Cucumber Cooler | వేసవితాపాన్ని కుకుంబర్ మింట్ కూలర్‌తో చల్లబరుచుకోండి!
04 April 2022, 9:11 IST
- వేసవి తాపాన్ని తాళలేకపోతున్నారా? అయితే కుకుంబర్ మింట్ కూలర్‌తో రీఫ్రెష్ అయిపోండి. ఒంట్లో వేడికి చల్లటి అనుభూతి ఇవ్వడానికి ఇదొక చక్కటి పానీయంగా పనిచేస్తుంది.
Cucumber Mint Cooler- representative image
ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎలాంటి శ్రమ లేకుండా శరీరం నుంచి నీరు బొట్టు బొట్టుగా ఆవిరైపోతుంది. గొంతులు తడి ఆరిపోతున్నాయి. ఈ సమయంలో దాహార్తిని తీర్చి, శరీరాన్ని చల్లబరిచే పానీయాలు తీసుకుంటే ప్రాణం లేచివచ్చినట్లుగానే కాకుండా సమ్మర్ చల్లని నీళ్లలో స్విమ్మింగ్ చేస్తున్నంత అనుభూతి లభిస్తుంది.
వేసవి తాపాన్ని అధిగమించడానికి, రోజంతా ఉత్సాహంగా ఒక ఉత్తమమైన రిఫ్రెష్ డ్రింక్ ను ఇక్కడ పరిచయం చేస్తున్నాం. దోసకాయ ఎంతో చలువ చేస్తుంది, పుదీనా చల్లని అనుభూతిని ఇస్తుంది. ఈ రెండింటి మిళితంతో పోషకాహార నిపుణులు లోవ్‌నీత్ బాత్రా వేసవి రిఫ్రెష్‌మెంట్ పానీయం ఎలా తయారో చేసుకోవాలో వివరించారు. ఆ రెసిపీ ఇక్కడ ఉంది, మీరూ ప్రయత్నించి చల్లబడండి.
కుకుంబర్ మింట్ కూలర్ పానీయంకు కావాల్సినవి
· 2 దోసకాయలు
· 1/4 కప్పు పుదీనా ఆకులు
· 1 స్పూన్ నిమ్మరసం
· నీరు
తయారు చేసుకునే విధానం
1. బ్లెండర్ జార్‌లో ఒక రెండు గ్లాసుల నీరు తీసుకొని అందులో దోసకాయ, పుదీనా ఆకులు, నిమ్మరసం వేయాలి.
2. వేసిన పదార్థాలు మృదువుగా మారేంత వరకు అధిక వేగంతో అన్ని పదార్థాలను మిక్సీలో బ్లెండ్ చేయాలి.
3. ఇప్పుడు బ్లెండర్ నుండి జార్‌ను బయటకు తీసివేసి ఈ ద్రావణాన్ని ఒక గిన్నెలోకి వడకట్టండి.
4. గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసి, ఆపై వడకట్టిన దోసకాయ ద్రావణం పోయాలి.
5. పై నుండి నిమ్మకాయ ముక్కను వేసి, పుదీనా ఆకుతో అలంకరించండి. అంతే.. కుకుంబర్ మింట్ కూలర్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు చల్లచల్లగా ఆస్వాదించండి.
వేసవిలో ఇదొక అద్భుతమైన పానీయం. ఇది శరీరాన్ని హైడ్రేట్, చల్లగా ఉంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండాకాలంలో చర్మం పాడవకుండా కాపాడుతుంది.