Listening to Music | లేవగానే మంచి మ్యూజిక్ వినండి, పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి!
18 July 2022, 6:45 IST
- ఉదయం లేవగానే మంచి మ్యూజిక్ వింటే పాజిటివ్ వైబ్స్ పెరుగుతాయి. ఎలాంటి మూడ్ ఉన్నప్పటికీ తిరిగి హుషారైన మూడ్ లోకి వస్తారు. ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Morning Music
పొద్దున లేవగానే ఒక్కొక్కరి మూడ్ ఒక్కోలా ఉంటుంది. మనం ఎలాంటి ఆలోచనలతో అయితే నిద్రలేస్తామో, రోజంతా కూడా అదేవిధంగా గడుస్తుంది. అందుకే ఉదయం పూట సానుకూల ఆలోచనలను కలిగి ఉండాలి. బద్ధకంగా ఉండకుండా హుషారుగా పనులు చేసుకోవాలి. లేచిన వెంటనే మీ మూడ్ బాగాలేకపోతే మ్యూజిక్ ప్లేజాబితాను ఆన్ చేసి, మీకు ఇష్టమైన హిట్ పాటలను వినండి. తక్షణమే మీ మూడ్ మారిపోతుంది, మీరు ఎనర్జిటిక్ గా మారతారు. మ్యూజిక్ మీ మూడ్ ని ట్యూన్ చేస్తుందని పలు నివేదికలు పేర్కొన్నాయి.
ఉదయాన్నే మ్యూజిక్ వినడం వలన మీరు రోజంతా చురుకుగా ఉంటారు, మీ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.
1. ఇది కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది
ఒక అధ్యయనం ప్రకారం, మీకు ఇష్టమైన సంగీతాన్ని వినడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. సంగీతం వింటున్నప్పుడు ఒత్తిడి సమయంలో విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. డోపమైన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఆనందాన్ని కలుగజేసే 'హ్యాపీ హార్మోన్ల'లో ఒకటి. దీంతో ఆందోళన, నిరాశ వంటి ప్రతికూల భావాలు తగ్గిపోయి, మీలో సానుకూల దృక్పథాన్ని పెంచుతాయి. కాబట్టి మీరు నిద్రలేచిన తర్వాత నిరాశగా ఉంటే మ్యూజిక్ వినాలని చెబుతున్నారు.
2. జ్ఞాపకశక్తి పెరుగుతుంది
ఉల్లాసవంతమైన మ్యూజిక్ వింటున్నపుడు మీ అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. మ్యూజిక్ మీ జ్ఞాపకాలను ప్రేరేపిస్తుంది. జ్ఞాపకాలు ఏర్పడినప్పుడు, న్యూరాన్లలోని సమూహాలు తిరిగి సక్రియం అవుతాయి. క్రమంగా మీ జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
సంగీతం వినడం వల్ల మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. ట్యూన్‌ల నుంచి వచ్చే లయబద్ధమైన శబ్దాలు శరీరంలో సహజంగానే యాంటీబాడీల ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి అనారోగ్యం సమయంలో మీరు వేగంగా కోలుకోగలుగుతారు. ఒక అధ్యయనం ప్రకారం, ఉదయన్నే మంచి మ్యూజిక్ వింటే అది మానసిక స్థితికి గణనీయంగా తోడ్పడుతుంది. శ్రావ్యమైన ధ్వనితో మేల్కొన్నట్లయితే, ఉదయం పూట గజిబిజిగా అనిపించదు. మీరు మరింత అప్రమత్తంగా ఉంటారు. ఇది ఉత్తేజకరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
4. క్రియేటివిటీ మెరుగుపడుతుంది
ఆ కంప్యూటర్ డెస్క్ లేదా ల్యాప్‌టాప్ ఆన్ చేసి పని ప్రారంభించే ముందు మీ హెడ్‌ఫోన్‌లను ఆన్ చేసి, కొంత సంగీతాన్ని వినండి, ముఖ్యంగా సంతోషకరమైన ట్యూన్‌లను వినండి. ఈ రకమైన జింగిల్స్ మిమ్మల్ని మరింత సృజనాత్మక వ్యక్తిగా మారుస్తాయి. మీరు ఏదైనా ఆలోచిస్తే మీ మైండ్ లో ఐడియాల ప్రవాహం కొనసాగుతుంది. తద్వారా మీ పనితీరు మెరుగుపడుతుంది. మీలో సృజనాత్మకత పెరుగుతుంది.