Mutton Kheema Potlakaya Curry: మటన్ ఖీమా పొట్లకాయ కర్రీ వండి చూడండి, చపాతీ, అన్నంలోకి అదిరిపోతుంది
11 March 2024, 12:05 IST
- Mutton Kheema Potlakaya Curry: మటన్ ఖీమా అంటే ఎంతో మందికి ఇష్టం. దీనితో ఎన్నో వంటకాలు చేయొచ్చు. ఒకసారి మటన్ ఖీమా పొట్లకాయ కలిపి కర్రీలా వండండి. దీని రెసిపీ అదిరిపోతుంది.
మటన్ ఖీమా పొట్లకాయ కర్రీ రెసిపీ
Mutton Kheema Potlakaya Curry: నాన్ వెజ్ ప్రియులకు మటన్ ఖీమా పేరు వింటేనే నోరూరిపోతుంది. దీంతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. మటన్ ఖీమా బిర్యానీ, మటన్ ఖీమా ఫ్రై, మటన్ ఖీమా కట్లెట్స్... ఇలా ఏది చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి సంప్రదాయ పద్ధతిలో మటన్ ఖీమా పొట్లకాయ కర్రీని వండి చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి కూడా అదిరిపోతుంది. ఒకసారి వండుకున్నారంటే మీరే మళ్ళీ మళ్ళీ వండుకుంటారు.
మటన్ ఖీమా పొట్లకాయ కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మటన్ ఖీమా - అరకిలో
పొట్లకాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
నూనె - ఆరు స్పూన్లు
ధనియాల పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - ఒక స్పూను
కారం పొడి - రెండు స్పూన్లు
జీలకర్ర పొడి - అర స్పూను
గరం మసాలా - అర స్పూను
ఉల్లిపాయ - ఒకటి
కరివేపాకులు - గుప్పెడు
పచ్చిమిర్చి - మూడు
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
మటన్ ఖీమా పొట్లకాయ కూర రెసిపీ
1. మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయండి.
2. దాంట్లోనే పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపండి. తర్వాత నీళ్లు వేయండి.
3. కుక్కర్ మీద మూత పెట్టి ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించండి. తర్వాత స్టవ్ కట్టేయండి.
4. ఈలోపు పొట్లకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.
6. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి.
7. ఉల్లిపాయల రంగు మారే వరకు వేయించండి.
8. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి మళ్లీ వేయించండి.
9. ఇప్పుడు పొట్లకాయ ముక్కలను వేసి బాగా కలిపి మూత పెట్టండి.
10. ఒక పావుగంటసేపు ఉడికిస్తే పొట్లకాయ మెత్తగా ఉడుకుతుంది.
11. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ ఖీమాను అందులో వేసి బాగా కలుపుకోండి.
12. మూత పెట్టి ఒక అరగంట పాటు మీడియం మంట మీద ఉడికించండి.
13. ఇంకా అవసరం అనుకుంటే కారం, ఉప్పు వంటివి వేసుకోవచ్చు.
14. మటన్ ఖీమాను కుక్కర్లో ఉడికించినప్పుడు మిగిలిన నీటిని పడేయకుండా ఇగురు కోసం ఆ నీటిని కూరలో వేసుకుంటే మంచిది.
15. ఎందుకంటే ఆ నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.
16. ఈ కూర ఇగురులా అయ్యే వరకు ఉడికించుకోండి.
17. దించే ముందు కొత్తిమీర తరుగును చల్లుకుంటే అయిపోతుంది.
18. స్టవ్ కట్టేశాక ఈ మటన్ ఖీమా పొట్లకాయ కర్రీని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిని చూడండి. రుచి అదిరిపోతుంది. చపాతీ, రోటీల్లో కూడా టేస్టీగా ఉంటుంది.
మటన్, పొట్లకాయ... ఈ రెండూ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. పొట్లకాయలో ఎన్నో పోషకాలు నిండుగా ఉంటాయి. పొట్లకాయ తినడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మలబద్ధకంతో బాధపడేవారు పొట్లకాయలు తినడం అలవాటు చేసుకోవాలి. వారానికి రెండుసార్లు పొట్లకాయతో చేసిన ఆహారాలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాస సమస్యలు తగ్గుతాయి. ఎముకలకు బలం అందుతుంది.
ఇందులో మటన్‌ని కూడా వినియోగించాము. మటన్ తినడం వల్ల బి విటమిన్లు శరీరానికి పుష్కలంగా అందుతాయి. వీటితో పాటు విటమిన్ ఇ, విటమిన్ కే కూడా శరీరం శోషించుకుంటుంది. ముఖ్యంగా గర్భిణీలు మటన్ తినడం చాలా అవసరం. మటన్ తినడం వల్ల బిడ్డల్లో ఎలాంటి న్యూరల్ ట్యూబ్ సమస్యలు రాకుండా ఉంటాయి. మటన్లో కాల్షియం కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలు, పెద్దలు కచ్చితంగా దీన్ని తినాలి. ఎముకలు, దంతాలకు ఇది బలాన్ని అందిస్తుంది. ఈ మటన్, పొట్లకాయ కూర తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. పిల్లలు కూడా దీన్ని సులువుగా తినగలరు. కారం తగ్గించుకుంటే పిల్లలకు తినిపించవచ్చు.