Menopause age: మెనోపాజ్ ఎప్పుడు వస్తుంది? లేట్ అయితే రిస్క్ ఏంటి?-study finds obesity significantly increased heart failure risk among women with late menopause ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Study Finds Obesity Significantly Increased Heart Failure Risk Among Women With Late Menopause

Menopause age: మెనోపాజ్ ఎప్పుడు వస్తుంది? లేట్ అయితే రిస్క్ ఏంటి?

Praveen Kumar Lenkala HT Telugu
Nov 18, 2022 10:36 AM IST

menopause age: మెనోపాజ్ 45 ఏళ్ల వయస్సు కంటే ముందే వస్తే ఒబెసిటీ, గుండె జబ్బులకు అధిక ఆస్కారం ఉంటుందని ఇదివరకటి అధ్యయనాలు చెప్పాయి. అయితే 55 ఏళ్లు, ఆ పై మెనోపాజ్ వచ్చిన వారిలో ఒబేసిటీ, హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు ఇంకా ఎక్కువ వచ్చిపడతాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.

ఆలస్యంగా మెనోపాజ్ వచ్చినా రిస్కేనని తేల్చినా అధ్యయనం
ఆలస్యంగా మెనోపాజ్ వచ్చినా రిస్కేనని తేల్చినా అధ్యయనం (pixabay)

45 ఏళ్లలోపే మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో హార్ట్ ఫెయిల్యూర్, ఒబెసిటీ రిస్క్ ఎక్కువగా ఉంటుందని గత అధ్యయనాల్లో తేలింది. అయితే 55 ఏళ్లు, ఆ పై వయస్సులో మెనోపాజ్ (రుతు చక్రం/ పీరియడ్స్ ఆగిపోవడం) దశకు చేరుకున్న వారిలో ఈ రిస్క్ గణనీయంగా పెరిగిందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అమెరికన్ హఆర్ట్ అసోసియేషన్ జర్నల్ ఈ అధ్యయనాన్ని ప్రచురించింది.

మెనోపాజ్ దశలోకి వచ్చినప్పుడు స్త్రీ శరీరం ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లను తక్కువ స్థాయిల్లో ఉత్పత్తి చేస్తుంది. ఈ మార్పులు గుండె పోటు సహా ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపింది.

మహిళల్లో మెనోపాజ్ సాధారణంగా 45 నుంచి 55 ఏళ్ల వయస్సులో వస్తుంది. సహజ మెనోపాజ్ దశ సగటు వయస్సు గడిచిన 6 దశాబ్దాలలో 1.5 సంవత్సరాలు మేర పెరిగిందని ఓ అధ్యయనం వెల్లడించింది. అయితే నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే 1959-2018 ప్రకారం యునైటెడ్ స్టేట్స్‌లో 45 ఏళ్ల కంటే ముందే మెనోపాజ్ వచ్చిన వారు 12.6 శాతం ఉండగా, 55 ఏళ్లపైబడిన వయస్సులో మెనోపాజ్ వచ్చిన వారు 14.2 శాతంగా ఉన్నట్టు అంచనా వేసింది.

ఇంతకుముందు వెలువరించిన అధ్యయనం మెనోపాజ్ ఎర్లీగా వచ్చిన వారిలో హార్ట్ ఫెయిల్యూర్ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేల్చింది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె తగినంత రక్తం, ఆక్సిజన్‌ను శరీర అవయవాలకు పంప్ చేయలేకపోవడం.

‘ఆలస్యంగా, అంటే 55 ఏళ్ల ఆ పైబడిన వయస్సులో మెనోపాజ్ రావడం వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను తేల్చేందుకు తగిన అధ్యయనాలు ఇప్పటివరకు లేవు..’ అని కాలిఫోర్నియా డేవిస్ యూనివర్శిటీ కార్డియోవాస్కులర్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్, ఈ అధ్యయనకర్త డాక్టర్ ఐమో ఎ.ఎబంగ్ చెప్పారు.

‘ఒబెసిటీ (ఊబకాయం) హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్‌ను పెంచుతుందని మనకు తెలుసు. మెనోపాజ్ దశ శరీరంలో కొవ్వు పెరిగే లక్షణంతో ముడివడి ఉంది..’ అని ఎబంగ్ చెప్పారు. ‘మెనోపాజ్ వయస్సును, భవిష్యత్తులో ఎదురయ్యే హార్ట్ ఫెయిల్యూర్ మధ్య గల సంబంధాన్ని ఒబెసిటీ ఎలా ప్రభావితం చేస్తుందని మా అధ్యయనంలో పరిశోధన చేశాం..’ అని వివరించారు.

