Eating Rules | ఆహారం తినే విషయంలో ఆయుర్వేదంలో చెప్పిన నియమాలు!
10 August 2022, 15:01 IST
- ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా ఆహారం తినేయడం మంచిది కాదు. ఆహారం తినటానికి కూడా ఆయుర్వేదంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నియమాలు పాటించాలి.
Food Eating Rules
జీవించటానికి ఆహారం తీసుకోవటం తప్పనిసరి, అయితే ఆరోగ్యంగా జీవించాలంటే మాత్రం సరైన మోతాదులో సమతుల ఆహారం తీసుకోవాలి. ప్రపంచంలోని పురాతన వైద్య విధానాలలో ఒకటైన ఆయుర్వేదం ప్రకారం తినే ఆహారం కూడా ఒక ఔషధమే. వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడాలన్నా, ప్రజల జీవన నాణ్యత వృద్ధి చెందాలన్నా పోషకాహారమే మూలం. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలంటే ముందుగా ఆహారం కూడా ఆరోగ్యకరమైనది అయి ఉండాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? రోజులో ఎంత పరిమాణంలో ఆహారం తీసుకోవాలి. తినటానికి ఉత్తమ సమయం ఏమిటి? ఇలా అనేక అంశాలపై ఆయుర్వేదంలో వివరణ ఉంది.
ఇటీవల కాలంలో అనేకమంది వారు తినే ఆహారం కారణంగానే జబ్బుపడుతున్నారు. అయితే నియమాల ప్రకారం తింటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆయుర్వేద- వేదామృత్ వ్యవస్థాపకురాలు డాక్టర్ వైశాలి హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయుర్వేదం ప్రకారం అనుసరించాల్సిన 6 ఆహార నియమాలను సూచించారు. అవేంటో తెలుసుకోండి.
ఆయుర్వేద ఆహార నియమాలు
తినే ఆహారం విషయంలో ఈ కింది నియమాలను తప్పకుండా పాటించాలి.
నియమం 1- కడుపు నిండుగా వద్దు
ఎంత ఆకలి వేసినా కడుపు నిండుగా ఎప్పుడూ తినవద్దు. మీ ఆకలిలో 70 మరియు 80 శాతం శాతం మధ్య తినాలి. కడుపులో కొంత ఖాళీ అనేది ఉండాలి. భోజనం బాగా కలపడానికి, జీర్ణం కావడానికి కొంత ఖాళీ ఉంచుకోవాలి. కడుపు ఆహారంతో 70% నిండి ఉండాలి, మిగతా 30% ఖాళీగా ఉండాలి. ఈ 70-30 నియమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండండి.
నియమం 2- మధ్యాహ్నం ఎక్కువ తినాలి
మానవ శరీరం అలాగే కడుపులో జీర్ణ అగ్ని అనేది సూర్యుని కదలికను అనుకరిస్తుంది కాబట్టి మీరు మధ్యాహ్న భోజనంలో బాగా తినాలి. రోజు మొత్తంలో మధ్యాహ్న భోజనంలో మాత్రమే ఎక్కువ మొత్తంలో తినవచ్చు.
నియమం 3- రాత్రికి విందు వద్దు
అర్థరాత్రి విందులు అసలే వద్దు. మన శరీరం రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు మన జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఈ సమయంలో ఎక్కువ మొత్తంలో కేలరీలు కొవ్వుగా పేరుకుపోతుంది. అందువల్ల, పడుకునే ముందు తినడం మానుకోండి. మీరు నిద్రకు ఉపక్రమించే 2-3 గంటల ముందే మీ రాత్రి భోజనం పూర్తి చేసుకోవాలి.
నియమం 4- ఆహారాన్ని మళ్లీ వేడిచేయవద్దు
ఆయుర్వేదం ప్రకారం మీ ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం మంచిది కాదు. పగటిపూట వండిన ఆహారం రాత్రికి అలాగే తినవచ్చు. కానీ ఫ్రిజ్ లో పెట్టి మళ్లీ బయటకు తీసి, మళ్లీ వేడి చేసి తినటం ఆరోగ్యానికి మంచిది కాదు. వీలైనంత వరకు తాజాగా వండిన ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
నియమం 5 - ఉపవాసం మంచిదే
మీరు తరచుగా అజీర్ణం సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఉపవాసం ఉండటం మంచిది. మీరు ఇంతకు ముందు తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం కాలేదని భావించినపుడు, ఇప్పటికీ అదే బర్ప్స్ వస్తున్నాయని మీరు భావిస్తే, ఆ పూట భోజనం మానేసి, ఎండు అల్లం కలిపిన గోరువెచ్చని నీరు త్రాగండి.