తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : తెలియక తప్పు చేస్తే అమాయకుడు.. తెలిసి తప్పు చేస్తే మూర్ఖుడు

Monday Motivation : తెలియక తప్పు చేస్తే అమాయకుడు.. తెలిసి తప్పు చేస్తే మూర్ఖుడు

HT Telugu Desk HT Telugu

24 April 2023, 4:30 IST

    • Monday Motivation : మన చుట్టూ చాలా మంది ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వారి మూర్ఖత్వం బయటపడుతుంది. వారితో వాదనకు దిగితే.. మనం కూడా మూర్ఖులం అయిపోతాం. అందుకు చూసి చూడనట్టుగా వెళ్లిపోవాలి. కానీ కొన్నిసార్లు వారికి తగిలేలా సమాధానం ఇవ్వాలి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ విషయాన్ని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. అదేంటంటే.. మూర్ఖులతో ఎప్పుడూ వాదన పెట్టుకోవద్దు.. ఎందుకంటే వారు ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజార్చుతారు.. ఆ తర్వాత వారికున్న అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు..! అందుకే మూర్ఖులతో వాదనకు అస్సలు దిగొద్దు. దిగితే మీకు నష్టం. ఉదాహరణగా ఓ కథ చెప్పుకుందాం.

ఒక సన్యాసి సుదూర ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాడు. అతను తన ఆశ్రమాన్ని విడిచిపెట్టాడు. ప్రయాణంలో పెద్ద కాలువను దాటవలసి వచ్చింది. కానీ ఆ ఊరి ప్రజలు కాలువను దాటడానికి పడిపోయిన కొబ్బరి చెట్టును ఉపయోగిస్తారు. ఈ చెట్టుపై నుంచి ఒక్కరు మాత్రమే వెళ్లగలరు. అంత సన్నటి చెట్టు అది. సన్యాసి కూడా దాటడానికి చెట్టు ఎక్కి నడక ప్రారంభించి ఒడ్డు దాటేదాకా చేరుకున్నాడు. అప్పుడే అవతలి వైపు నుండి ఒక వ్యక్తి కాలువను దాటడానికి వచ్చాడు. అతను చాలా కోపంగా ఉంటాడు.. ఎవరినీ గౌరవించడు. దీంతో గ్రామంలో అతడికి చెడ్డపేరు ఉంది.

ఇంకాస్త దూరం మాత్రమే ఉంది.. కాస్త వెనక్కు వెళ్లు నాయన అని సన్యాసి అతడిని అడుగుతాడు. కానీ అతడు కోపిష్టి. అస్సలు వెనక్కు వెళ్లడు. ఎందుకు వెళ్లవు.. కాస్త దూరమే కదా అని అడిగాడు సన్యాసి. మూర్ఖులకు దారి ఇచ్చే అలవాటు నాకు లేదు అని అహంకారంతో అంటాడు. సన్యాసి ఏమీ మాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోయాడు.

ఇదే సమయంలో సన్యాసిని ఊరి అతడు సరదాగా ఓ ప్రశ్న అడుగుతాడు. నువ్వేందుకు దగ్గరలోకి వచ్చిన తర్వాత కూడా.. వెనక్కు వెళ్లావు? నన్ను ఎందుకు వెళ్లనిచ్చావు అని అడుగుతాడు. 'నాకు మూర్ఖులకు దారి తీయడం అలవాటు' అని సన్యాసి సమాధానమిచ్చి మళ్ళీ నడవడం ప్రారంభించాడు. ఇది విన్న ఊరి అతడికి చెంప మీద లాగి కొట్టినట్టైంది.

మూర్ఖులు అలాగే ఉంటారు. వారిని పెద్దగా పట్టించుకోని మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు. అన్నింటికి మించి... వారితో అస్సలు వాదనలకు దిగొద్దు. మూర్ఖులతో ఏం చేసినా.. మీకే నష్టం. మూర్ఖత్వమే వారిని నాశనం చేస్తుంది. వారి గురించి ఆలోచించి.. మీ బుర్ర పాడు చేసుకోకండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మూర్ఖత్వమనే జబ్బు చాలా ప్రమాదకరం.

తెలియక తప్పు చేస్తే అమాయకుడు.. తెలిసి తప్పు చేస్తే మూర్ఖుడు.. అమాయకుడిని మార్చొచ్చు.. కానీ మూర్ఖున్ని మార్చలేం..!

తదుపరి వ్యాసం