తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Jalebi: పన్నీర్ జిలేబి ఇష్టమా? దీన్ని ప్రతిసారీ కొనక్కర్లేదు, ఇంట్లోనే నేయితో ఇలా చేయొచ్చు, ఇదిగో రెసిపి

Paneer Jalebi: పన్నీర్ జిలేబి ఇష్టమా? దీన్ని ప్రతిసారీ కొనక్కర్లేదు, ఇంట్లోనే నేయితో ఇలా చేయొచ్చు, ఇదిగో రెసిపి

Haritha Chappa HT Telugu

14 February 2024, 15:30 IST

google News
    • Paneer Jalebi: పనీర్ జిలేబి పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇక వాటిని చూస్తే తినకుండా ఆగలేం. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. పన్నీర్ జిలేబి రెసిపీ ఇక్కడ ఇస్తున్నాం.
పనీర్ జిలేబి రెసిపీ
పనీర్ జిలేబి రెసిపీ (youtube)

పనీర్ జిలేబి రెసిపీ

Paneer Jalebi: పన్నీర్ జిలేబి చూడడానికి జిలేబి లాగే ఉన్నా దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. దీనిలో ఎక్కువ శాతం పనీర్, నెయ్యి ఉంటుంది. కాబట్టి రుచి బాగుంటుంది. ఈ పనీర్ జిలేబి తినడం వల్ల ప్రోటీన్ కూడా పుష్కలంగా అందుతుంది. ఈ పనీర్ జిలేబిని ప్రతిసారి కొనాల్సిన అవసరం లేదు. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. పండగల సమయంలో, పుట్టినరోజులు సమయంలో అతిథులకు వడ్డించేందుకు ఉత్తమ స్వీట్ ఈ పనీర్ జిలేబి. పనీర్ జిలేబి రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

పనీర్ జిలేబి రెసిపీకి కావలసిన పదార్థాలు

పనీర్ తురుము - పావు కిలో

గోధుమపిండి - రెండు స్పూన్లు

పంచదార - ఒక కప్పు

కార్న్ పౌడర్ - పావు కప్పు

నెయ్యి - అరకప్పు

బేకింగ్ సోడా - అర స్పూను

పిస్తా, జీడిపప్పులు తరుగు - గుప్పెడు

కుంకుమపువ్వు - రెండు రేకులు

పనీర్ జిలేబి రెసిపీ

1. ఒక గిన్నెలో కార్న్ పౌడర్, గోధుమ పిండి, బేకింగ్ సోడాను వేయండి.

2. కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోండి.

3. ఇది మరీ మందంగా కాకుండా, అలా అని మరీ పల్చగా కాకుండా ఉండేలా చూసుకోండి.

4. ఇప్పుడు ఆ మిశ్రమంలోనే పన్నీర్ తురుమును కూడా వేయండి.

5. ఒకసారి మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని వేసి మెత్తగా రుబ్బండి.

6. అది జిలేబి పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక కవర్లో దీన్ని వేసి మూతిని గట్టిగా కట్టేయండి.

7. కవర్ చివరన చిన్న రంధ్రం పెట్టండి.

8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నెయ్యి వేయండి.

9. నెయ్యి వేడెక్కాక ఆ నెయ్యిలోనే ఈ కవర్‌తో జిలేబి ఆకారంలో పిండిని వేసుకోండి.

10. రెండు వైపులా రంగు మారే వరకు వేయించండి.

11. ఇది వేయిస్తున్నప్పుడే పక్కన మరో గిన్నెలో పంచదార, యాలకుల పొడి, నీళ్లు, కుంకుమపువ్వు వేసి స్టవ్ మీద పెట్టండి.

12. నేతిలో వేయించిన పనీర్ జిలేబిని తీసి ఆ పంచదార పాకంలో వేయండి.

13. పంచదార పాకంలో కాసేపు ఉంచి తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోండి.

14. పైన పిస్తా, జీడిపప్పు తురుమును చల్లుకోండి.

15. అంతే పనీర్ జిలేబి రెడీ అయినట్టే. దీన్ని చాలా సులువుగా చేసేయొచ్చు.

16. దీన్ని తింటూ ఉంటే మరిన్ని తినాలన్న కోరిక పుడుతుంది. అంత టేస్ట్ గా ఉంటుంది.

ఈ స్వీట్లో పనీర్‌ను అధికంగా ఉపయోగించాము. కాబట్టి దీనివల్ల మనకు అంతా మేలే జరుగుతుంది. పనీర్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మనకి అత్యవసరమైనవి. అంతేకాదు పనీర్లో మంచి కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పనీర్ కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కూడా అడ్డుకుంటుంది. ముఖ్యంగా రొమ్ము, పెద్ద పేగు క్యాన్సర్ వంటిని అడ్డుకోవడంలో పనీర్ ముందుంటుంది. ఇక కీళ్ల నొప్పులు వంటి వాటితో బాధపడేవారు పనీర్ తరచూ తినడం అవసరం. పనీర్ తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి బరువు తగ్గవచ్చు. ఇతర ఆహారాలు తినకుండా పనీరు అడ్డుకుంటుంది. ఇక మహిళలు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాలలో పనీరు ఒకటి.

టాపిక్

తదుపరి వ్యాసం