తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Millet Milk: మిల్లెట్ మిల్క్... చిరుధాన్యాలతో తయారయ్యే పాలు, మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు

Millet Milk: మిల్లెట్ మిల్క్... చిరుధాన్యాలతో తయారయ్యే పాలు, మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు

Haritha Chappa HT Telugu

21 February 2024, 9:39 IST

google News
    • Millet Milk: మిల్లెట్లు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ జనాదరణను పొందుతున్నాయి. ఇప్పుడు మిల్లెట్ మిల్క్ ట్రెండ్ మొదలైంది. ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు.
 మిల్లెట్ మిల్క్ గురించి తెలుసా
మిల్లెట్ మిల్క్ గురించి తెలుసా (Pexels)

మిల్లెట్ మిల్క్ గురించి తెలుసా

Millet Milk: ఇప్పటికే ఆవు, గేదెపాల ప్రత్యామ్నాయాలపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అలా పుట్టుకొచ్చిందే సోయా పాలు. సోయా గింజలతో ఈ పాలను తయారు చేస్తారు. అంతేకాదు ఇప్పుడు కొత్త ట్రెండ్ మిల్లెట్ మిల్క్. మిల్లెట్స్ అనగా చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. వీటిని పాల రూపంలో మార్చుకొని కూడా తాగవచ్చు. విదేశాల్లో ఇప్పుడు ఈ ట్రెండ్ కొనసాగుతోంది. త్వరలో మన దగ్గరికి ఈ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. మీకు నచ్చిన చిరుధాన్యాలతో పాలు తయారుచేయవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా.

ఆసియా, ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన పురాతన ధాన్యాలు మిల్లెట్స్. ఐక్యరాజ్యసమితి మిల్లెట్స్ వాడకంపై ఇప్పటికే ఎన్నో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు, సామలు, అరికలు... ఇవన్నీ కూడా చిరుధాన్యాలు అని పిలుచుకుంటారు.

మిల్లెట్ మిల్క్ తయారీ

ఇంట్లోనే మీకు నచ్చిన చిరుధాన్యాలతో పాలను తయారు చేసుకోండి. ఇందుకోసం మీకు నచ్చిన చిరుధాన్యాన్ని ఎంచుకోండి. ఒక కప్పు చిరుధాన్యాలు, ఆరు కప్పుల నీరు, మూడు టేబుల్ స్పూన్ల తేనె రెడీ చేసుకోండి.

ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో మిల్లెట్లను, నీటిని వేసి ఉడికించండి. తక్కువ వేడి మీద ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించండి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనిచ్చాక కుక్కర్ మూతను ఓపెన్ చేయండి. ఉడికిన మిల్లెట్లను మిక్సీ జార్లో వెయ్యండి. ఒక కప్పు మిల్లెట్లకు, రెండు కప్పుల నీటిని వేసి మిక్సీలో జ్యూస్‌లా చేయండి. తర్వాత వడకట్టి గ్లాసులో మిల్లెట్ జ్యూస్‌ను వేయండి. తర్వాత దానిలో తేనె తెలపండి. అంతే మిల్లెట్ మిల్క్ రెడీ అయినట్టే. ఇది పది రోజుల వరకు నిలవ ఉంటుంది. కాకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.

మీకు నచ్చిన చిరుధాన్యాలతో మిల్లెట్ మిల్క్ తయారు చేసుకునే తాగడం అలవాటు చేసుకోండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మిల్లెట్లు ఏ రంగులో ఉన్నాయో అవే రంగు పాలు వస్తాయి. రాగులతో మిల్లెట్ మిల్క్ చేస్తే బ్రౌన్ రంగులోనే మిల్క్ వస్తుంది. సామలు, ఊదలు, ఆండు కొర్రలు...వంటి వాటితో చేస్తే పాలు కాస్త తెలుపుగా వచ్చే అవకాశం ఉంది. వీటిని తాగడం అలవాటు చేసుకుంటే ఎలాంటి అనారోగ్యాలు మీ దరికి రావు.

శక్తి హీనంగా ఉన్నవారు, రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు ఇలా మిల్లెట్ మిల్క్‌ను తాగడం అలవాటు చేసుకుంటే మంచిది. ముఖ్యంగా పిల్లలకు ప్రతిరోజు ఒక గ్లాసు తాగించండి. వారిలో వచ్చే మార్పు మీకు రెండు వారాల్లోనే కనిపిస్తుంది. భవిష్యత్తులో మిల్లెట్ మిల్క్ ట్రెండ్ పూర్తిగా రాబోతోంది.

టాపిక్

తదుపరి వ్యాసం