Rajma Pulao: డిన్న ర్ రెసిపి రాజ్మా పులావ్, రుచి అదిరిపోతుంది
22 February 2024, 17:30 IST
- Rajma Pulao: రాజ్మాను కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు. రాజ్మాలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని తరచూ తినమని సిఫార్సు చేస్తూ ఉంటారు పోషకాహార నిపుణులు.
రాజ్మా పులావ్ రెసిపీ
Rajma Pulao: రాజ్మా చావల్‌లాగే రాజ్మా పులావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీగా, ఇంట్లో డిన్నర్ రెసిపీగా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని చేయడం చాలా సులభం. పిల్లలకు కూడా ఇది నచ్చడం ఖాయం. రైతా లేదా సలాడ్ తో దీన్ని తింటూ ఉంటే రుచి మాములుగా ఉండదు. రాజ్మా పులావ్ సింపుల్ గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
రాజ్మా పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
రాజ్మా - అరకప్పు
నీరు - రెండు కప్పులు
బిర్యానీ ఆకు - ఒకటి
లవంగాలు - మూడు
యాలకులు - మూడు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
జీలకర్ర - ఒక స్పూను
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
పచ్చిమిర్చి - రెండు
నూనె - మూడు స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
కొత్తిమీర తరుగు - అరకప్పు
పసుపు - రెండు స్పూన్లు
కారం - అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
బాస్మతి బియ్యం - అరకప్పు
నిమ్మరసం - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
రాజ్మా పులావ్ రెసిపీ
1. రాజ్మాను ఆరు గంటల పాటు నానబెట్టాలి. తర్వాత కుక్కర్లో వేసి పది నిమిషాలు పాటు ఉడికించాలి.
2. అలాగే బాస్మతి బియ్యాన్నిగా కూడా 20 నిమిషాలు నీళ్లలో వేసి నానబెట్టాలి.
3. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి మిక్సీలో పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి నూనె వేయాలి.
5. ఆ నూనె వేడెక్కాక బిర్యానీ ఆకులు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు వేసి వేయించాలి.
6. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర తరుగు వేసి బాగా వేయించుకోవాలి.
7. అందులోనే కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలపాలి.
8. తర్వాత ఉడికించుకున్న రాజ్మాను వేయాలి.
9. ఇదంతా ఇగురులాగా అవుతుంది. అప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని తీసివేయాలి.
10. బియ్యం ఉడకడానికి సరిపడా నీటిని, తర్వాత నిమ్మ రసాన్ని కూడా కలపాలి.
11. రెండు నుంచి మూడు విజిల్స్ వరకు ఉంచాలి.
12. ఆ తర్వాత పావుగంట పాటు వదిలేసి కుక్కర్ మూత తీయాలి.
13. అంతే టేస్టీ రాజ్మా పులావ్ రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
రాజ్మాను కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు. ఇవి చూడడానికి కూడా కిడ్నీల ఆకారంలోనే ఉంటాయి. రాజ్మా తినడం వల్ల ఎముకల నొప్పులు తగ్గుతాయి. అలాగే వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎముకలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా రాజ్మా అడ్డుకుంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాజ్మాతో కేవలం కూర, పులావ్ మాత్రమే కాదు రోటీలను కూడా చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి రాజ్మా చాలా సహాయపడుతుంది. వీటిలో ప్రొటీన్ అధికంగా ఉంటాయి. కాబట్టి డైటింగ్ చేయాలనుకునేవారు ఆహారంలో భాగం వీటిని చేసుకోవాలి. ఇది తిన్నాక ఎక్కువ సేపు పొట్ట నిండినట్టు ఉంటుంది. కాబట్టి ఆకలి వేయకుండా ఉంటుంది. పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావు. వీటిని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. డయాబెటిక్ రోగులు వీటిని తినవచ్చు. వారంలో రెండు మూడు సార్లు రాజ్మాను తినడం చాలా అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇది ముందుంటుంది.
టాపిక్