తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Salad Dressing: సలాడ్లలో ఇవి కలపండి, పచ్చి కూరగాయ ముక్కలూ కమ్మగా అనిపిస్తాయ్

Salad Dressing: సలాడ్లలో ఇవి కలపండి, పచ్చి కూరగాయ ముక్కలూ కమ్మగా అనిపిస్తాయ్

29 October 2024, 6:30 IST

google News
    • Salad Dressing: సలాడ్ల రుచి పెరగాలంటే సలాడ్ డ్రెస్సింగ్ వాడటం చాలా ముఖ్యం. ఇవి సాస్ లాగా తయారు చేసి పచ్చి కూరగాయలు, గింజల్లో కలిపేసుకుంటే కడుపునిండా తినేంత రుచిగా మారిపోతాయి. అలాంటి 4 సలాడ్ డ్రెస్సింగ్ రెసిపీలు చూడండి.
సలాడ్ డ్రెస్సింగ్
సలాడ్ డ్రెస్సింగ్

సలాడ్ డ్రెస్సింగ్

సలాడ్లు తినడం ఆరోగ్యకరం అని తెల్సిందే. అయితే వాటిని తింటున్నప్పుడు ఏవో పచ్చి కూరగాయ ముక్కలు తినేస్తున్నాం అనిపిస్తే ఎక్కువ రోజులు ఈ అలవాటు కొనసాగించలేం. అలా బోర్ కొట్టకుండా ఉండాలంటే మంచి సలాడ్ డ్రెస్సింగ్ అవసరం. అంటే కట్ చేసుకున్న కూరగాయముక్కల మీద ఈ డ్రెస్సింగ్ వేసుకుని కలిపి తింటే రుచి పెరుగుతుంది. ఇంకా ఎక్కువగా తినాలనిపిస్తుంది. రోజూ కొత్తగా అనిపించేలా వీటిని రకరకాలుగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.

1. అల్లం పసుపుతో సలాడ్ డ్రెస్సింగ్:

పావు కప్పు ఆలివ్ నూనె

రెండు చెంచాల నిమ్మరసం

1 చెంచా పసుపు

సగం చెంచా అల్లం తరుగు

1 చెంచా తేనె

పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక గిన్నెలో తీసుకుని కలుపుకోవాలి. మీరు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్లో ఈ మిశ్రమాన్ని కలుపుకుని తినేయడమే.

2. పెరుగుతో సలాడ్ డ్రెస్సింగ్:

1 కప్పు గట్టి తియ్యటి పెరుగు

సగం చెంచా వెల్లుల్లి తురుము లేదా గార్లిక్ పౌడర్

1 చెంచా సన్నటి ఉల్లిపాయ ముక్కలు లేదా ఆనియన్ పౌడర్

సగం చెంచా ఆరిగానో

కొద్దిగా మిరియాల పొడి

తగినంత ఉప్పు

కొత్తిమీర తరుగు

ఈ పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసుకుని కలుపుకోవాలి. దీన్ని సలాడ్ డ్రెస్సింగ్ లాగా లేదంటే డిప్పింగ్ సాస్ లాగా వాడుకోవచ్చు. అంటే చిప్స్ లాంటి వాటికి దీన్ని అంటించుకుని తిన్నా బాగుంటుంది.

3. నిమ్మరసంతో:

పావు కప్పు ఆలివ్ నూనె

పావు కప్పు నిమ్మరసం

1 చెంచా తేనె

కొద్దిగా ఉప్పు

పావు చెంచా మిరియాల పొడి

ముందుగా ఆలివ్ నూనె బాగా విస్క్ చేయాలి. అందులో నిమ్మరసం, తేనె కలపాలి. చివరగా సలాడ్ మీద ఉప్పు, మిరియాల పొడి చల్లుకోవాలి. సమయం లేనప్పుడు ఈ డ్రెస్సింగ్ టక్కున చేసుకోవచ్చు.

4. అవకాడోతో:

అవకాడో క్రీమీగా ఉంటుంది కాబట్టి దాన్ని సలాడ్‌లో ముక్కల్లా వేసుకోవడం కన్నా డ్రెస్సింగ్ లాగా తయారు చేసుకుంటే రుచి ఇంకా పెరుగుతుంది. తింటున్నప్పుడు సలాడ్ క్రీమీగా అనిపిస్తుంది. ఈ డ్రెస్సింగ్ కూడా కూరగాయలు, నాచోస్, చిప్స్ కోసం డిప్పింగ్ సాస్ లాగా పనికొస్తుంది. తయారీ కోసం..

1 అవకాడో సన్నటి ముక్కలు

సగం కప్పు తియ్యటి గడ్డ పెరుగు

రెండు చెంచాల కొత్తిమీర

మూడు చెంచాల నిమ్మరసం

5 చెంచాల ఆలివ్ నూనె

అరచెంచా వెల్లుల్లి ముక్కలు

ఉప్పు

మిరియాల పొడి

ముందుగా అవకాడో ముక్కలు, పెరుగు, కొత్తిమీర, నిమ్మరసం, ఆలివ్ నూనె, వెల్లుల్లి ముక్కలు వేసి ఫుడ్ ప్రాసెసర్ లేదా మిక్సీలో వేసి క్రీమీగా అయ్యేంతవరకు తిప్పాలి. ఇప్పుడు ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపితే చాలు. క్రీమీగా ఉండే సలాడ్ డ్రెస్సింగ్ రెడీ అయినట్లే.

టాపిక్

తదుపరి వ్యాసం