స్త్రీలు ధైర్యంగా అడుగు ముందుకేస్తున్నారంటే.. దానర్థం చుట్టూ ఉన్న పరిస్థితులే..
07 January 2023, 6:30 IST
- Saturday Motivation : ఏ వ్యక్తి అయినా పుట్టుకతోనే శక్తిమంతుడు అయిపోడు. పరిస్థితులు వారిని స్ట్రాంగ్ చేస్తాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగేలా వారిని మారుస్తాయి. అలాగే స్త్రీలు కూడా. తమ శక్తిని గుర్తించడానికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు. కానీ పరిస్థితులు ఏదొక సమయంలో వారిని కచ్చితంగా శక్తివంతంగా మార్చేస్తాయి.
కోట్ ఆఫ్ ద డే
Saturday Motivation : ఆడవాళ్లకేమి తెలుసు.. అనేవారి నోళ్లు మూయిస్తూ.. దేశంలో స్త్రీలు తమ శక్తిని చాటుతున్నారు. తమ భయాలను అధిగమిస్తూ.. ప్రపంచాన్ని తమ గళంతో, తెలివితేటలతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారు. సాధారణంగా ఏ స్త్రీ అయినా సున్నితంగా, సౌమ్యంగానే కనిపిస్తుంది. అదేవారిని తక్కువ అంచనా వేసేలా చేస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ (మగవారు మాత్రమే కాదు..) గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేమిటంటే.. ఏ స్త్రీ అయినా సున్నితంగా కనిపించే దానికంటే రెట్టింపు స్ట్రాంగ్‌గా ఉంటుంది. ప్రతి పరిస్థితి వారిని మరింత స్ట్రాంగ్‌గా చేస్తూనే ఉంటుంది. ఈ విషయం గుర్తించని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.
ఓ స్త్రీ తన పరిధిని దాటి బయటకు రాలేకపోతుంది అంటే దాని వెనుక చాలా కారణాలు ఉండే ఉండొచ్చు. ఫ్యామిలీ కావొచ్చు.. సన్నిహితులు, స్నేహితులు, ప్రేమించేవారు, భర్త, పిల్లలు, సొసైటీ.. ఇలా ఒకటా.. రెండా.. ఎన్నో అడ్డంకులు దాటి ఓ ఆడది తన ఉనికి చాటుకోవాల్సి వస్తుంది. సరే వీరిని ఎందుకు బాధపెట్టడం అని తనలో తాను కుమిలిపోతూ.. పైకి సంతోషంగా కనిపిస్తూ.. కుటుంబాన్ని నెట్టుకొచ్చే మహిళలు ఎందరో ఈ దేశంలో ఉన్నారు. ఇది మనం నమ్మాల్సిన నిజం. కొందరు మాత్రమే తమ ఉనికిని చాటుకుంటూ.. ఇతరులకు ప్రోత్సాహమిస్తూ.. ముందుకు సాగుతున్నారు.
ఇవన్నీ దాటి బయటకు వచ్చి ఓ మహిళ తన గొంతు ఎత్తితే.. ఆమె తెగించేసింది (మగవారు మాత్రమే కాదు.. కొందరు ఆడవారు కూడా) అంటారు. తన హక్కుల కోసం తాను పోరాడడమే తెగింపు అంటే.. అవును ఆమె నిజంగానే తెగించింది. తన భయాలను దాటి.. కుటుంబాన్ని దాటి.. ఆఖరికి గడప దాటి బయట అడుగుపెట్టింది. తన హక్కుల కోసం.. జరగాల్సిన న్యాయం కోసం ప్రశ్నిస్తుంది. ఆమెకు ఈ ధైర్యం ఇచ్చింది ఎవరో తెలుసా? తన చుట్టూ ఉన్న పరిస్థితులే. తన చుట్టూ ఉండేవారు చేసే పనులతో విసిగిపోయి.. ఆమె ధైర్యంగా అడుగు ముందుకేసి.. మాట్లాడగలుగుతోంది. ఈ విషయాన్ని మగవారే కాదు.. ఆడవారు కూడా గుర్తించాలి. ఎందుకంటే.. ఎంక్రేజ్ చేసే మగవారు ఎలా ఉన్నారో.. ఓ ఆడదాన్ని వెనక్కిలాగే మరో మహిళ కూడా నేటి సమాజంలోనే ఉంది.
