Puri Rath Yatra Recipes । పూరీ జగన్నాథ రథయాత్రలో వండే సాంప్రదాయ వంటకాల రెసిపీలు ఇవిగో!
20 June 2023, 12:53 IST
- Puri Rath Yatra Recipes: పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. రథయాత్రలో వండేటువంటి కొన్ని వంటకాల రెసిపీలను ఇక్కడ అందిస్తున్నాము.
Puri Rath Yatra traditional Recipes
Puri Rath Yatra Recipes: జగన్నాథ రథ చక్రాలు కదిలాయ్. పూరీ జగన్నాథ రథయాత్ర అనేది ఒడిశాలో రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన పూరిలో జరిగే ప్రసిద్ధ హిందూ పండగ. ఈ సమయంలో శ్రీకృష్ణుడి అవతారమైన జగన్నాథ పరమాత్ముడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి తన అత్తవారింటికి రాకను సూచిస్తుంది. ఈ నేపథ్యంలో వీరి రాకను పురస్కరించుకొని పెద్ద జాతరగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఇది జూన్ 20న ప్రారంభమైంది. రథయాత్రలో భాగంగా జగన్నాథుడికి ఇష్టమైన అనేక సాంప్రదాయ వంటకాలు తయారు చేస్తారు, ఆపై వాటిని భక్తులకు ప్రసాదంగా పంచుతారు.
జగన్నాథ రథయాత్రలో వండేటువంటి కొన్ని వంటకాల రెసిపీలను ఇక్కడ అందిస్తున్నాము. ఇవి రుచికరమైనవే కాకుండా ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచివి కూడా. మరి ఆ రెసిపీలు ఏమిటో మీరూ చూసేయండి.
Santula Mixed Vegetable Curry Recipe
- 2 బంగాళదుంపలు
- 1 వంకాయ
- 250 గ్రాములు ఎర్ర గుమ్మడికాయ
- 100 గ్రాములు బీన్స్
- 100 గ్రాములు క్యారెట్లు
- 2 మునగకాయలు
- 100 గ్రాములు పొట్లకాయ
- 1 టేబుల్ స్పూన్ - పాంచ్ ఫోరాన్ (ఐదు మసాలాలు)
- 2 టేబుల్ స్పూన్లు - ఆవాల నూనె
- 2-3 పచ్చిమిర్చి
- 1 టేబుల్ స్పూన్ చక్కెర
- రుచికి ఉప్పు
సంతులా ఎలా తయారు చేయాలి
- ముందుగా కూరగాయలను అన్నింటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి.
- ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో నూనె వేడి చేయండి. అందులో జీలకర్ర, సోంపు, మెంతులు మొదలైన ఐదు మసాలా దినుసులు కలిసిన పంచ్ ఫోరాన్ వేసి వేయించండి.
- అనంతరం తరిగిన కూరగాయలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి, ఆపై మూతపెట్టి తక్కువ వేడి మీద 10-12 నిమిషాలు ఉడికించాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. నీరు కలపవద్దు.
- ఇప్పుడు పంచదార వేసి బాగా కలపాలి, కూరను మెత్తగా మందంగా స్థిరత్వం వచ్చేవరకు ఉడికించాలి.
అంతే, సంతులా రెడీ. వేడి వేడి అన్నం లేదా చపాతీలతో సర్వ్ చేసుకోవాలి.
Dalma Recipe
- ఎర్ర పప్పు - 200 గ్రా
- వంకాయ - 1
- పొట్లకాయ - 2
- టమోటా - 1
- అల్లం - ½ ముక్క
- మసాలా పొడి - 1 టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- తురిమిన కొబ్బరి - 3-4 టేబుల్ స్పూన్లు
- ఎండు మిర్చి - 3-4
- నూనె లేదా నెయ్యి - 1 టేబుల్ స్పూన్
- బంగాళదుంప - 1 మీడియం
- బీరకాయ - 1 మీడియం
- గుమ్మడికాయ - 6-8 చిన్న ముక్కలు
- ఉల్లిపాయ - 1
- కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్
- బిరియాని ఆకులు - 2
- పసుపు పొడి అర టీస్పూన్
- ఇంగువ - చిటికెడు
దాల్మా తయారీ విధానం
1. ముందుగా కూరగాయలను కడిగి చిన్న సైజులో కట్ చేసుకోండి.
2. ప్రెజర్ కుక్కర్‌లో పప్పును వేసి, 2 కప్పుల నీరు, పసుపు పొడి, ఉప్పు, బిరియానీ ఆకులు వేసి మామూలుగా ఉడికించాలి. అతిగా ఉడకకుండా ఉండటానికి 2 విజిల్స్ తర్వాత మంట ఆఫ్ చేయండి.
3. ఇప్పుడు కుక్కర్‌లో ఆవిరి వెళ్లిపోయాక మూత తీసి, టమోటాలు మినహా మిగతా కూరగాయలను వేయండి.
4. ఆపి ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేసి మరో 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. నీరు సరిపోకపోతే ముందుగానే పోసుకోండి.
5. నూనె వేడి చేసి అల్లం తురుము, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి, ఆపై టొమాటో ముక్కలు కూడా వేసి వేయించాలి.
6. తర్వాత కొబ్బరి వేసి, పొడి మసాలాలు చల్లి బాగా కలపాలి.
7. చివరగా, ఒక చెంచా నెయ్యి వేసి, కొత్తిమీర చల్లి గార్నిష్ చేయండి.
అంతే, రుచికరమైన దాల్మా రెడీ.
Tanka Torani Recipe
- 1 కప్పు అన్నం
- 3 టేబుల్ స్పూన్లు పెరుగు
- 1 అంగుళం మామిడి అల్లం
- 7-8 నిమ్మ ఆకులు
- 2 రెమ్మల కరివేపాకు
- 4-5 రెమ్మల తాజా కొత్తిమీర
- 4 పచ్చి మిరపకాయలు
- 8-10 నిమ్మకాయ ముక్కలు
- 1/2 నిమ్మకాయ
- 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి
- అవసరమైనంత ఉప్పు
- అవసరమైనంత నీరు
టంకా తోరణి తయారీ విధానం
- ముందుగా ఒక లోతైన గిన్నెలో అన్నం తీసుకొని అందులో సరిపడా నీరు పోసి బాగా కలపాలి. ఆపై మూతపెట్టి సుమారు 1-2 రోజులు లేదా కనీసం 18-20 గంటలు పులియబెట్టాలి.
- పులియబెట్టడం పూర్తయిన తర్వాత అన్నాన్ని వడకట్టి, నీళ్లు మరో గిన్నెలోకి తీసుకోండి. ఈ నీటినే తోరణి అంటారు.
- ఇప్పుడు ఏదైనా మాషర్‌ని ఉపయోగించి అన్నంను బాగా రుబ్బండి. అందులోనే గిలక్కొట్టిన పెరుగు, తోరణి (వడకట్టిన నీరు) వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు మామిడి అల్లం, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు తీసుకొని రైస్ బౌల్‌లో వేయాలి.
- ఆ తరువాత సగం నిమ్మకాయను పిండి వేయండి, మిగతా నిమ్మకాయ ముక్కలు, నిమ్మ ఆకులు, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు కూడా వేసి బాగా కలపండి. ఈ పానీయంలో నిమ్మకాయలు, నిమ్మ ఆకులు తప్పనిసరిగా వేస్తారు. అప్పుటే ఇది కిక్కిచ్చే పుల్లని రుచిని కలిగి ఉంటుంది.
- పానీయం స్థిరత్వం వచ్చేంత వరకు అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి బాగా కలపండి.
అంతే, టంకా తోరణి రెడీ.