తెలుగు న్యూస్  /  Lifestyle  /  Onion Peel Tea Can Heal Infections, Here Are A Few Benefits

Onion Peel Benefits | ఉల్లిపాయ ఒలిచి పొట్టును పారేయకండి.. టీ చేసుకోని తాగండి!

HT Telugu Desk HT Telugu

27 June 2022, 13:39 IST

    • అందరూ ఉల్లిపాయలను తిని పొట్టును పారేస్తారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆనియన్ పీల్ టీ తాగాలని సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి..
Onions
Onions (Unsplash)

Onions

ఉల్లిపాయలను మనం సాధారణంగా ప్రతి వంటల్లోనూ ఉపయోగిస్తాం, సలాడ్లలో ఉపయోగిస్తాం, కొందరు పచ్చిగా కూడా తినేస్తారు. ఉల్లితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే పురాతన సామెత ఇప్పటికీ ప్రచారంలో ఉంటుంది. ఉల్లి గురించి ఇదంతా తెలిసిందే. అయితే మీకు తెలియని విషయం ఏమిటంటే అందరూ ఉల్లిపాయ లోపలి భాగాన్ని వాడుకుంటారు, కానీ పైన పొట్టును మాత్రం ఒలిచి చెత్తలో పారేస్తారు. కానీ ఆ పొట్టులో కూడా ఎన్నో గొప్ప పోషకాలు ఉంటాయట. ఉల్లిపొట్టుతో లభించే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకపై ఆ పొట్టును పారేయలేరు అని చెబుతున్నారు. ఉల్లిపొట్టును చాయ్ కాచుకొని తాగితే ఈ ప్రయోజనాలు దక్కుతాయని చెబుతున్నారు.

జూన్ 27న ఉల్లిగడ్డ దినోత్సవం (Onion Day)గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉల్లి పైపొరలతో చాయ్ ఎలా చేసుకోవాలి, ఆ టీ తాగితే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.

ఉల్లి పొట్టు చాయ్ ఎలా తయారు చేయాలి:

చాలా చాలా సింపుల్. మీరు ఉల్లిపాయలను ఒలిచిన తర్వాత, ఆ పొట్టు ఏదైతే ఉంటుందో దానిని నీటిలో వేసి ఆ నీటిని కొన్న నిమిషాల పాటు మరిగించండి. ఇప్పుడు నీరు వేరే రంగులోకి మారుతుంది. ఇదే ఆనియన్ పీల్ టీ. ఈ టీని వడకట్టి వేడివేడిగా త్రాగాలి. మీకు ఈ కింద పేర్కొన్న ప్రయోజనాలు కలుగుతాయి.

గుండె ఆరోగ్యానికి

ఉల్లిపాయ పొట్టులో ఉండే ఫ్లేవనాయిడ్లు గుండె ఆరోగ్యానికి మంచివిగా చెబుతారు. ఉల్లిపాయ పొట్టుతో చేసిన టీలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఈ టీ తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఊబకాయం తగ్గుతుంది

మీరు బరువు తగ్గించుకోవాలనుకుంటే.. ఆనియన్ పీల్ టీ తాగుతూ ఉండండి. ఇది ఒక హెర్బల్ టీ లాగా పనిచేస్తుంది. శరీరంలోని కేలరీలు కరుగుతాయి. క్రమంగా బరువు తగ్గుతారు.

ఇన్ఫెక్షన్ల నివారణి

ఉల్లిపాయ పొట్టులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఆనియన్ పీల్ టీని తీసుకోవచ్చు. ఉల్లి పొట్టులో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి, కాబట్టి మీరు చర్మంపై దురద లేదా దద్దుర్లు ఏర్పడినపుడు ఈ హీలింగ్ డ్రింక్‌ని తీసుకుంటే ఫలితం ఉంటుంది.

రోగనిరోధక శక్తి

ఉల్లిపాయ పొట్టులో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఆనియన్ పీల్ టీ ఒక డీటాక్స్ డ్రింక్ లాగా పనిచేస్తుంది. దీంతో శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి.

చర్మ ఆరోగ్యం

ఉల్లిపొట్టులో ఉండే డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్స్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కడుపును శుద్ధి చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ రకంగా మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

టాపిక్