Sprouts chat: మొలకెత్తిన పెసర్లతో స్పైసీ చాట్, ఫ్రూట్ సలాడ్.. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు-make moong sprouts chat and salad for evening snack ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sprouts Chat: మొలకెత్తిన పెసర్లతో స్పైసీ చాట్, ఫ్రూట్ సలాడ్.. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు

Sprouts chat: మొలకెత్తిన పెసర్లతో స్పైసీ చాట్, ఫ్రూట్ సలాడ్.. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు

Sprouts chat: మొలకెత్తిన పెసర్లతో స్పైసీగా చాట్, తియ్యగా సలాడ్ రెసిపీలు ప్రయత్నించండి. నేరుగా మొలకల్ని తినలేకపోతే ఇవి మంచి రుచినిస్తాయి. పోషకాలు కూడా సరిగ్గా అందుతాయి.

మొలకెత్తిన పెసర్లతో చాట్ (Shutterstock)

మొలకెత్తిన పెసర్లలో పోషకాలు నిండి ఉంటాయి. వీటిని తినడం చాలా మందికి ఉండే అలవాటే. కానీ కొందరు వాటి రుచి నచ్చక ఆరోగ్యకరం అని తెల్సినా తినలేరు. ముఖ్యంగా చిన్న పిల్లలకు వీటి రుచి పరిచయం చేయాలంటే చాట్ లేదా సలాడ్ లాగా చేసివ్వండి. ఈ రెండు రెసిపీలు చూడండి.

మొలకెత్తిన పెసర్ల చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

2 కప్పులు మొలకెత్తిన పెసర్లు

1 బంగాళదుంప, ఉడికించి ముక్కలుగా కట్ చేసుకోవాలి

1 క్యారట్, చిన్న ముక్కలు

1 టమాటా, చిన్న ముక్కలు

1 ఉల్లిపాయ, సన్నం తరుగు

గుప్పెడు కొత్తిమీర తరుగు

అరచెంచా నిమ్మరసం

చిటికెడు నల్లుప్పు

పావు టీస్పూన్ చాట్ మసాలా (ఆప్షనల్)

అర టీస్పూన్ కారం

మొలకెత్తిన పెసర్ల చాట్ తయారీ విధానం:

  1. దీనికి కావాల్సిన పదార్థాలు ఎక్కువే కానీ తయారీ చాలా సులభం.
  2. ఒక జాలీ లేదా జల్లెడలోకి మొలకెత్తిన పెసర్లను తీసుకోండి. వీటిని ఆవిరి మీద ఒక అయిదు నిమిషాల పాటూ ఉడికించండి. నీళ్లలో వేసి ఉడికిస్తే పోషక నష్టం అని గుర్తుంచుకోండి.
  3. వీటిని ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోండి. పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక్కోటీ వేసి చక్కగా కలిపి చివరగా నిమ్మరసం పిండి సర్వ్ చేస్తే చాలు.
  4. మొలకెత్తిన పెసర్ల చాట్ రెడీ అయినట్లే.

మొలకెత్తిన పెసర్ల ఫ్రూట్ సలాడ్ తయారీకి కావాల్సినవి:

1 కప్పు మొలకెత్తిన పెసర్లు

1 చిన్న యాపిల్

సగం కప్పు దానిమ్మ గింజలు

1 సపోటా

అరకప్పు ద్రాక్షపండ్లు

చిటికెడు ఉప్పు

అర టీస్పూన్ పంచదార

మొలకెత్తిన పెసర్ల ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం:

  1. పైన చెప్పిన పండ్లే కాకుండా మీకిష్టమైన పండ్లు ఏవైనా దీనికోసం వాడేయండి. బొప్పాయి, మామిడిపండు.. ఏవైనా పర్వాలేదు. వాటిని చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి.
  2. ఈ సలాడ్ కోసం పెసర్లను ఉడికించకండి. పచ్చి మొలకలతోనే రుచి ఉంటుంది.
  3. మొలకెత్తిన పెసర్లను ఒక బౌల్ లోకి తీసుకుని అందులో అన్ని పండ్ల ముక్కలు, ఉప్పు, పంచదార, మిరియాల పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోండి.