తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ప్రపంచంలో సూర్యుడు అస్తమించని ప్రాంతాలేవో తెలుసా?

ప్రపంచంలో సూర్యుడు అస్తమించని ప్రాంతాలేవో తెలుసా?

28 February 2022, 16:34 IST

google News
    • ప్రపంచంలోని చాలా దేశాల్లో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. కొన్ని దేశాల్లో పగటి సమయం ఎక్కువుంటే.. మరికొన్నింటిలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో అసలు సూర్యుడు అస్తమించడంటే నమ్మగలరా?
సూర్యాస్తమయం
సూర్యాస్తమయం (AFP)

సూర్యాస్తమయం

జీవరాశి మనుగడకు మూలాధారం సూర్యుడు. భూమిపై నివసించే సమస్త ప్రాణ కోటి సూర్యరశ్మి ఆధారంగానే జీవిస్తోంది. సూర్యోదయం, సూర్యాస్తమయం వల్లే మనకు పగలు, రాత్రి తేడా తెలుస్తోంది. అలాంటిది భూమిపై అసలు సూర్యుడు అస్తమించని ప్రాంతాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

నార్వే

ఆర్కిటిక్ సర్కిల్‌లో ఉన్న నార్వే దేశాన్ని “ల్యాండ్ ఆఫ్ ది మిడ్‌నైట్ సన్‌”గా పిలుస్తారు. ఇక్కడ మే నుండి జులై చివరి వరకు సూర్యుడు అసలు అస్తమించడు. అంటే దాదాపు 76 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. నార్వేలోని స్వాల్‌బార్డ్‌ ప్రాంతంలో ఏప్రిల్ 10 నుండి ఆగస్టు 23 వరకు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తాడు. ఇది యూరప్‌లోని ఉత్తర భాగంలో ఉన్న మంచి టూరిస్ట్ స్పాట్. అనేక ప్రకృతి సోయగాలతో ఈ ప్రాంతం భూతల స్వర్గంలా కనిపిస్తుంది. 

నునావట్ (Nunavut) కెనడా

నునావట్ కెనడాలోని వాయవ్య భూభాగంలో ఆర్కిటిక్ సర్కిల్‌కు దాదాపు రెండు డిగ్రీల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశం దాదాపు రెండు నెలల పాటు 24X7 సూర్యకాంతిలోనే ఉంటుంది. అయితే శీతాకాలంలో మాత్రం ఈ ప్రదేశం దాదాపు 30 రోజుల పాటు మొత్తం చీకటిలోనే ఉంటుంది. మంచు పర్వాతాలతో కూడిన ఈ ప్రాంతం సుందరమైన దృశ్యాలకు వేదిక. 

ఐస్‌లాండ్

ఐస్‌లాండ్.. గ్రేట్ బ్రిటన్ తర్వాత యూరప్‌లో అతిపెద్ద ద్వీపం. దోమలు లేని దేశంగా కూడా ప్రసిద్ధి చెందింది. అర్ధరాత్రి ప్రకాశవంతమైన సూర్యుడిని చూడటానికి మీరు ఆర్కిటిక్ సర్కిల్‌లోని అకురేరి, గ్రిమ్సే ద్వీపాన్ని సందర్శించవచ్చు. అనేక ప్రకృతి సోయగాలతో పర్యాటకులను ఈ ప్రాంతం విశేషంగా ఆకట్టుకుంటోంది.

బారో, అలస్కా

మే చివరి నుండి జులై చివరి వరకు ఇక్కడ సూర్యుడు అస్తమించడు. ఇక్కడ నవంబర్ ప్రారంభం నుండి మే చివరి వరకు మాత్రం రాత్రి ఉంటుంది. మంచు పర్వతాలు, మంత్ర ముగ్దులను చేసే హిమనీనదాలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశాన్ని వేసవిలో లేదా శీతాకాలంలో సందర్శించవచ్చు.

ఫిన్లాండ్

వేలాది సరస్సులు, ద్వీపాలతో కూడిన ఫిన్లాండ్‌లోని చాలా ప్రాంతాల్లో వేసవిలో 73 రోజుల పాటు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. అయితే, శీతాకాలంలో మాత్రం ఈ ప్రాంతంలో సూర్యరశ్మి ఉండదు. దీంతో ఇక్కడి ప్రజలు వేసవిలో తక్కువ నిద్రపోవడానికి, శీతాకాలంలో ఎక్కువ నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. పర్యాటక ప్రాంతమైన నార్తర్న్ లైట్లను టూరిస్ట్‌‌లు అమితంగా ఆస్వాదిస్తారు.

స్వీడన్

మే ప్రారంభం నుండి ఆగస్టు చివరి వరకు స్వీడన్ దేశంలో అర్ధరాత్రి సూర్యుడు అస్తమించినా మళ్లీ ఉదయం 4 గంటలకే ఉదయిస్తాడు. ఇక్కడ స్థిరమైన సూర్యరశ్మి కాలం ఏడాదిలో ఆరు నెలల వరకు ఉంటుంది. యూరప్‌లో మంచి పర్యాటక ప్రాంతమైన స్వీడన్ లో అడ్వెంచర్ గేమ్స్‌, గోల్ఫ్, చేపలు పట్టడం, ట్రెక్కింగ్ ట్రయల్స్‌తో సరదాగా గడపవచ్చు.

తదుపరి వ్యాసం