తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beetroot Dosa। మంచి రంగు, మంచి రుచి ఇంకా ఆరోగ్యకరం కూడా.. బీట్‌రూట్ దోశ తిన్నారా

Beetroot Dosa। మంచి రంగు, మంచి రుచి ఇంకా ఆరోగ్యకరం కూడా.. బీట్‌రూట్ దోశ తిన్నారా

HT Telugu Desk HT Telugu

14 August 2022, 7:34 IST

google News
    • దోశను చాలా రకాలుగా చేసుకోవచ్చు. అయితే బీట్‌రూట్ తో కలిపి బీట్‌రూట్ దోశ చేసుకుంటే ఆ అల్పాహారం మరింత ఆరోగ్యకరం అవుతుంది. క్రిస్పీగా, కలర్ ఫుల్ గా ఉండే బీట్‌రూట్ దోశ రెసిపీని ఇక్కడ చూడండి.
Beetroot Dosa
Beetroot Dosa

Beetroot Dosa

మనం తినే ఆహారంలో చిన్నచిన్న మార్పులను చేసుకుంటే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. మీ బ్రేక్‌ఫాస్ట్‌లో కూరగాయలను తీసుకోవటం వలన ఉదయం పూట శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. మీరు సాధారణంగా తయారుచేసుకునే అల్పాహారాలలో తాజా కూరగాయలను కూడా కలుపుకోండి. ఉదాహారణకు మనకు దోశలో చాలా వెరైటీలు ఉంటాయి. అయితే సాధారణ దోశకాకుండా బీట్‌రూట్ దోశ చేసుకుంటే అది మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.

వ్యాయామం చేసే వారికి బీట్‌రూట్ తీసుకోవటం ద్వారా మంచి శక్తి లభిస్తుంది. ఈ దుంపలో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది, ఇది మీ కండరాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు కొంతమంది అథ్లెట్లు తమ పనితీరును పెంచుకోవడానికి దుంపలను తింటారు లేదా బీట్‌రూట్ రసం తాగుతారు. బీట్‌రూట్ రసం మీ గుండె, ఊపిరితిత్తులు మరింత ప్రభావవంతంగా పని చేయడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బీట్‌రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. మీ రోగనిరోధక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది.

మరి ఈ బీట్‌రూట్ దోశ ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారు చేసుకునే విధానం ఇక్కడ అందిస్తున్నాం. ఇది చాలా సింపుల్ రెసిపీ. రవ్వదోశ చేసుకునే పిండికి బీట్‌రూట్ ప్యూరీ కలపాలి. క్రిస్పీగా, గులాబీ రంగులో ఈ దోశలు ఉంటాయి.

కావలసినవి

  • ½ కప్పు బీట్‌రూట్
  • 1 కప్పు బియ్యం పిండి
  • ¼ కప్పు రవ్వ
  • ¾ స్పూన్ ఉప్పు
  • 3 కప్పుల నీరు
  • ½ ఉల్లిపాయ (సన్నగా తరిగినది)
  • 2 పచ్చి మిర్చి (సన్నగా తరిగినవి)
  • 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర
  • కొన్ని కరివేపాకులు
  • 1 స్పూన్ జీలకర్ర
  • నూనె దోశలు వేయించటానికి సరిపడా

తయారీవిధానం

1. ముందుగా మిక్సింగ్ గిన్నెలో 1/2 కప్పు బీట్‌రూట్‌ను 1/2 కప్పు నీటితో కలిపి ప్యూరీలాగా రుబ్బుకోవాలి.

2. ఇప్పుడు బీట్‌రూట్‌ ప్యూరీని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని అందులో రవ్వ, బియ్యప్పిండి, కొద్దిగా ఉప్పు, 3 కప్పుల నీరు వేసి అన్ని బాగా కలపండి.

3. పైన చేసుకున్న రవ్వ మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కకు, పచ్చి మిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర వేసి కూడా బాగా కలపండి.

4. రవ్వ సరిగ్గా నానేలా 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. అవసరం అనుకుంటే మరికొన్ని నీరు కలపండి.

5. ఇప్పుడు పాన్ బాగా వేడి చేసి, ఒక టీస్పూన్ నూనె వేసి పాన్ మీద విస్తరించండి. అనంతరం సిద్ధం చేసుకున్న బీట్‌రూట్‌, రవ్వ మిశ్రమంతో దోశలు వేయండి. దోశ క్రిస్ప్ అయ్యేలా 2 నిమిషాల పాటు కాల్చండి.

6. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి. బీట్‌రూట్‌ దోశ సిద్ధమయినట్లే. మీకు నచ్చిన చట్నీతో కలిపి తింటూ దోశను ఆస్వాదించండి.

తదుపరి వ్యాసం