అథెరోస్ల్కెరోసిస్ రిస్క్ ఇన్ కమ్యూనిటీస్ (ఏఆర్ఐసీ) అధ్యయనంలో పాల్గొన్న 4,500 మంది మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళలను తాజా అధ్యయనం కోసం ఎంచుకున్నారు. వీరిని వయస్సుల వారీగా, మెనోపాజ్ దశకు చేరుకున్న వయస్సు వారీగా విభజించి అధ్యయనం చేశారు. 45 ఏళ్లకు ముందే మెనోపాజ్ దశకు చేరుకున్న వారిని ఒక కేటగిరీలోకి, 45-49 మధ్య ఒక కేటగిరీని, 50-54 వయస్సుల్లో మెనోపాజ్ వచ్చిన వారిని ఒక కేటగిరీగా, 55 ఆపై వయస్సులో మెనోపాజ్ దశకు చేరుకున్న వారిని మరొక కేటగిరీగా వర్గీకరించి అధ్యయనం చేశారు. పార్టిసిపెంట్ల సగటు వయస్సు 63.5 ఏళ్లుగా ఉంది. అంతకంటే ముందే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడిన వారిని ఈ అధ్యయనం నుంచి మినహాయించారు. వారి మెనోపాజ్ వయస్సును, వారి బరువును క్రోఢీకరించారు. తిరిగి బరువు ప్రాతిపదికన మూడు గ్రూపులుగా వర్గీకరించారు. సాధారణ బరువు, అధిక బరువు, ఊబకాయంగా వర్గీకరించారు. దీనికి అదనంగా అసాధారణ ఊబకాయం అనే కేటగిరీని కూడా నమోదు చేశారు.

టైప్ 1, టైప్ 2 డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కిడ్నీ పనితీరు, ఇన్‌ఫ్లమేషన్, ఇప్పటికే ఉన్న గుండె జబ్బులు తదితర ఆరోగ్య, జీవనశైలి రిస్క్ ఫ్యాక్టర్స్‌ ప్రభావాన్ని సర్దుబాటు చేసి ఒబెసిటీ ద్వారా ఎదురయ్య హార్ట్‌ఫెయిల్యూర్ రిస్క్‌ను మాత్రమే అంచనా వేశారు. సగటున 16.5 ఏళ్ల ఫాలో అప్ సమయంలో 900 మంది మహిళల్లో హార్ట్ ఫెయిల్యూర్ సంభవించి అంతిమంగా అది హాస్పిటల్‌లో అడ్మిట్ అవడానికి, లేదా మరణానికి దారితీసింది.

Late Menopause: తేల్చిన విషయాలు ఇవే..

మెనోపాజ్ దశ వయస్సుకు, బాడీ మాస్ ఇండెక్స్‌కు, హార్ట్ ‌ఫెయిల్యూర్ రిస్క్‌కు గణనీయమైన సంబంధం ఉందని ఈ విశ్లేషణ కనగొంది.

1. 45 ఏళ్ల వయస్సులోపు మెనోపాజ్ వచ్చిన వారిలో బీఎంఐ ప్రతి 6 పాయింట్లు పెరిగిన కొద్దీ హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 39 శాతం పెరిగిందని తేల్చింది.

2. 45 నుంచి 49 మధ్య మెనోపాజ్ వచ్చిన వారిలో బీఎంఐ ప్రతి 6 పాయింట్లు పెరిగినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 33 శాతం పెరిగిందని తేల్చింది.

3. అదే 55 ఏళ్ల తరువాత మెనోపాజ్ వచ్చిన వారిలో హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ రెట్టింపు అయ్యిందని ఈ అధ్యయనం తేల్చింది.

4. మెనోపాజ్ దశ 55, ఆ పై వయస్సుల్లో వచ్చిన వారి నడుము చుట్టుకొలత ప్రతి ఆరు ఇంచుల పెరుగుదలకు హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ మూడింతలైందని అధ్యయనం తేల్చింది.

5. ఇతర ఏజ్ గ్రూపుల్లో మెనోపాజ్ వచ్చిన వారిలో నడుము చుట్టుకొలత ఇంత గణనీయంగా హార్ట్‌ఫెయిల్యూర్ రిస్క్‌ను పెంచలేదు. ‘తక్కువ వయస్సులో మెనోపాజ్ వచ్చిన వారిలో ఊబకాయం ప్రభావం ఆలస్యంగా మెనోపాజ్ వచ్చిన వారిలో కంటే ఎక్కువగా ఉందని మేం అంచనా వేశాం. కానీ అలా జరగలేదు. హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్‌పై ఒబెసిటి ప్రభావం ఆలస్యంగా మెనోపాజ్ వచ్చినవారిలోనే ఎక్కువగా ఉంది..’ అని పరిశోధకులు తెలిపారు.

ఈ అధ్యయనంలో తేలిన అంశాలు హార్ట్‌ఫెయిల్యూర్ స్క్రీనింగ్, మెనోపాజ్ దశల్లో కౌన్సెలింగ్‌కు ఉపయోగపడతాయని, తద్వారా హార్ట్‌ఫెయిల్యూర్స్‌ను నివారించవచ్చని ఎబంగ్ తెలిపారు. మెనోపాజ్ 45 ఏళ్ల కంటే ముందే వచ్చినప్పుడు మహిళలు తమ వైద్యులకు ఆ సంగతి వివరించాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని సూచించారు. అలాగే ఆలస్యంగా మెనోపాజ్ వచ్చినవారు కూడా శరీర బరువును అదుపులో ఉంచుకోవాలని సూచించారు.

WhatsApp channel