Oats Mini Uthappam: ఓట్స్ మినీ ఊతప్పం రెసిపీ, డయాబెటిస్ పేషెంట్ల కోసం ప్రత్యేక బ్రేక్‌ఫాస్ట్
19 April 2024, 6:00 IST
- Oats Mini Uthappam: ఓట్స్ తో టేస్టగా మినీ ఊతప్పం చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్ల కోసం ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.
ఓట్స్ మినీ ఊతప్పం రెసిపీ
Oats Mini Uthappam: బ్రేక్‌ఫాస్ట్ రోజులో తినే ముఖ్యమైన ఆహారం. అది ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు బ్రేక్ ఫాస్ట్‌లో పోషకాలు నిండిన ఆహారాన్ని తినడం చాలా అవసరం. ఇక్కడ మేము ఓట్స్ మినీ ఊతప్పం రెసిపీ ఇచ్చాము. ఇది డయాబెటిస్ పేషెంట్ల కోసమే ప్రత్యేకం. ఒక్కసారి చేసుకున్నారంటే ప్రతిరోజూ తినాలనిపిస్తుంది. వీటిని చేయడం కూడా చాలా సులువు. కొబ్బరి చట్నీతో ఈ ఓట్స్ మినీ ఊతప్పం తింటే నోరూరిపోతుంది.
ఓట్స్ మినీ ఊతప్పం రెసిపీకి కావలసిన పదార్థాలు
వోట్స్ - అరకప్పు
ఉప్మా రవ్వ - ముప్పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి - ఒకటి
క్యారెట్ తురుము - అరకప్పు
పనీర్ - పావు కప్పు
క్యాప్సికం - పావు కప్పు
పుల్లని పెరుగు - నాలుగు స్పూన్లు
మిరియాల పొడి - చిటికెడు
వోట్స్ మినీ ఊతప్పం రెసిపీ
1. ముందుగా వోట్స్ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆ వోట్స్ పౌడర్ వేయాలి.
3. అందులోనే ఉప్మా రవ్వ లేదా ఇడ్లీ రవ్వను వేసి బాగా కలుపుకోవాలి.
4. కాస్త నీళ్లతో పాటు పుల్లని పెరుగును జోడించి గిల కొట్టాలి.
5. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టేయాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి.
7. నూనె వేడెక్కాక పిండిని ఒకే చోట మందంగా వేసుకోవాలి.
8. ఊతప్పంలా వేసుకున్నాక పైన క్యారెట్ తురుము, పనీర్ తురుము, పచ్చిమిర్చి తురుము, క్యాప్సికం తురుము వేసి కాసేపు ఉంచాలి.
9. దాని పైన మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి.
10. అది ఒకవైపు బంగారు గోధుమ రంగులోకి మారుతుంది.
11. అప్పుడు దాని రెండో వైపున కూడా తిప్పండి. రెండువైపులా బంగారు గోధుమ రంగులోకి మారాక ఒక ప్లేట్లో వేసి కొబ్బరి చట్నీ తో లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
డయాబెటిస్ పేషెంట్లు మాత్రమే కాదు, ఎవరికైనా ఇది నచ్చుతుంది. ఒక్కసారి తిని చూడండి పిల్లలకు కూడా బ్రేక్ ఫాస్ట్ లో దీన్ని పెడితే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. ముఖ్యంగా ఊబకాయంతో బాధపడుతున్న పిల్లలకి ఇలా ఓట్స్ తో చేసిన ఆహారాలను తినిపిస్తే వారు బరువు పెరగకుండా ఉంటారు.