Nightmares: పీడ కలలు ఎందుకు వస్తాయి? అవి రాకుండా అడ్డుకోవడం ఎలా?
08 February 2024, 19:00 IST
- Nightmares: ఎంతోమందికి భయపెట్టే పీడకలలు ఒక్కోసారి వస్తూ ఉంటాయి. ఇలా చెడు కలలు ఎందుకు వస్తాయో? అడ్డుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
చెడు కలలు ఎందుకు వస్తాయి
Nightmares: పీడకలను నిద్రలోనే మనిషిని భయపెట్టేస్తాయి. ఉలిక్కిపడి లేచి ఆ భయంతోనే కాసేపు వణికిపోయేలా చేస్తాయి. పీడకలలు వచ్చాయంటే నిద్ర సరిగా పట్టదు. ఇవి ఎందుకు వస్తాయో? అవి రాకుండా అడ్డుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. పీడకలలు రావడానికి ఆ మనిషి మానసిక స్థితి ముఖ్యంగా కారణం. అధిక భావోద్వేగాలకు గురవుతున్న వ్యక్తుల్లో, తీవ్రంగా ఆలోచిస్తున్న వ్యక్తులకు, అధిక ఒత్తిడికి గురవుతున్న వ్యక్తులకు... ఇలా పీడకలలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇలా పీడకలలు వస్తే నిద్ర పట్టడం చాలా కష్టం. ఆ పీడకలల ప్రభావం నిద్రలేచాక ఆ రోజంతా వేధిస్తూ ఉంటుంది. చెడు కలలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీరు నిద్రపోవడానికి ఒక గంట ముందు టీవీ, ఫోన్ వంటివి చూడవద్దు. ఒకవేళ చూసినా కామెడీగా ఉండేవి, వినోదాన్ని పంచేవి మాత్రమే చూడండి. థ్రిల్లర్ మూవీలు, హర్రర్ మూవీలు వంటివి చూడవద్దు. అలాగే ఎమోషనల్‌గా ఏడ్చే సీన్లను కూడా చూడవద్దు. వాటి ప్రభావం మొదటి నిద్ర పై పడుతుంది.
1. నిద్రపోవడానికి ముందు వేడి నీళ్లతో స్నానం చేయండి. ఇది శరీరానికి సాంత్వన ఇస్తుంది. ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తుంది.
2. నిద్రపోయే ముందు ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే మీకు సుఖవంతమైన నిద్రపట్టే అవకాశం ఉంటుంది.
3. నిద్రకు ముందు మీ గదిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా సువాసనలు వీచే విధంగా ముందుగానే అగరవత్తులు వెలిగించుకోవడం వంటివి చేయండి. అలాంటి వాసనలు గాఢనిద్రను వచ్చేలా చేస్తాయి.
4. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి నిద్ర పై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అధిక ఆలోచనలను కూడా కంట్రోల్ చేసుకోండి.
5. తీవ్రంగా భావోద్వేగాలకు గురవుతూ ఉంటే వైద్యులు సహాయం తీసుకోండి. తీవ్ర భావోద్వేగాల వల్ల నిద్ర సరిగా పట్టదు.
6. ఒత్తిడి వల్ల కూడా గాఢ నిద్ర పట్టకుండా తీవ్ర చెడు కలలు వచ్చే అవకాశం ఉంటుంది.
7. పడుకునే ముందు సున్నితమైన సంగీతాన్ని వినడం అలవాటు చేసుకోండి. ఇది ఆరోగ్యానికి, నిద్రకు మేలు చేస్తుంది.
8. ప్రాణాయామం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది. భావోద్వేగాలు అదుపులోకి వస్తాయి. చెడుకలను వచ్చే అవకాశం తగ్గుతుంది.
ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఉందో, నిద్రకూ అంతే ప్రాధాన్యత ఉంది. నిద్ర ప్రాధాన్యత ఇవ్వకుండా తక్కువ గంటలు నిద్రపోయే వారిలో ఇలా చెడుకలలో వచ్చే అవకాశం ఉంది. మెదడుకు తగినంత విశ్రాంతి అవసరం. అప్పుడే అది సమర్థవంతంగా పనిచేస్తుంది. నిద్రను ప్రేరేపించే ఆహారాలను తినడం అలవాటు చేసుకుంటే మంచిది. రాత్రిపూట మసాలాలు, కారాలు దట్టించిన ఆహారాలను తినడం మానుకోండి. తేలికపాటి ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించండి. ఎక్కువ మందికి రాత్రిపూట పాలు తాగడం వల్ల నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. గోరువెచ్చని పాలు తాగి పడుకోవడానికి ప్రయత్నించండి. నిద్రకు గంట ముందు నుంచే మనసును, మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఏ సమస్యలను గుర్తుకుతెచ్చుకోకండి.