Toyota Glanza |ఆకర్షణీయమైన ఫీచర్లతో 'టొయోటా గ్లాంజా' కార్, ధర బడ్జెట్‌లోనే!
15 March 2022, 14:57 IST
- టొయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తమ బ్రాండ్ నుంచి మంగళవారం సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు 'టయోటా గ్లాంజా' ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 6.39 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.
Toyota Glanza
జపాన్ కేంద్రంగా పనిచేసే టొయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తమ బ్రాండ్ నుంచి మంగళవారం సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు 'టొయోటా గ్లాంజా' ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 6.39 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.
ఈ సరికొత్త హ్యాచ్‌బ్యాక్ గత నెలలో విడుదలైన మారుతి సుజుకి బాలెనోకి క్రాస్-బ్యాడ్జ్ వెర్షన్ గా చెప్పవచ్చు. ఎందుకంటే రెండు జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజాలైన టొయోటా-సుజుకి మధ్య వ్యూహాత్మక వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ ఒప్పందంలో భాగంగా సుజుకి నుంచి ఇండియన్ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందిన విటారా బ్రెజా, బాలెనో మోడెల్ కార్లను టయోటకు అమ్మేందుకు నిర్ణయించాయి.
ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంతో బాలెనోకి మోడెల్ కారుకి మార్పులు చేసి టాయోటా గ్లాంజాగా తొలి కారును నేడు మార్కెట్లో విడుదల చేశారు. ఈ క్రమంలో విటారా బ్రెజా మోడెల్ కూడా మార్పులు చేర్పులు చేసుకొని త్వరలో టాయోటా బ్రాండ్ మీద ఏదైనా కొత్త మోడెల్ క్రూజర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
కాస్త అందుబాటు- మీడియం రేంజ్ ధరల్లో లభించే కార్లకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా టయోటా నుంచి స్టైలిష్ స్పోర్టీ డిజైన్‌తో 2022 గ్లాంజా కారు విడుదల చేశారు.
స్పెసిఫికేషన్లు
కొత్త గ్లాంజా కారు మాన్యువల్ (MT) అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్ (AMT) రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మంచి పికప్, మైలేజ్ కోసం ఇందులో శక్తివంతమైన, ఇంధన-సమర్థవంతమైన 'K-సిరీస్ ఇంజిన్'ను అమర్చారు. ఇది 66 KW (89 PS) వద్ద 6000 RPM శక్తితో పనిచేస్తుంది. ఈ కారు నడిపేవారికి అత్యుత్తమ డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి మెరుగైన గ్యాసోలిన్ ఇంజిన్‌ను అందజేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఫీచర్లు
ఇందులో టయోటా ఐ-కనెక్ట్ ఫీచర్ ఇచ్చారు. దీని ప్రకారం ఈ కారును స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్ ఉపయోగించి కూడా ఇంజన్ స్టార్ట్ చేయవచ్చు. మిగతా ఫీచర్ల విషయానికి వస్తే.. ఎక్ట్సీరియర్ లో స్పోర్టి ఫ్రంట్ బంపర్, LED DRL (డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్) , ఫాగ్ ల్యాంప్స్, స్టైలిష్ ఫ్రంట్ గ్రిల్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆటో ORVM (బయట రియర్‌వ్యూ మిర్రర్)
ఇంటీరియర్ లో కొత్త హెడ్-అప్ డిస్ప్లే (HUD). డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్, 9-అంగుళాల స్మార్ట్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌తో పాటు అధునాతనమైన I-కనెక్ట్ టెక్నాలజీ ద్వారా 45కు పైగా స్మార్ట్ ఫీచర్లను ఆపరేట్ చేయవచ్చు. భద్రత పరంగా ఈ కారులో నాలుగు పార్కింగ్ సెన్సార్లతో పాటు 360-డిగ్రీ కెమెరాతో పాటు మొత్తం 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఇచ్చారు.
వేరియంట్ ను బట్టి టయోటా గ్లాంజా ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 6.39 లక్షల నుండి రూ. 9.69 లక్షల వరకు ఉన్నాయి.