wedding gold purchase: 20 తులాల బంగారంలో ఏ పెళ్లి నగలు కొనొచ్చు?-tips and tricks in purchasing gold jewellery for marriage ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tips And Tricks In Purchasing Gold Jewellery For Marriage

wedding gold purchase: 20 తులాల బంగారంలో ఏ పెళ్లి నగలు కొనొచ్చు?

Koutik Pranaya Sree HT Telugu
May 13, 2023 08:04 AM IST

wedding gold purchase: పెళ్లిళ్లకు అనుకున్న బంగారంలో ఏమేం నగలు చేయించుకోవాలన్న సందేహం ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే బంగారు నగలు కొనుక్కోవడం సులువవుతుంది.

పెళ్లి నగలు
పెళ్లి నగలు (pexels)

మీ పెళ్లికి మీరు ఒక 20 తులాల్లో బంగారు నగలు చేయించుకోవాలనుకుంటే.. ముఖ్యమైన, మీ దగ్గర తప్పకుండా ఉండాల్సిన కొన్ని నగలేంటో గుర్తుంచుకోండి. తులం అంటే 10 గ్రాముల బంగారం. ఇరవై లేదా ఆపైనా బంగారం బరువులో కొనాలనుకున్నా కూడా మీకు బంగారాన్ని ఎలా విభజించుకోవాలో కొన్ని చిట్కాలు తెలుసుకోండి.

మంగళ సూత్రం(mop chain ) :

మీకు లావుగా ఇష్టమనుకుంటే కనీసం 4 నుంచి నాలుగున్నర తులాల్లో మంగళ సూత్రం చెయిన్ వచ్చేస్తుంది. లేదూ.. కాస్త సన్నగా ఉన్నదే కావాలనుకుంటే 3 తులాల్లో మంచి మోడల్స్ లో చేయించుకోవచ్చు. ఒక పక్కన పెండెంట్ ఉన్నవి, పూసలతో ఉన్నవి, స్టోన్స్‌తో ఉన్నవి ఇలా చాలా రకాలున్నాయి. మీరు సరిగ్గా వాడుకోగలరన్న నమ్మకం ఉంటే స్టోన్స్ ఉన్నవి తీసుకోండి, లేదు ఇప్పుడే కొత్త కదా ఇబ్బంది అవుతుంది అనుకుంటే.. పూర్తిగా బంగారంతో మాత్రమే చేసిన సైడ్ పెండెంట్ మంగళ సూత్రం మాత్రమే ఎంపిక చేసుకోండి.

బంగారు నగలు
బంగారు నగలు (pexels)

చోకర్ (choker):

4 తులాలు అయిపోయింది. ఇంకొక మూడు తులాల్లొ చోకర్ (choker) వచ్చేస్తుంది. సాధారణంగా చోకర్లకి వెనకాల చెయిన్ కన్నా ముందు పెండెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మీరు చోకర్ కోసం వెనకాల బంగారం గొలుసు తీసుకోకుండా, తాడు లాంటిది ఎంపిక చేసుకోండి. పొడవు మార్చుకోవడం సులువవ్వడంతో పాటే.. బంగారం బరువు కూడా మిగులుతుంది. ఇప్పుడు తక్కువ బరువులో వచ్చే నక్షి పనితనం ఉన్న చోకర్, యాంటిక్ లుక్ ఉన్నవి, కెంపులున్న చోకర్ లు, కంటె లాంటి చోకర్ లు చాలా ట్రెండింగ్.

నల్ల పూసలు(black beads chain):

ఎక్కువగా డ్రెస్సులు, కుర్తాలు వేసుకునే వాళ్లకి ఒక చిన్న నల్లపూసల దండ (black beads chain) తప్పనిసరి. కుర్తాల్లో మంగళ సూత్రం కన్నా, నల్ల పూసలతో మంచి లుక్ ఉంటుంది. ఆఫీసుకి వెళ్లినపుడు, చిన్న పనులకు బయటికి వెళ్లినపుడు నల్లపూసలు వేసుకోవడమే సౌకర్యం కూడా. నల్లపూసలు 6 లేదా 7 గ్రాముల నుంచి దొరుకుతాయి. వీటిలో బంగారం ఉండేది కేవలం లాకెట్ లో కాబట్టి తక్కువ బరువులోనే వస్తుంది. సీజడ్ స్టోన్ల లాకెట్, మధ్యలో చిన్న ముత్యం వచ్చినవి ఇప్పుడు ట్రెండింగ్. మీరు ఇంకాస్త ఎక్కువ బరువు నగలు చూస్తే నక్షి పని తనం, వజ్రాలు పొదిగిన నల్లపూసలు కూడా ఎంచుకోవచ్చు.

హారం(haram):

లెక్క గుర్తుందా. ఇప్పటికీ అటూ ఇటూగా ఓ 8 తులాలు అయినట్టున్నాయ్. ఎక్కువ బరువుండేది ఈ హారమే. ఇప్పుడు 3 ఇన్ 1 నగలు వస్తున్నాయి. ఒకే హారాన్ని జడకు పెట్టుకునే నగలాగా, వడ్డానం లాగా, పెద్ద హారం లాగా వాడుకోవచ్చు. తప్పకుండా ఇలాంటి మోడల్ లోనే చూడండి. ఇవి 10 నుంచి 12 తులాల వరకుంటాయ్. అలాంటి మల్టీపర్పస్ నగలు వద్దనుకుంటే.. 7 నుంచి 8 తులాల్లో మామూలు హారం వచ్చేస్తుంది. ఎప్పటికీ వన్నెతగ్గని కాసుల హారం, బొట్టు హారం, మామిడి పిందెల హారం.. లాంటివి ఎంచుకోండి. ఇది మళ్లీ మళ్లీ మార్చాల్సిన అవసరం ఉండకుండా ఎన్ని సంవత్సరాలయినా ట్రెండ్‌లోనే ఉంటాయి. లేదంటే సీజడ్ స్టోన్లున్న హారం, అన్ కట్స్ లో కూడా చూడొచ్చు. ఇప్పడు మాత్రం విక్టోరియన్ కలెక్షన్ ట్రెండింగ్ లో ఉంది. వాటిని కూడా ఎంచుకోవచ్చు.

గాజులు(bangles):

ఒక నాలుగు తులాల్లో బంగారు గాజులొచ్చేస్తాయి. గాజుల్లో (bangles) మాత్రం ఎలాంటి స్టోన్లు లేకుండా కేవలం బంగారంతో ఉన్నవే తీసుకుంటే రోజూ వారీ ఉపయోగానికి పనికొస్తాయి. ఎలాగో ఫంక్షన్లకు ఇమిటేషన్ జ్యువెలరీనే ఎక్కువగా వాడతాం. భారీగా ఉండే ఇమిటేషన్ గాజులే వేసుకుంటాం. అందుకే ఇంట్లో వేసుకునే వీలుండేటట్లు ఈ గాజులు ఎంచుకోండి. ఇంకాస్త ఎక్కువ బరువు పెట్టగలిగితే లావుగా ఉండే ఫంక్షన్ వేర్ గాజులు తీసుకోవచ్చు.

ఇంకేమైనా మిగిలితే..

ఒకటి నుంచి రెండు తులాలేమైనా మిగిలితే.. మంచి చెవి జుంకాలు, ఉంగరం తీసుకోవచ్చు. 30 తులాల్లో నగలు చేయించుకుంటే ఈ నగలన్నింటితో పాటూ ఇంకో 10 తులాల్లో వడ్డానం వచ్చేస్తుంది.

WhatsApp channel