తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Moongdal Laddu: పిల్లల కోసం పెసర లడ్డూ రెసిపీ, వీటి నిండా పోషకాలే

Moongdal Laddu: పిల్లల కోసం పెసర లడ్డూ రెసిపీ, వీటి నిండా పోషకాలే

Haritha Chappa HT Telugu

29 December 2023, 16:00 IST

google News
    • Moongdal Laddu: సాయంత్రం పూట పిల్లలకు జంక్ ఫుడ్ ఇచ్చే బదులు పోషకాలు ఉన్న పెసరు లడ్డూని తినిపించండి. అన్ని విధాలా మంచిది.
పెసర లడ్డూ
పెసర లడ్డూ (Pixabay)

పెసర లడ్డూ

Moongdal Laddu: సాయంత్రం అయితే పిల్లలకు స్నాక్స్ ఏమివ్వాలో తల్లిదండ్రులు వెతుక్కుంటూ ఉంటారు. ప్రతిసారీ చిప్స్, బిస్కెట్లో, చాక్లెట్లో ఇచ్చే బదులు శరీరానికి శక్తిని అందించే ఆహారాలను ఇవ్వడం ముఖ్యం. ఇంట్లోనే తయారు చేసిన పెసర లడ్డూలను పిల్లలకు తినిపించండి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతోపాటు ప్రోటీన్లను అందిస్తాయి. పెసర లడ్డూని తినడం వల్ల చికెన్, మటన్, చేపలు వంటివి తినడం వల్ల వచ్చే పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. ఆయుర్వేదంలో కూడా పెసలకు ఉన్నత స్థానమే ఉంది. వీటితో లడ్డూలను చాలా సులువుగా తయారు చేయొచ్చు. పెసర లడ్డూల రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.

పెసర లడ్డూ రెసిపీకి కావలసిన పదార్థాలు

పెసలు - ఒక కప్పు

పాలపొడి - అరకప్పు

బెల్లం తురుము - ఒక కప్పు

యాలకుల పొడి - అర స్పూను

బాదం తురుము - రెండు స్పూన్లు

పిస్తా తురుము - రెండు స్పూన్లు

జీడిపప్పు తురుము - మూడు స్పూన్లు

నెయ్యి - అర కప్పు

పెసర లడ్డు రెసిపీ

1. ఈ లడ్డూలను చేయడానికి పొట్టు ఉన్న పెసలను లేదా పెసరపప్పును గాని తీసుకోవచ్చు.

2. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో పెసలు వేసి చిన్న మంట మీద వేయించాలి.

3. తర్వాత వాటిని చల్లార్చాలి. ఇప్పుడు ఆ పెసలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

4. అలాగే బెల్లం తురుమును కూడా మిక్సీలో వేసి పొడి కొట్టుకోవాలి.

5. ఇప్పుడు పెసర పిండిలో బెల్లం పొడి, పాలపొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

6. అందులోనే బాదం, పిస్తా, జీడిపప్పు తురుములను కూడా వేసి బాగా కలపాలి.

7. ఇప్పుడు వాటిని లడ్డూలు చుట్టేందుకు వీలుగా నెయ్యిని వేసి కలుపుకోవాలి.

8. లడ్డూల్లా చుట్టుకుని గాలి చొరబడని సీసాలో వేసి నిల్వ ఉంచుకోవాలి. ఇవి నెల రోజుల వరకు తాజాగా ఉంటాయి.

9. రోజుకో లడ్డూ తింటే చాలు, మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి.

రోజూ గుప్పెడు నానబెట్టిన పెసలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ఈ పెసలతో చేసిన లడ్డూను తిన్నా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పెసల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి మాంసాహారం తినని వారు పెసరపప్పును ఆహారంలో భాగం చేసుకోవాలి. పెసరపప్పు నిత్యం తినే వారికి చర్మ సమస్యలు తక్కువగా వస్తాయి. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచి మెరుపును సంతరించుకునేలా చేస్తుంది. జుట్టు పెరుగుదలకు ఇది మేలు చేస్తుంది. శరీరంలోని కండరాలకు బలాన్ని ఇస్తుంది. పెసలు తినడం వల్ల చర్మం ఏజింగ్ లక్షణాల నుండి బయటపడుతుంది. చర్మంపై ముడతలు, గీతలు వంటివి రావు కాబట్టి అసలు వయసు కన్నాయంగ్ గా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి పెసలను ఏదో ఒక రూపంలో ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నించండి.

తదుపరి వ్యాసం