Maida Pindi: మైదా పిండి ఎలా తయారు చేస్తారో తెలిస్తే దాన్ని తినడమే మానేస్తారు
19 February 2024, 17:12 IST
- Maida Pindi: మైదాపిండి ఆరోగ్యానికి మంచిది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయినా సరే మైదా పిండితో చేసే వంటకాల సంఖ్య ఇంకా అధికంగానే ఉంది. మైదాపిండి ఎలా తయారవుతుందో తెలిస్తే దాన్ని తినడమే మానేస్తారు.
మైదా పిండి ఎలా తయారవుతుంది?
Maida pindi: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? అందుకే ఇది తింటే అనేక రోగాలు వస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మైదా పిండితో చేసే వంటకాల సంఖ్య తక్కువేమీ కాదు. అనేక రకాల స్వీట్లు, కేకులు, బ్రెడ్డు, బొబ్బట్లు... ఇలా ఎన్నో ఈ పిండితో తయారు అవుతాయి. మైదాపిండి, పంచదార కలిసి తయారయ్యే వంటకాల సంఖ్య చాలా ఎక్కువ. ఈ రెండూ కలిస్తే ఆరోగ్యానికి చాలా ముప్పు. అయినా అవి రుచిగా ఉండడంతో మైదాపిండి సీట్లను తినేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మైదాపిండి దేనితో తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించండి. అది నేరుగా ఏ గింజల నుండి తయారవ్వదు.
ఉదాహరణకు రాగి పిండి కావాలనుకుంటే రాగులను మర పట్టించి రాగి పిండి తయారు చేసుకుంటాము. అలాగే బియ్యప్పిండి కావాలనిపిస్తే బియ్యాన్ని మర పట్టించి బియ్యప్పిండిని రెడీ చేసుకుంటాం. మైదాపిండి మాత్రం అలా తయారు కాదు. దీని ఉత్పత్తి చేసే పద్ధతిలో ఆరోగ్య ప్రమాద కారకాలను కలుస్తాయి. అందుకే మైదా పిండిని దూరంగా ఉంచమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
మైదా పిండిని ఎలా తయారు చేస్తారు?
చపాతీలు చేసే గోధుమ పిండిని తయారు చేసేందుకు గోధుమలను ఉపయోగిస్తారు. గోధుమ పిండి తయారీలో ఎలాంటి రసాయనాలు కలపరు. కేవలం గోధుమలను మర పట్టించి పిండిని తయారు చేస్తారు. అయితే మైదాపిండి మాత్రం మరో విధంగా తయారవుతుంది. గోధుమలను బాగా పాలిష్ చేస్తారు. ఇలా పాలిష్ చేసినప్పుడు గోధుమలపై ఉన్న పై పొరలన్నీ తొలగిపోతాయి. అందుకే మైదాపిండి తెల్లగా వస్తుంది.
గోధుమలతో తయారైన కూడా దాని రంగు తెల్లగా ఉండడానికి ఈ పాలిష్ చేయడమే కారణం. ఇప్పుడు బాగా పాలిష్ చేసిన గోధుమలను మర పట్టిస్తారు. దానికి మరింత తెలుపు రంగు వచ్చేందుకు బెంజోల్ పెరాక్సైడ్, క్లోరిన్ గ్యాస్, అజోడి కార్బోనోమైడ్, పొటాషియం బ్రోమైట్ వంటి రసాయనాలను కలుపుతారు. ఈ రసాయనాలన్నీ కలపడం వల్ల మైదాపిండి చాలా మెత్తగా, తెల్లగా మారుతుంది.
మైదాపిండిని తినడం వల్ల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అందుకే పోషకాహారునిపుణులు మైదాను పూర్తిగా తినడం మానేయమని సూచిస్తున్నారు. మైదాతో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరానికి అందే ఆరోగ్య ప్రయోజనాలు సున్నా. కానీ ఇందులో వాడిన రసాయనాల వల్ల మాత్రం దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా దీనిలో పొటాషియం బ్రోమైట్ ను వినియోగించారు. ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. నిజానికి బ్రోమేట్ పై నిషేధం కూడా ఉంది. దాన్ని తిని ఎన్నో కీటకాలు కూడా చనిపోతాయి. కాబట్టి మైదాపిండితో చేసిన వంటకాలకు దూరంగా ఉండాలి.
మైదా వంటకాలు
మార్కెట్లో మైదాతో చేసిన వంటకాలు ఎన్నో రకాలు ఉన్నాయి. నిజానికి వాటిని మైదాతో చేస్తారని తెలియక చాలామంది తినేస్తూ ఉంటారు. పరోటా, పూరీ, రుమాలీ రోటీ, కేకులు, రవ్వ దోశలు, కాజాలు, బాదుషాలు, జిలేబి, బొబ్బట్లు, బ్రెడ్లు... ఇవన్నీ కూడా మైదాతో చేసిన వంటకాలే. వీటిని నిత్యం తింటే కొన్ని రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.
మైదాతో చేసిన ప్రతి వంటకాన్ని గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్లో మైదాతో చేసిన వంటకాలను నిషేధించండి. పూర్తిగా గోధుమ పిండితోనే తయారు చేసేందుకు ప్రయత్నించండి. గోధుమ పిండితో చేసిన వంటకాలు రుచిగా కూడా ఉంటాయి. మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడాలనుకుంటే మైదా పిండిని పూర్తిగా తినడం మానేయడం ఒక్కటే ఉత్తమ మార్గం.