ఒకటి బాగా నప్పుతాయి. వాటిని కాంప్లిమెంటరీ కలర్స్ అంటారు. అంటే పసుపు రంగు డ్రెస్ మీదికి పర్పుల్ దుపట్టా, అలాగే వయోలెట్ రంగు చీర మీదికి లేత ఆకుపచ్చ బ్లవుజు.. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చన్నమాట.
అనలాగస్ రంగుల కాంబినేషన్:
మీకు కనిపించే కలర్ వీల్‌లో పక్కపక్కనే ఉండే రంగులను అనలాగస్ రంగులంటారు. వీటిలో ఏవి ఎంచుకున్నా మంచి కాంబినేషన్ లుక్ ఉంటుంది. ఉదాహరణకు, ఎల్లో, ఎల్లో ఆరెంజ్, ఆరెంజ్.. ఈ మూడింటిని కాంబినేషన్ కోసం వాడొచ్చు. వయోలెట్, బ్లూ వయోలెట్, బ్లూ.. ఈ మూడింటినీ వాడొచ్చు.. లేదా గ్రీన్, ఎల్లో గ్రీన్, ఎల్లో.. ఈ మూడింటిని ఒక డ్రెస్ లేదా చీర కాంబినేషన్ కోసం వాడొచ్చు. అబ్బాయిలు కుర్తా పైజామా కుట్టించుకుంటే.. ఇలాంటి కాంబినేషన్లు ఎంచుకుని స్టైలిష్ గా కనిపించొచ్చు. చీరల్లోనూ, డ్రెస్సుల్లోనూ ఇదే నియమం.
ట్రయాడిక్ రంగు కాంబినేషన్:
కలర్ వీల్ మీద సమాన దూరంలో, సమాన భుజాలతో ఉన్న త్రిభుజాన్ని ఏర్పర్చే రంగుల్ని ట్రయాడిక్ రంగుల కాంబినేషన్ అంటారు.
అంటే మీరెంచుకున్న మూడు రంగుల్ని కలుపుతూ గీత గీస్తే సమాన భుజాల పొడవుతో ఉన్న త్రిభుజం ఏర్పడాలి. ఎరుపు, పసుపు, నీలం రంగుతో ఒక ట్రయాడిక్ రంగుల త్రిభుజం ఏర్పడుతుంది. పర్పుల్, గ్రీన్, ఆరెంజ్ తో మరో త్రిభుజం, రెడ్ వయోలెట్, ఎల్లో ఆరెంజ్, బ్లూ గ్రీన్ రంగులు కలిపి మరో ట్రయాడిక్ రంగుల త్రిభుజం ఏర్పడుతుంది. ఇవన్నీ మంచి కాంబినేషన్ రంగులన్నమాట.
కాబట్టి ఏ రంగుకు ఏం నప్పుతుందో తెలియట్లేదనే సందేహం మీకింక అక్కర్లేదు. మీ కళ్ల ముందు ఈ కలర్ వీల్ పెట్టుకుని, పైన చెప్పిన నియమాల ప్రకారం కలర్ కాంబినేషన్ ఎంచుకుంచే చాలు.
టాపిక్