Menopause symptoms: మెనోపాజ్ లక్షణాలు ఇలా తగ్గించుకోండి
03 November 2023, 18:29 IST
- Menopause symptoms: మెనోపాజ్ లక్షణాలు తగ్గించుకోవడానికి నిపుణుల సూచనలు ఇక్కడ తెలుసుకోండి. మెనోపాజ్ అర్థం పీరియడ్స్ సైకిల్ ఆగిపోవడం. ఈ దశలో స్త్రీ శరీరం పలు మార్పులకు గురవుతుంది.
మెనోపాజ్ దశలో కనిపించే శారీరక మార్పుల నుంచి ఉపశమనం పొందడానికి జీవనశైలిలో మార్పులు అవసరం
మెనోపాజ్ అంటే రుతుచక్రం ఆగిపోవడం. ఇదొక సహజ ప్రక్రియ. మహిళల హార్మోన్ల మార్పుల్లో ఇదొక మైలురాయి. మెనోపాజ్ వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. శరీర ఎగువ భాగాలు వేడెక్కడం, రాత్రిపూట చమటలు పట్టడం, బరువు పెరగడం, మూడ్ స్వింగ్స్, మెటబాలిజంలో సమస్యలు వంటి లక్షణాలు మెనోపాజ్ దశలో కనిపిస్తాయి.
12 నెలల పాటు మెన్‌స్ట్రువల్ సైకిల్ (రుతుచక్రం/పీరియడ్స్) రాలేదంటే మీరు మెనోపాజ్ దశకు చేరుకున్నట్టు అర్థం చేసుకోవాలి. జన్యుపరమైన కారకాలను బట్టి మహిళల్లో 40 నుంచి 55 ఏళ్ల మధ్య మెనోపాజ్ వస్తుంది.
మెనోపాజ్ దశకు చేరుకున్నప్పుడు మహిళల శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. పలు మార్పులు సంభవిస్తాయి. కొన్ని సమయాల్లో లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
ఇండియన్ సూపర్ ఫుడ్స్, డోంట్ లూజ్ యువర్ మైండ్.. లూజ్ యువర్ వెయిట్ వంటి పుస్తకాలు రాసిన సెలెబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివాకర్ ఆరోగ్యం, ఫిట్‌నెస్, న్యూట్రిషన్ గురించి సోషల్ మీడియాలో తరచుగా వీడియోలు పోస్టు చేస్తుంటారు. మెనోపాజ్ గురించి కూడా పలు పోస్టులు పెడుతుంటారు.
మెనోపాజ్ గురించి రుజుతా దివాకర్ మాట్లాడుతూ ‘ఈస్ట్రోజన్ ఉత్పత్తి చేసే ఓవరీ కుంచించుకుపోతుంది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, ఫీమేల్ హార్మోన్ల స్థాయి తగ్గిపోతుంది. ఈ హార్మోన్ల స్థాయి తగ్గిపోవడంతో పీరియడ్స్ నిలిచిపోతాయి. ఈ దశను మెనోపాజ్ అంటారు..’ అని వివరించారు.
మెనోపాజ్‌కు ముందు శరీరం మార్పులకు లోనవుతుంది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వేగంగా తగ్గిపోతుంది. ఈ సమయంలో మహిళల్లో పలు లక్షణాలు గమనించవచ్చు.
Menopause symptoms: మెనోపాజ్ లక్షణాలు ఇవే
మూడ్ స్వింగ్స్, తరచుగా ఆకలి వేయడం, అకస్మాత్తుగా జుట్టు రాలిపోవడం, మొటిమలు రావడం, శరీరం ఎగువ భాగంలో వేడెక్కెడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. క్రమపద్ధతిలో హార్మోన్లు తగ్గిపోతే ఈ లక్షణాలు తక్కువగా ఉంటాయని రుజుతా దివాకర్ చెప్పారు.
1. ఆహారంలో మార్పులు
శరీరంలో మార్పులు సంభవిస్తున్నట్టు సమతుల ఆహారం చాలా ముఖ్యం. సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యను గుర్తించి స్థానిక, సీజనల్, సంప్రదాయ ఆహారాన్ని స్వీకరించాలి. సప్లిమెంట్లపై ఆధారపడవద్దు. వాటి వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండదు. శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు తీసుకోవాలంటే మీ ఆహారంలో వైవిధ్యం అవసరం. ఆహారం తీసుకోకపోవడం, ఉపవాసం ఉండడం వంటి పనులు చేయకూడదు. తగిన డైట్ ద్వారా మెనోపాజ్ లక్షణాలు తగ్గిపోతాయి. క్రమంగా బరువు కూడా అదుపులో ఉంటుంది.
2. రోజువారీ వ్యాయామం
వ్యాయామం కారణంగా బలం, స్టామినా, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతాయి. యోగా, స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో ఎక్సర్‌సైజుల కాంబినేషన్ మెనోపాజ్ లక్షణాలు తగ్గేందుకు సాయపడుతుంది.
వారంలో కనీసం రెండుసార్లు స్ట్రెంత్ ట్రైనింగ్, యోగా తప్పకుండా చేయాలి. ఇక వారంలో కనీసం 3 గంటల పాటు ఇతర ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మహిళలు వ్యాయామం కోసం రోజుకు కనీసం 30 నిమిషాల పాటు కేటాయించాలని రుజుతా సూచించారు.
3. విశ్రాంతి, కోలుకోవడం
మధ్యాహ్నం పూట 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి 9.30 నుంచి 11 గంటల మధ్య నిద్ర పోవాలి. శరీరం మార్పుల నుంచి కోలుకునేందుకు తగినంత విశ్రాంతి అవసరం. కఠిన వ్యాయామాలను ఎంచుకోకూడదు.