తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ప్రతిరోజు ఒక యోగాసనం వేయండి.. కేంద్ర ఆయుష్ శాఖ 100 రోజుల యోగా ఉత్సవాలు ప్రారంభం

ప్రతిరోజు ఒక యోగాసనం వేయండి.. కేంద్ర ఆయుష్ శాఖ 100 రోజుల యోగా ఉత్సవాలు ప్రారంభం

HT Telugu Desk HT Telugu

14 March 2022, 6:03 IST

google News
    • అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని 100 రోజుల ముందే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ప్రజలందరూ యోగా అభ్యసించి, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని తయారుచేయడమే లక్ష్యం
Yoga (Photo: Shutterstock (For representational purposes only))
Yoga (Photo: Shutterstock (For representational purposes only)) (HT_PRINT)

Yoga (Photo: Shutterstock (For representational purposes only))

New Delhi | 2022 జూన్ 21న 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని 100 రోజుల ముందే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర ఆయుష్ మంత్రి సదానంద్ సోనోవాల్ ఆదివారం రోజున న్యూఢిల్లీలో యోగా మహోత్సవ్ 2022ను ప్రారంభించారు. నిన్న ఆదివారం మొదలుకొని 100 రోజుల పాటు 100 నగరాలలో 100 సంస్థలు యోగా ప్రచార కార్యక్రమాలను 2022 జూన్ 21వ తేదీ వరకు నిర్వహిస్తాయని మంత్రి తెలిపారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌' లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ 2022 జూన్ 21న దేశంలో వారసత్వ కేంద్రాలుగా గుర్తించిన 75 హెరిటేజ్ కేంద్రాలలో అంతర్జాతీయ యోగా ఉత్సవాలను నిర్వహిస్తామని ఆయుష్ మంత్రి పేర్కొన్నారు.

ఈ 100రోజుల యోగా ఉత్సవాల్లో భాగంగా యోగాకి సంబంధించిన కార్యక్రమాలు, ప్రదర్శనలు, వర్క్ షాపులు, సదస్సులు నిర్వహిస్తారు. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లో కూడా నిర్వహించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఎంయోగా యాప్, నమస్తే యాప్, Y-బ్రేక్ యాప్‌ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను మంత్రిత్వ శాఖ ప్రచారం చేస్తుంది. ఈ యోగా కార్యక్రమాల్లో పెద్దమొత్తంలో ప్రజలు పాల్గొనేలా ఫోటో పోటీ, క్విజ్, చర్చ, ప్రతిజ్ఞ, పోల్ సర్వే, జింగిల్ లాంటి కార్యక్రమాలు MyGov ప్లాట్‌ఫారమ్‌లో నేటి నుంచి ప్రారంభమవుతాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ భారతదేశంలో నెలకొల్పడానికి అంగీకరించిందని మంత్రి తెలిపారు. ఈ కేంద్రంలో యోగా, సాంప్రదాయ ఆరోగ్య పద్ధతులపై పరిశోధనలు సాగుతాయని మంత్రి అన్నారు. వీటి ద్వారా ప్రపంచ ప్రజలందరికీ శాంతి, మెరుగైన ఆరోగ్య పరిరక్షణ అందించేందుకు అవకాశం కలుగుతుందని ఆయుష్ మంత్రి సదానంద్ సోనోవాల్ అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యోగా ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది సదానంద్ సోనోవాల్ అన్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు పాల్గొంటున్న కార్యక్రమంగా యోగా గుర్తింపు పొందిందని అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఉమ్మడి యోగా ప్రోటోకాల్‌ను 250 మిలియన్లకు పైగా ప్రజలు అభ్యసిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రపంచ శాంతి కోసం యోగాను భారతీయ బ్రాండ్‌గా అందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ఆయన అన్నారు. “ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్” ప్రచార నినాదాన్ని ప్రోత్సహించడానికి కూడా చర్యలు అమలు చేస్తున్నామని అన్నారు.

తదుపరి వ్యాసం