Lentil Rice Pilaf Recipe । లంచ్‌లో తినండి రైస్ పిలాఫ్.. టేస్ట్ చూసి అంటారు వాహ్!
09 June 2023, 12:31 IST
- Lentil Rice Pilaf Recipe: పప్పు ధాన్యాలతో చేసే రైస్ పిలాఫ్ ఎలా చేయాలో ఇక్కడ రెసిపీని అందిస్తున్నాం. మీరూ ప్రయత్నించండి.
Lentil Rice Pilaf Recipe
Quick Rice Recipes: మనం అన్నంను చాలా రకాలుగా వండుకోవచ్చు. బిర్యానీ, పులావ్, ఫ్రైడ్ రైస్, తెహరీ మొదలైన ఎన్నో రకాల వంటకాలను అన్నంతోనే వండుతారు. ఇక్కడ మీకు రైస్ పిలాఫ్ రైసిపీ గురించి తెలియజేస్తున్నాం. రైస్ పిలాఫ్ అనేది పర్షియా వంటకాలలో ప్రధానంగా చేసే ఒక రైస్ రెసిపీ. ఇదేదో కొత్త వంటకం కాదు, మనం వండుకునే పులావ్ అనేది ఈ పిలాఫ్ నుంచే ఉద్భవించింది, ప్రాంతాన్ని బట్టి వాడే పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు, రుచి మారుతూ ఉంటాయి. ఇంగ్లాండ్‌లో, దీనినే పిలావ్ అని పిలుస్తారు.
మీకోసం ఇక్కడ పప్పు ధాన్యాలతో చేసే రైస్ పిలాఫ్ ఎలా చేయాలో ఇక్కడ రెసిపీని అందిస్తున్నాం. మీరు ఈ లెంటిల్ రైస్ పిలాఫ్‌ను ఏ సైడ్ డిష్ అవసరం లేకుండా నేరుగా తినేయవచ్చు. అయితే మీ అభిరుచిని బట్టి రైతా లేదా పెరుగుతో తినవచ్చు.
Lentil Rice Pilaf Recipe కోసం కావలసినవి
- 1 కప్పు బాస్మతి బియ్యం
- 1/2 కప్పు శనగపప్పు (లేదా ఏదైనా పప్పు)
- 1 క్యారెట్
- 1 ఉల్లిపాయ
- 2 పచ్చి మిరపకాయలు
- 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1/4 కప్పు పుదీనా ఆకులు
- 1 బిరియానీ ఆకు
- 1/2 టీస్పూన్ జీలకర్ర
- 1 స్టార్ సోంపు
- 2 పచ్చి ఏలకులు
- 1 అంగుళం దాల్చిన చెక్క
- 2 టేబుల్ స్పూన్ల నూనె
- ఉప్పు తగినంత
- 1 స్పూన్ నిమ్మరసం
- కొత్తిమీర ఆకులు గార్నిషింగ్ కోసం
లెంటిల్ రైస్ పిలాఫ్ తయారీ విధానం
- బియ్యం, పప్పులను కడిగి వేర్వేరుగా నానబెట్టండి. పప్పును ఎక్కువసేపు నానబెట్టాలి. అనంతరం నీటిని వడపోసి పక్కన పెట్టండి.
- ఇప్పుడు ఒక కుండలో నూనె వేడి చేసి, మొదటగా మసాలా దినుసులను వేయించాలి.
- ఆపైన ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- క్యారెట్ ముక్కలు, పుదీనా వేసి కొద్దిగా వేయించాలి.
- ఆపైన నానబెట్టిన బియ్యం, పప్పు వేసి 2 నుండి 3 నిమిషాలు వేయించాలి.
- ఇప్పుడు ఇందులో సరిపడా నీరు పోయండి, ఉప్పువేసి కలపండి, మూతపెట్టి తక్కువ మంట మీద ఉడికించాలి.
- అన్నం పప్పులు ఉడికాక, చివరగా నిమ్మరసం పిండి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
అంతే, లెంటిల్ రైస్ పిలాఫ్ రెడీ.. వేడివేడిగా ఆస్వాదించండి.