Family Relationships: వివాహిత మహిళ ఎట్టి పరిస్థితుల్లో భర్తతో అనకూడని 4 మాటలివే, మాట జారితే అనర్థాలు పెరుగుతాయి
15 October 2024, 19:00 IST
భార్యాభర్తలు గొడవలు పడటం సహజం. కానీ ఆ గొడవలో సహనం కోల్పోయి ఎట్టి పరిస్థితుల్లో భార్య తన భర్తని కొన్ని మాటలు అనకూడదు.
భార్యాభర్తలు గొడవ
ప్రతి వైవాహిక బంధంలో భార్య, భర్తల మధ్య వాగ్వాదాలు మామూలే. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోవచ్చు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లో భార్య మాత్రం ఓ నాలుగు విషయాల్లో భర్తని దూషించినట్లు మాట్లాడకూడదు. మీ మాటలు ఎప్పుడూ మీ భర్త ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, మీ సంబంధాన్ని ప్రశ్నించేలా ఉండకూడదు.
నీ ఫ్యామిలీతో నాకు సంబంధం లేదు
వివాహిత మహిళల్లో ఇప్పటికీ చాలా మంది అత్తమామల పట్ల సానుకూలంగా వ్యవహరించరు. వారితో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నామని ఫిర్యాదు చేస్తుంటారు. అయితే మీరు మీ భర్తతో గొడవపడే సమయంలో మీ వాళ్లతో నేను ఇక వేగలేను అని భర్తతో చెప్పకూడదు. అతని కుటుంబాన్ని మీరు ఇష్టపడటం లేదని చెప్పడాన్ని ఏ భర్త అంగీకరించడు. అలా కాకుండా మీరు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మీ భాగస్వామితో కలిసి కూర్చుని మాట్లాడండి. పరిష్కారాన్ని సూచించమని కోరండి.
నువ్వు నాకు కరెక్ట్ కాదు
మీ భర్త ఏదైనా తెలియకుండా పొరపాటు చేసినా లేదా గొడవ సందర్భంలో మాట జారినా మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నాకు కరెక్ట్ కాదు అనే మాట అనకూడదు. అది మీ భర్త అహాన్ని దెబ్బతీస్తుంది. అలానే అసహనంలో పాత బంధాన్ని గుర్తు చేయడం, వేరొకరిని చేసుకుని ఉండింటే బాగుండేది లాంటి మాటల్ని అస్సలు అనకూడదు. అలానే మీ భర్తని మీకు ఆ పని చేతకాదని చెప్పడం అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. వారు దాన్ని స్పోర్టీవ్‌గా తీసుకుంటే ఓకే.. కానీ నెగటివ్‌గా తీసుకుంటేనే మీకు ఇబ్బందులు వస్తాయి.
నీ కంటే అతను బెస్ట్
మీ భర్తని ఎట్టి పరిస్థితుల్లో వేరొకరితో పోల్చవద్దు. అతను చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని ప్రశ్నించడం అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఏ మనిషి మరొక మనిషితో పోల్చడాన్ని ఇష్టపడడు. ఇది వారి అహంకారాన్ని దెబ్బతీయడమే కాకుండా వేరొకరితో కంటే మిమ్మల్ని చిన్నచూపుగా చూడటంతో వాళ్లు నిరాశకి గురవుతారు.
నువ్వు నాకు అవసరం లేదు..
మీ భర్తతో వాదించే సమయంలో ఇకపై నీ గురించి నేను పట్టించుకోను.. నువ్వు నాకు అవసరం లేదు అనే మాట ఎట్టి పరిస్థితుల్లో అనకూడదు. మీరు అతడ్ని ప్రేమించడం లేదని మీ భాగస్వామికి చెప్పడం మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది, అలానే అతని మనస్సులో సందేహాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఆ మాట తర్వాత మీ బంధాన్ని ప్రశ్నించడం ప్రారంభించవచ్చు లేదా అతను సందేహంలో ఉండిపోతారు.
భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగినప్పుడు ఎవరో ఒకరు సర్దుకోవాలి. మాటకి మాట పెంచుకోవడం ఇద్దరికీ మంచిది కాదు. మీ భర్త మాట పట్టింపులకి వెళ్తున్నప్పుడు మీరే కాస్త అర్థం చేసుకుని అక్కడితో గొడవకి పుల్‌స్టాప్ పెట్టడం ఉత్తమం. ఆ తర్వాత ఆ సమస్య గురించి అతనికి కోపం తగ్గిన తర్వాత చర్చించి పరిష్కరించుకోవచ్చు. ఏ సమస్య కూడా వాగ్వాదంతో పరిష్కారం కాదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి.
టాపిక్