Jewellery storage tips: ఇమిటేషన్ జ్యువెలరీ ఇలా భద్రపరిస్తే.. ఎన్నేళ్లయినా రంగు మారవు..
20 June 2023, 19:23 IST
Jewellery storage tips: ఇమిటేషన్ జ్యువెల్లరీ రంగు చెదరకుండా ఎక్కువ రోజులు అదే మెరుపుతో ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తెలుసుకోండి.
ఇమిటేషన్ జ్యువెలరీ
బంగారం ధర పెరగడం వల్లనో, లేదంటే ట్రెండ్‌కి తగ్గట్లు స్టైలిష్ గా ఉండాలనో చాలా మంది వన్ గ్రామ్ గోల్డ్ లేదా ఇమిటేషన్ జ్వెలరీ మీద మక్కువ చూపిస్తున్నారు. వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి వాటిని కొనుగోలు చేస్తున్నారు. బంగారం అయితే ఒకే నగ సంవత్సరాల పాటూ వేసుకోవాలి. ఈ నగలైతే కొన్ని రోజులు వేసుకోగానే వేరేది మార్చేయొచ్చు. ప్రతి వేడుకకి ప్రత్యేకంగా కనిపించొచ్చు.
ఇదివరకటిలా వీటి ధర వందల్లో ఉండట్లేదు.కొన్ని వేలల్లో ఉంటోది. బోలెడు ఖర్చుపెట్టి కొనుక్కున్న ఈ నగలు రంగుపోతే వృధాయే. అందుకే ఈ నగలు ఎక్కువకాలం మన్నేలా, రంగు చెక్కు చెదరకుండా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు తెలుసుకుంటే చాలు.
1. దూదితో చుట్టడం:
నగలు వాడిన తరువాత వాటిని నేరుగా కాకుండా దూదితో చుట్టి పెడితే తేమ తగలకుండా ఎక్కువ రోజులు నాణ్యంగా ఉంటాయి. ఫంక్షన్లు, వేడుకలకి నగలు పెట్టుకుని తీసేశాక ఒకసారి పొడి వస్త్రంతో తుడిచి, గాలి తగిలేలా కాసేపు వదిలేయాలి. ఆ తరువాత దూది చుట్టేసి, గాలి చొరని డబ్బాలో భద్రపరచండి.
2. ఒకే డబ్బాలో వేయకండి:
జర్మన్ సిల్వర్ నగలు, స్టోన్స్ ఉన్న నగలు, మ్యాట్ ఫినిష్ ఉన్న నగలు, కుందన్స్ ఉన్నవి.. ఇలా చాలా రకాలుంటాయి. వాటన్నింటినీ ఒకే డబ్బాలో కలిపి పెట్టకూడదు. ఒక దాని వల్ల మరో దానికి గీతలు పడతాయి. రంగు మారతాయి. వివిధ జ్వెలరీ ఆర్గనైజర్లు వాడి ఒక్కో నగ ఒక్కో దాంట్లో పెట్టుకోవచ్చు.
3. ముందే వేసుకోవద్దు:
నగలు ముందే వేసుకుని మేకప్ వేసుకోకూడదు. పర్ఫ్యూమ్, సెట్టింగ్ స్ప్రే కూడా నగలు వేసుకున్నాక వాడకూడదు. అలంకరణ పూర్తయ్యాకే చివరగా నగలు వేసుకోవాలి.అలాగే వేడి నీళ్లు కూడా నగలకు తాగకుండా జాగ్రత్తపడాలి.
4. జిప్ లాక్ బ్యాగులు:
నగల్ని గాలి చొరని ప్లాస్టిక్ డబ్బాల్లో, ఆర్గనైజర్లలో లేదా జిప్ లాక్ బ్యాగుల్లో భద్రపరచాలి. లేదంటే వెల్వెట్ లేదా కాటన్ వస్త్రంతో లైనింగ్ ఉన్న జ్యువెలరీ బాక్సుల్లో పెట్టుకోవచ్చు. లేదంటే మృదువైన కాటన్ వస్త్రంతో జ్యువెలరీని చుట్టేసి భద్రపరచొచ్చు.
టాపిక్