తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alternatives For Toothpaste | టూత్‌పేస్ట్‌ లేకపోయినా వీటితో పళ్లు తోముకోవచ్చు!

Alternatives for Toothpaste | టూత్‌పేస్ట్‌ లేకపోయినా వీటితో పళ్లు తోముకోవచ్చు!

HT Telugu Desk HT Telugu

12 June 2022, 6:49 IST

google News
    • టూత్‌పేస్ట్‌లు, దంత మంజన్ లేకపోయినా దంతాలను శుభ్రపరుచుకునేందుకు అనేక రకాల ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అందులో కొన్ని ఇక్కడ తెలుసుకోండి..
Brushing Teeth
Brushing Teeth (Unsplash)

Brushing Teeth

ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేయటానికి టూత్ పేస్టును ఉపయోగిస్తారు. మరికొంత మంది దంత మంజన్, పళ్ల పొడులను ఉపయోగిస్తారు. ఈ మధ్య పాశ్చాత్య దేశాలలో సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ కొనసాగుతోంది. అదేంటంటే దంతాలను సాంప్రదాయమైన టూత్ పేస్ట్ వాడకుండా ఇతర ఏవైనా పదార్థాలతో శుభ్రం చేసుకోవడం. ఈ రకంగా సోషల్ మీడియాలో అనేక మంది అనేక రకాలుగా వివిధ పదార్థాలను ఉపయోగించి బ్రష్ చేస్తున్నారు.  బ్రష్- పేస్టుతో దంతాలపై జరిగే రాపిడిని తగ్గించుకోవడం కోసం ఈ ట్రెండ్ మొదలైంది.  నిజానికి ఇందులో చాలామటుకు మన ఇండియాలో ఎప్పట్నుంచో ఉన్నవే. ఇప్పుడంటే టూత్ పేస్టులు ఉపయోగిస్తున్నాం కానీ నిన్నటి తరం వారు బొగ్గు, వేపపుల్ల, పిడకలు, ఉప్పు మొదలగు వాటితో పళ్లు తోముకునేవారు.

మరి ఈ పేస్టుకు ప్రత్యామ్నాయంగా వేటితో దంతాలు శుభ్రపరుచుకోవచ్చో, ఇక్కడ చూడండి.

1. బేకింగ్ సోడా

దంతాలను క్లీన్ చేసుకునేందుకు టూత్‌పేస్ట్‌కు బదులుగా అత్యధిక మంది ఎంచుకున్న ప్రత్యామ్నాయం - బేకింగ్ సోడా దీనినే సోడియం బైకార్బోనేట్‌ కూడా అంటారు. ఇది సాధారణంగా అందరి ఇళ్లల్లో వంటగదిలో ఉండేదే. ధరకూడా చాలా తక్కువ. బేకింగ్ సోడాతో దంతాలు శుభ్రం చేసుకుంటే ఇది దంత ఫలకాన్ని తొలగిస్తుంది. హానికర బాక్టీరియాలను, క్రిములను తొలగిస్తుంది. అంతేకాకుండా దంతాలను కూడా తెల్లగా చేస్తుంది. కానీ ఇందులో ఫ్లోరైడ్ లేకపోవడం వలన కావిటీస్ ఏర్పడవచ్చు. అలాగే రుచికి అంతగా బాగుండదు.

2. కొబ్బరి నూనె

మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం ఆయిల్ పుల్లింగ్ గురించి. ఇది అదే! ఆయిల్ పుల్లింగ్ ద్వారా నోటిని శుభ్రపరుచుకోవడం భారతదేశంలో వేల సంవత్సరాల నాటి నుంచే ఉంది. కొబ్బరి నూనె మౌత్‌వాష్ లాగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్‌ శుద్ధమైన కొబ్బరినూనెను తీసుకొని, ఒక టీస్పూన్‌ను 15 నిమిషాల పాటు నోటిలో స్విష్ చేయండి (పుకిలించండి). అనంతరం ఉమ్మివేయండి. మీ దంతాలు తెల్లగా మారతాయి, మీ నోరు శుభ్రమవుతుంది.

3. సముద్రపు ఉప్పు

మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పు ఉందా అంటూ ఇటీవల కాలంలో కొన్ని ప్రకటనలు హడావుడి చేశాయి. టూత్‌పేస్ట్‌లో ఉప్పు లేకపోయినా, మన వంటగదిలో ఉన్న ఉప్పుతోనూ దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. సముద్రపు ఉప్పు (Sea Salt) ఉపయోగిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఉప్పు మీ నోటిలో pHని పెంచుతుంది, దీంతో నోటిలోని క్రిములు, బ్యాక్టీరియా పూర్తిగా నాశనం అవుతుంది. తద్వారా నోరు శుభ్రమవుతుంది. అయితే ఉప్పును కొద్ది పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలి. మోతాదు మించితే అది మీ మీ దంతాలపై ఉండే ఎనామిల్‌ను కోతకు గురిచేస్తుంది.

4. సబ్బు

ఏమండోయ్ ఇది విన్నారా? టూత్‌పేస్ట్‌, దంత మంజన్ మాత్రమే కాదు. సబ్బుతో కూడా దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. అయితే ఏదో ఒక సబ్బు కాదు, దంతాల కోసం ప్రత్యేకమైన 'టూత్ సోప్' అనేది ఉంటుంది. ఇది చాలా మందికి సుపరిచితం కాకపోవచ్చు. కానీ మీరు ఏదైనా పెద్ద హైపర్ మార్కెట్లో లేదా ఆన్‌లైన్‌లో ఈ టూత్ సోప్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ టూత్ సోప్ ను కొద్దిగా తడిపితే అది మెత్తని పేస్టులా మారుతుంది. దానిని కొద్దిగా తీసుకొని దంతాలపై రుద్దుకోండి. టూత్‌పేస్ట్‌ కంటే నురగ ఎక్కువ వస్తుంది. రసాయనాలు తక్కువ ఉంటాయి. పళ్లపై సున్నితంగా పనిచేస్తుంది.

5. దాల్చినచెక్క

మీరు ఎప్పుడైనా హెర్బల్ టూత్‌పేస్ట్‌లు లేదా టూత్ పౌడర్‌లపై ఉన్న లేబుల్ గమనిస్తే లేదా వాటి ఇంగ్రీడియెంట్స్ చదివితే అందులో దాల్చినచెక్క కూడా వాడినట్లు ఉంటుంది. సాధారణంగా మింట్ ఫ్లేవర్ (పుదీనా) లేని ఉత్పత్తుల్లో మరొక ఫ్లేవర్ గా ఈ దాల్చినచెక్కను ఉపయోగిస్తారు. దీనిని బట్టి మీకు అర్థమైనట్లే కదా? దాల్చినచెక్కతో కూడా దంతాలను, నోటిని శుభ్రపరుచుకోవచ్చు. దాల్చినచెక్కలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. దాల్చినచెక్కను పొడిగా చేసుకొని పళ్లు తోముకుంటే అది నోటిని సమూలంగా శుభ్రపరుస్తుంది. అయితే మోతాదుకి మించితే చిగుళ్లపై పొక్కులు ఏర్పడవచ్చు, జాగ్రత్త!

టాపిక్

తదుపరి వ్యాసం