Republic Day 2024: నాలుగు గంటల పాటు సాగే గణతంత్ర దినోత్సవ పరేడ్... దీని ఖర్చు ఎంతో తెలిస్తే అవాక్కవుతారు
25 January 2024, 7:00 IST
- Republic Day 2024: మనదేశంలో గణతంత్ర దినోత్సవం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. దీనికోసం కోట్ల రూపాయలను ఖర్చు పెడతారు.
రిపబ్లిక్ డే 2024
Republic Day 2024: ప్రతి ఏడాది జనవరి 26 వస్తే న్యూఢిల్లీలోని రాజపథ్ లో సాయుధ బలగాలు పరేడ్ నిర్వహిస్తాయి. ఈ పరేడ్ చూసేందుకు ఎంతోమంది ఇక్కడికి విచ్చేస్తారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా సిద్ధమవుతున్నాయి. ఈరోజున భారత రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మన దేశ గొప్పతనాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని చూపిస్తారు.భారతదేశంలో 1950 జనవరి 26న రాజ్యాంగం అమలు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ రోజున జరిగే పరేడ్ ను చూసేందుకు రెండు లక్షల మంది వస్తారు.
రిపబ్లిక్ డే పరేడ్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన శకటాలు కవాతును నిర్వహిస్తాయి. వీటన్నింటి కోసం ముందుగానే ఎన్నో ఏర్పాట్లు చేస్తారు. ఈ కవాతు 4 గంటల పాటు జరుగుతుంది. నాలుగు గంటల పాటు జరిగే పరేడ్‌ను నిర్వహించడానికి అయ్యే ఖర్చు మాత్రం కొంత కొన్ని కోట్లలో ఉంటుంది.
ఖర్చు ఎంతంటే...
2014లో నాలుగు గంటల పాటు పరేడ్ ను నిర్వహించారు. దీనికి కేంద్రం చేసిన ఖర్చు 320 కోట్ల రూపాయలు. ఆర్టీఏ చట్టం కింద ఒక వ్యక్తి వేసిన పిటిషన్ కు జవాబు చెబుతూ ఈ ఖర్చును బయటపెట్టింది ప్రభుత్వం. 2001లో రిపబ్లిక్ డే పరేడ్‌కైనా ఖర్చు 145 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ 2014కు వచ్చేసరికి ఆ ఖర్చు రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం కూడా 300 కోట్ల రూపాయలకు తగ్గకుండానే ఖర్చవుతుంది అని అంచనా. ఈ పరేడ్ అనేది దేశ ప్రతిష్ట కు సంబంధించినది. కాబట్టి ఈ ఖర్చుపై ఎవరూ ఎలాంటి విమర్శలు చేయరు.
భారతదేశ సైనిక శక్తిని చూపించే అన్ని ట్యాంకులు, సాయుధ వాహనాలు, ఆధునిక పరికరాలు ఈ పరేడ్ లో ప్రదర్శిస్తారు. ఇవన్నీ కూడా ముందుగానే ఇండియా గేట్ ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఉన్న ప్రత్యేక శిబిరాల్లో ఉంచుతారు. వీటిని చూడడానికే ఎక్కువ మంది వీక్షకులు వస్తారు. ఈ పరేడ్ దాదాపు 9 కిలోమీటర్ల దూరం జరుగుతుంది. ముందుగా అనుకున్న సమయానికే కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కొన్ని నిమిషాలు ఆలస్యం చేసినా కూడా నిర్వాహకులకు ఖర్చు భారీగా అవుతుంది. అందుకనే ముందుగానే రిహార్సల్స్ చేసి ఎలాంటి తప్పిదాలు, ఆలస్యాలు కాకుండా చూసుకుంటారు.
ఈ పరేడ్లో అత్యంత ఆకర్షణీయమైనది ‘ఫ్లై పాస్ట్’. విమాన దళం 41 ఎయిర్ క్రాఫ్ట్ తో దీన్ని నిర్వహిస్తుంది. ఆకాశంలో మూడు రంగులను జెండాను ఆవిష్కరిస్తుంది. ఈ ఫ్లై పాస్ట్ చూసేందుకు కనుల పండుగ ఉంటుంది.
టాపిక్