Riding in Monsoon | వానాకాలంలో బైక్ నడిపేవారు పాటించాల్సిన కొన్ని టిప్స్!
13 June 2022, 13:55 IST
- మీరు బైక్ నడిపే వారైతే వానాకాలంలో బైక్ నడిపేటపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి చిట్కాలు పాటించాలో ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ అందించాం. తప్పకుండా పాటించండి.
Riding Tips during Monsoon
మరికొన్ని వారాల్లో రుతుపవనాలు అంతటా విస్తరిస్తాయి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు కురిసే కొద్దీ చుట్టూ పచ్చదనం, ఆకాశంలో ఇంద్ర ధనస్సు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కానీ ఈ వానాకాలంలో బైక్ నడపాలంటే మాత్రం కింద చూడాలి, ముందుచూడాలి, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పట్నించి పొడవైన ట్రాఫిక్ జామ్‌లు, రోడ్లపై గుంటలు, కొన్నిసార్లు రోడ్డే కనిపించకుండా పోయేలా జలాశయాలు మన అనుభవంలోకి వస్తాయి. మనందరికీ రోడ్డుపై, నీటిపై నడిచే టూ-ఇన్-వన్ వాహనాలు ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి ఈ వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకుండా ఉండటానికి, ప్రమాదాలను నివారించటానికి ఇక్కడ కొన్ని టిప్స్ అందిస్తున్నాం వాటిని తప్పకుండా పాటించండి.
బైక్ సర్వీసింగ్
మొట్టమొదటగా మీ బైక్ సరైన స్థితిలో ఉందో లేదో నిర్ధారించుకోవడం అన్నిటికంటే ముఖ్యమైన విషయం. మాన్‌సూన్ సీజన్ పూర్తిస్థాయిలో ప్రారంభంకాకంటే మునుపే బ్రేక్‌లు, టైర్‌లు, లైట్లు సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఎలాంటి లోపాలు లేకుండా బైక్ సర్వీసింగ్ చేయించండి. మీ బైక్ రంగు మారకుండా అవసరమైతే టెఫ్లాన్ కోటింగ్ వేయించండి.
రైడ్ కోసం అన్ని రైట్ చేసుకోండి
మీ ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచేటువంటి నిండైన, సౌకర్యవంతమైన అలాగే నాణ్యమైన హెల్మెట్ కొనుగోలు చేయండి. పూర్తిగా కవర్ చేసే రెయిన్‌కోట్, వాటర్‌ప్రూఫ్ బ్యాగ్, వాటర్‌ప్రూఫ్ బూట్లు మొదలగునవి సమకూర్చుకోండి.
బ్రేక్ మెల్లిగా వేయండి
వానాకాలంలో సడన్ బ్రేక్స్ వేయవద్దు. వాహనం స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. వాహనం జారిపోకుండా ఆపడానికి ముందు, వెనుక బ్రేక్‌లను ఒకేసారి సున్నితంగా వేసేందుకు ప్రయత్నించండి. అలాగే వేగంగా బైక్ నడపవద్దు. తడి మార్గాలలో మామూలు వేగానికి కూడా బైక్ సర్రున జారిపోతుంది. కాబట్టి నియంత్రించగల వేగంలోనే వాహనం నడపాలి.
హెడ్‌లైట్ ఆన్
వానాకాలంలో వాహనం నడిపేటపుడు హెడ్‌లైట్‌లను ఆన్‌లో ఉంచుకోవాలి. అప్పుడే ఎదురుగా వచ్చే ట్రాఫిక్‌కి మీ ఉనికి గురించి తెలుస్తుంది. అలాగే నిజంగా అవసరమైతే తప్ప మీ హెడ్‌లైట్లు తక్కువ బీమ్‌లో ఉండేలా చూసుకోండి. హైబీమ్ వల్ల ఎదురుగా వస్తున్న వాహనాలకు కంటిచూపుకు అంతరాయం ఏర్పడి ఘోర ప్రమాదాలకు దారి తీయవచ్చు.
ఇంద్ర ధనస్సుపై బైక్ ఎక్కించొద్దు
రోడ్డుపై గుంటలు ఎంత లోతుగా ఉన్నాయో తెలియకపోవచ్చు. కాబట్టి గుంటలను నివారించి కాస్త ఆలస్యం అయినా పక్కదారిలో వెళ్లాలి. అలాగే తడిరోడ్లపై ఆయిల్ పడినపుడు అవి ఇంద్ర ధనస్సు రంగుల్లో కనిపిస్తుంది. ఇది- బుదరదతో జారిపోయే జిడ్డులా ఉంటుంది. దీనిపై నుంచి బైక్ నడిపిస్తే మీరు వెళ్లాల్సిన దారి మారిపోతుంది. కాబట్టి అడ్వెంచర్లు వద్దు.
వర్షాకాలంలో బంపర్ టూ బంపర్ ట్రాఫిక్ ఉండవచ్చు. కాబట్టి తగిన దూరాన్ని పాటించండి. వేగాన్ని నివారించండి. నిదానమే ప్రధానం అని గుర్తుంచుకోండి.