కేవలం మహిళలకు మాత్రమే కాదు.. ఎవరి జీవితంలోనైనా.. అనుకోని తుఫాను వస్తే కొట్టుకుని అయినా పోతారు.. లేదా ధైర్యంగా ఎదుర్కొంటారు. అలా ఎదుర్కోగలిగేవారినే సమాజం ఆదర్శంగా తీసుకుంటుంది. మహిళలు ఇప్పుడు ఏ దేశంలోనైనా.. బలమైన ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన నిర్వాహక పదవులు, ఉన్నత పదవులను కలిగి ఉన్నారు. వారి సొంత ప్రతిభ, శక్తి ఆధారంగా చరిత్రను సృష్టిస్తున్నారు. ఆడవారు బలం, తెలివితేటలు లేదా సామర్థ్యం పరంగా పురుషుల కంటే చాలా ఉన్నతంగా ఉన్నారని నిరూపించుకుంటున్నారు. మూస పద్ధలకు చరమగీతం పాడి.. పురుషులతో కలిసి.. వారికి ధీటుగా కూడా పని చేస్తూ.. ప్రతి వృత్తిలో తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు.
కాబట్టి మీ ఇంట్లోని ఆడపిల్లను.. ఆడ పిల్ల.. ఈడ పిల్ల అంటూ మాట్లాడకుండా.. ధైర్యంగా ఆమె సమాజాన్ని ఎదుర్కొనేలా సహాయం చేయండి. ఆమె సాధించే ఘనతను చూస్తే.. కుటుంబసభ్యులుగా మీరే ఎక్కువ ఆనందపడతారు. ఆడపిల్ల అంటే కేవలం కూతురు మాత్రమే కాదు. మీ భార్య కావొచ్చు.. చెల్లి కావొచ్చు.. అక్క కావొచ్చు.. ఆఖరుకి మీ తల్లి కూడా కావొచ్చు. వీరంతా తమలోని టాలెంట్‌ను లేదా వారి ఉనికిని వదిలేసి మీకోసం వంటింట్లో కుస్తీలు పడుతున్నారు. ఇటీవల వచ్చిన జయ జయ జయ సినిమానే దీనికి నిదర్శనం. తమకి టాలెంట్ ఉన్నా.. కుటుంబ సభ్యులు, అత్తింటివారు అది గుర్తించకుండా తొక్కేసినా.. చివరికి అందరికీ గుణపాఠం చెప్తూ..హీరోయిన్ తీసుకునే రివేంజ్‌కి థియేటర్లో విజిల్స్ పడ్డాయంటే అతిశయోక్తి కాదు.
అలాగే చాలామంది పురుషులు కూడా స్త్రీల విజయాన్ని, ఎదుగుదలను గమనించి అభినందిస్తున్నారు. కొందరు ఎలాగో మారరు. కట్టుబాట్లు, సంప్రదాయాలు, చెప్పి వెళ్లాలి.. చెప్పులేసుకెళ్లాలి అనుకుంటూ.. జీవితాన్ని గడిపేస్తారు. కానీ స్త్రీలు మాత్రం అనేక కొత్త అవకాశాలను కూడా అన్‌లాక్ చేస్తున్నారు. ప్రపంచం ముందు తమను తాము నిరూపించుకుని అందరినీ గర్వపడేలా చేస్తున్నారు. మీ ఇంట్లోని వారికి మీరు తగిన సపోర్ట్ ఇస్తే.. మిమ్మల్ని ఏదొక రోజు గర్వపడేలా చేస్తారు.